PV Sindhu భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తాజాగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళితో సోషల్ మీడియాలో జరిపిన సరదా సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది. జపాన్ ఓపెన్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన సింధును అభినందిస్తూ రాజమౌళి చేసిన ట్వీట్‌కు ఆమె ఇచ్చిన ఆసక్తికరమైన రిప్లై నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.ఇటీవల జరిగిన జపాన్ ఓపెన్ టోర్నీలో టైటిల్ గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. ఆమె విజయంపై రాజకీయ, క్రీడా, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజమౌళి కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ.. జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించావు. వాట్ ఏ ఛాంపియన్ కమ్‌బ్యాక్.. దేశం మొత్తం నీ గురించి గర్విస్తోంది. అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.
దీనికి స్పందించిన పీవీ సింధు.. థ్యాంక్యూ సో మచ్ రాజమౌళి సర్. మీ ‘వారణాసి’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఒకవేళ మీరు తెరకెక్కించే ఏ సినిమాలోనైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ పాత్ర ఉంటే.. మీ కొత్త హీరోయిన్గా నటించడానికి నేను ఎంతో సంతోషిస్తాను అంటూ నవ్వుతున్న ఎమోజీలతో సరదాగా బదులిచ్చారు. సింధు చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె నిజంగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా? లేక సరదాగా చేసిన వ్యాఖ్యేనా? అనే చర్చ నెటిజన్ల మధ్య సాగుతోంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘వారణాసి’ షూటింగ్ తుది దశకు చేరుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ తొలి వారంలో చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రియాంక చోప్రా కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.