మున్సిపల్ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో నే‘తలరాతలు’ తేలనున్నాయి. కింగ్‌లు.. కింగ్ మేకర్లు ఎవరనేది తెలిసిపోనుంది. శుక్రవారం జరిగే పుర పాలికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. కౌంటింగ్ మొదలైన రెండు గంటల తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. సర్వశక్తులు ఒడ్డి పోరాడిన అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. విజయంపై బీఆర్ఎస్ నమ్మకంతో ఉండగా, అధికార కాంగ్రెస్‌లో ఆందోళన కనిపిస్తున్నది. బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో పోటీ పడక డీలా పడిపోయింది. అయితే అధిక శాతం నమోదైన ఓటింగ్ ఎవరికి అనుకూలిస్తుందో? ఎవరిని పరాజయం పాలుచేస్తుందో? అనే చర్చ జోరుగా సాగుతున్నది. అధికార పార్టీని కలవరపెడుతున్నది. కాగా, లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు.
– వరంగల్, ఫిబ్రవరి 12
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్పిపాలిటీల పరిధిలోని 260 వార్డులకు బుధవారం ఎన్నికలు జరుగగా, బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపర్చిన విషయం తెలిసిందే. ఆయా మున్సిపాలిటీ కేంద్రాల్లో కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మహబూబాబాద్, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట, పరకాల, ములుగు, స్టేషన్‌ఘన్‌పూర్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆయా మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా ఒకటి నుంచి ఆరు రౌండ్లలో కౌంటింగ్ పూర్తికానుంది. నర్సంపేటలో ఆరు, పరకాలలో నాలుగు, భూపాలపల్లి, ములుగు, వర్ధన్నపేటలో మూడు, మిగతా ఏడు మున్సిపాలిటీల్లో ఒకే రౌండ్లో లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్, ఆ తదుపరి బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమైన రెండు గంటల నుంచి మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
ఎవరి ధీమా వారిదే..
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే అన్నట్లుగా ఉంది. అన్ని పార్టీలు అనుకూల అంశాలను అంచనాలు వేసుకుని విజయంపై ఆశలు పెట్టుకున్నారు. 12 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ నమ్మకంతో ఉండగా ఫలితాలు ఎలా ఉంటాయోనని కాంగ్రెస్ నాయకులు కలవరపడుతున్నారు. సమన్వయంతో చేసిన ప్రచారం సత్ఫలితాలిస్తుందనే ఆశాభావం బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతున్నది.
తేల్చేనా.. ముంచేనా?
ఈ ఎన్నికల్లో నమోదైన అధిక ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుందనే దానిపై జోరుగా చర్చసాగుతోంది. అన్ని పార్టీలు తమకే లాభం జరుగుతుందని అంచనా వేసుకుంటున్నాయి. ఈ ఓటింగ్ శాతం ప్రతిపక్ష బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. రెండేళ్ల పాలనలో మూటగట్టుకున్న ప్రజా వ్యతిరేకత అధిక ఓటింగ్ రూపంలో నష్టం కలిగిస్తుందేమోనన్న ఆందోళన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అధిక ఓటింగ్ అభ్యర్థుల తలరాతలు మార్చడం ఖాయంగా కనిపిస్తున్నది.