ఇటీవల ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న మలయాళ రాజకీయ చిత్రం ‘ప్రతిఛాయ‘ చూశాను. రాజకీయ ఎత్తుగడలు ఎంత సంక్లిష్టంగా ఉంటాయో ఈ సినిమా ఆసక్తికరంగా చూపించింది. అయితే ఈ సినిమాలో నన్ను ఎక్కువగా ఆలోచింపజేసిన అంశం – కార్పొరేట్ సంస్థలు రాజకీయాలను, ముఖ్యంగా మీడియాను తమ చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రజాస్వామ్యంపై పడే ప్రభావం. సినిమాలో ఒక సందర్భంలో వచ్చే సంభాషణ ఇలా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలకు సొంతంగా మీడియా ఉంటే నిజం అబద్ధం అవుతుంది. అబద్ధం నిజం అవుతుంది. ఇది అక్షరాలా నేటి వాస్తవం.
ఒకప్పుడు మీడియా అంటే ప్రజల గొంతుకగా ఉండేది. ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, అధికారంలో ఉన్నవారి తప్పులను బయటపెట్టడం దాని ప్రధాన బాధ్యత. కానీ మీడియా సంస్థలే భారీ కార్పొరేట్ సంస్థల ఆధీనంలోకి వెళ్లినప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఏ వార్తను ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి? దేనిని ప్రజలకు దూరంగా ఉంచాలి? అనే నిర్ణయాలను ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు శాసించే ప్రమాదం ఉన్నది. మన దేశంలో పదేండ్లలో ప్రధాన మీడియా సంస్థల్లో అనేకం పారిశ్రామికవేత్తలతో సంబంధం ఉన్న కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. వారికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉన్నాయి. అలాంటి యాజమాన్య మార్పుల నేపథ్యంలో మీడియా ఎలాంటి వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నది? ఎలాంటి వార్తలను విస్మరిస్తున్నది? అనేది ప్రతి పౌరుడూ గమనించాల్సిన అంశం.
రూపాయి విలువ పతనం, విపరీతంగా పెరుగుతున్న ధరలు పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. కుటుంబాల ఆదాయం పెరుగలేదు. రోజువారీ అవసరాల ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యుల నిత్య జీవితాలు భారంగా మారిపోయాయి. కానీ ఈ సమస్యలపై నిరంతర చర్చ, లోతైన విశ్లేషణ, ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం మీడియాలో ఎంతవరకు కనిపిస్తున్నది? విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యాలు, నాణ్యమైన విద్య, వైద్యం సామాన్యుడికి అందకపోవడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో వైఫల్యం వంటి కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది.
కానీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి అసంబద్ధ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రజల్లో ఉద్వేగాలను రెచ్చగొట్టే వార్తలను విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రతిపక్షాల ప్రభుత్వాలు వారి వారి రాష్ర్టాల్లో మంచి పాలన అందిస్తుంటే ఓర్వలేక వారిపై ఆరోపణలు గుప్పించి, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని కక్షపూరితంగా వ్యవహరించడం, ఇతర పార్టీలకు చెందిన నాయకులను బెదిరించి వారి పార్టీలో చేర్చుకోవడం మనం చూస్తున్నాం. వీటిపైనా మీడియాలో చర్చలు ఉండడం లేదు.
ధరల పెరుగుదల, నిరుద్యోగం, విద్య, వైద్యం, ఉపాధి వంటి జీవన ప్రమాణాలను నిర్ణయించే అంశాలపై ప్రజలు ప్రశ్నలు అడుగకుండా, వారిని నిరంతరం భావోద్వేగ అంశాల చుట్టూ తిప్పడం ఒక రాజకీయ వ్యూహంగా మారింది. ఇది యువతను, మధ్యతరగతి ప్రజలను ఒక మత్తులో ఉంచి విచక్షణ కోల్పోయేలా చేస్తున్నది. మన రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, మంచిని మరుగుపరిచి, అబద్ధాలను ఓ వర్గం మీడియా ప్రచారం చేసింది. కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చి మభ్యపెట్టడం వల్ల ప్రజలు మోసపోయారు. ఫలితంగా నేడు జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోయింది. తెలంగాణ అభివృద్ధి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఒకవేళ మీడియా స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కావు. ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉండేది.
ప్రజాస్వామ్యంలో మీడియా అంటే కేవలం వార్తలను అందించే సంస్థ కాదు. అది ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కీలకమైన వారధి. ప్రభుత్వం, ప్రతిపక్షంలో ఎవరు తప్పు చేసినా మీడియా ప్రశ్నించాలి. కార్పొరేట్ సంస్థలు తప్పు చేస్తే కూడా ప్రశ్నించాలి. మీడియా కార్పొరేట్ ప్రయోజనాలకు లొంగకుండా ప్రజా ప్రయోజనాలకు అద్దంగా నిలిచినప్పుడే, నిజం నిజంగానే ఉంటుంది. నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. లేకపోతే ప్రతిఛాయలో చెప్పినట్టుగా నిజం అబద్ధంగా మారుతుంది, అబద్ధం నిజంగా మారుతుంది. అప్పుడు ప్రమాదం ఒక వార్తకు, ఒక ప్రభుత్వానికి, ఒక పార్టీకి మాత్రమే కాదు. ప్రజాస్వామ్యానికే ప్రమాదం. అందుకే ప్రజలు కూడా వార్తలను గుడ్డిగా నమ్మకుండా, ఎవరు, ఏ విషయాన్ని, ఎందుకు చెప్తున్నారు? ఏ విషయాన్ని చెప్పడం లేదు? అనే ప్రశ్నలు వేసుకోవాలి. విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.