-ఈత వచ్చిన కొడుకు మడుగులో మునిగాడంటే నమ్మలేకపోతున్నాం
– న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు, తిలక్‌నగర్ వాసుల ఆందోళన
రుద్రంపూర్, సెప్టెంబర్ 28 : ‘‘సముద్రంలో ఈత కొట్టే నా కొడుకు చిన్న మడుగులో పడి మృతి చెందాడంటే ఎలా నమ్మాలి?’’ అంటూ మృతుడి తల్లి గడ్డం దుర్గ కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతదేహంతో కుటుంబ సభ్యులు, తిలక్‌నగర్ కాలనీవాసులు కలిసి యువకుడిని తీసుకెళ్లినట్లు చెబుతున్న వారి ఇంటి ముందు ధర్నాకు దిగారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని తిలక్‌నగర్‌కు చెందిన కత్తుల భార్గవ్, మాదాసు పారిష్, మౌర్య రాహుల్, గడ్డం మధు అలియాస్ గడ్డం బాలరాజు (23) శనివారం రాత్రి డోర్నకల్ మండలం కమలాపూర్‌లోని భార్గవ్ అత్తగారింటికి వెళ్లారు. ఆదివారం ఉదయం డోర్నకల్ సమీపంలోని మున్నేరు వాగులో ఈతకు వెళ్లగా ఈత కొడుతున్న గడ్డం మధు అలియాస్ బాలరాజు నీటిలో మునిగి మృతి చెందినట్లు సమాచారం.
ఘటనపై డోర్నకల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే బాలరాజు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘నా కొడుకుకు ఈత బాగా వచ్చు. అలాంటి వాడు నీటిలో మునిగి చనిపోయాడంటే నమ్మలేకపోతున్నాం. ఇంట్లో ఉన్న నా కొడుకును తీసుకెళ్లి శవంగా అప్పగించారు’’ అంటూ తల్లి దుర్గ కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని, సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
బాలరాజు ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భార్య రూప ప్రస్తుతం ఏడో నెల గర్భిణిగా ఉందన్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవించే తమ కుటుంబానికి బాలరాజు అండగా ఉండేవాడని, అతని మృతితో కుటుంబం దిక్కులేనిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలరాజు భార్య, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తిలక్‌నగర్ కాలనీవాసులు మృతదేహంతో ధర్నా నిర్వహించారు. యువకుడి మృతికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసి, బాధ్యులెవరైనా ఉంటే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇన్చార్జి సీఐ కరుణాకర్, టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

మున్నేరులో యువకుడి మృతి.. మృతదేహంతో కుటుంబ సభ్యుల ధర్నా