Shubman Gill | భారత వన్డే జట్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ప్రయాణం ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. భవిష్యత్ నాయకుడిగా భారీ అంచనాల మధ్య బాధ్యతలు చేపట్టిన గిల్.. కెప్టెన్‌గా ఆడిన తొలి 12 వన్డేల్లో నిరాశాజనకమైన రికార్డును నమోదు చేశాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను కోల్పోవడంతో గిల్ నాయకత్వంపై విమర్శలు మరింత పెరిగాయి. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిల్ ఇప్పటివరకు నాలుగు వన్డే సిరీస్‌లకు నాయకత్వం వహించాడు. అయితే అందులో కేవలం అఫ్గానిస్థాన్‌పై మాత్రమే భారత్ సిరీస్ విజయం సాధించింది. మిగిలిన మూడు సిరీస్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తాజా సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచినప్పటికీ, తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది.
భారత కెప్టెన్ల తొలి 12 వన్డే మ్యాచ్‌ల గణాంకాలను పరిశీలిస్తే రోహిత్ శర్మ 10 విజయాలతో 83.34 శాతం గెలుపు శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. విరాట్ కోహ్లీ 9 విజయాలతో 75 శాతం గెలుపు శాతాన్ని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 8 విజయాలతో 66.67 శాతం, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ చెరో 7 విజయాలతో 58.34 శాతం గెలుపు శాతాన్ని నమోదు చేశారు. శుభ్‌మన్ గిల్ మాత్రం తొలి 12 వన్డేల్లో 6 విజయాలు, 6 ఓటములతో 50 శాతం గెలుపు శాతాన్ని మాత్రమే నమోదు చేశాడు. ఇదే గణాంకాలను గతంలో సౌరవ్ గంగూలీ, సురేష్ రైనా, మహ్మద్ అజారుద్దీన్ కూడా నమోదు చేశారు.
ప్రస్తుతం భారత జట్టు పునర్నిర్మాణ దశలో ఉండటం గిల్‌కు పెద్ద సవాల్‌గా మారింది. జట్టులో తరచూ మార్పులు జరగడం, మంచి కాంబినేషన్ లేకపోవడం అతని నాయకత్వంపై ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరమవ్వడంతో రెండో శ్రేణి బౌలింగ్ దళంతోనే మ్యాచ్‌లు ఆడాల్సి వస్తోంది. ఈ పరిస్థితులు కూడా గిల్‌కు ప్రతికూలంగా మారాయి. అయితే గిల్ కెరీర్‌ను ఇప్పుడే తేల్చేయడం తొందరపాటు అవుతుంది. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా తన తొలి 12 వన్డేల్లో కేవలం 5 విజయాలు మాత్రమే సాధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత తన నాయకత్వాన్ని మెరుగుపరుచుకుని భారత్‌కు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించి దిగ్గజ కెప్టెన్‌గా నిలిచారు. ఇప్పుడు గిల్ ముందున్న సవాలు కూడా ఇదే. ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, వ్యూహాల్లో మార్పులు చేసి జట్టును విజయాల బాట పట్టిస్తేనే తనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం ఇవ్వగలడు.