IPS Trainee | హైదరాబాద్ సిటీబ్యూరో/వెంగళరావునగర్, జూలై 20 (నమస్తే తెలంగాణ): సహచర ట్రైనీపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆ యువతితోపాటు మరో ముగ్గురి కారణంగా తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు ఉదయకృష్ణారెడ్డి ఓ నోట్ రాసినట్టు తెలుస్తున్నది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆరోపించిన లైంగిక వేధింపులు పూర్తిగా అవాస్తవమని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తన వాట్సాప్ స్టేటస్‌లో సైతం తాను తప్పు చేయలేదంటూ అతడు ఓ మెసేజ్ పెట్టుకున్నట్టు తెలిసింది. తనతోపాటు నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్‌కృష్ణారెడ్డి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ బాధిత ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఉదయ్‌కృష్ణారెడ్డి సోమవారం ఉదయం గుర్త్తుతెలియని ద్రవం తాగి అపస్మారక స్థితికి చేరడంతో.. కుటుంబసభ్యులు ఎస్ఆర్ నగర్‌లోని జయంతి దవాఖానలో చేర్చారు. తనపై కేసు నమోదైన నేపథ్యంలో న్యాయసలహా కోసం అమీర్‌పేట, లీలానగర్‌లో ఉంటున్న తన స్నేహితురాలైన అడ్వకేట్ నివాసానికి వచ్చిన ఉదయ్‌కృష్ణారెడ్డి ఆ ఇంటి సమీపంలోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డిని ఉదయం 9.30 గంటలకు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం స్పృహలో లేడని, 24 గంటలు గడిస్తే తప్ప ఏ విషయం చెప్పలేమని డాక్టర్లు అన్నారు.
నోట్లో తాను కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌తో సంవత్సరకాలంగా రిలేషన్షిప్లో ఉన్నానని ఉదయ్ పేర్కొన్నారు. ఆమెకు వివాహమైన తర్వాత కూడా తమ ఇద్దరి మధ్య ఈ బంధం కొనసాగిందని, ఈ క్రమంలో ఆమెనే స్వయంగా తన గది వద్దకు వచ్చి తలుపు తీయాలని గొడవ చేసిందని, ఇందుకు సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్ ఫోన్లో ఉన్నాయని తెలిపారు. తమ సంభాషణలు, చాటింగ్‌లు, వీడియోలకు సంబంధించి అన్ని రకాల ఆధారాలు తన ఫోన్లో భద్రంగా ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని ఆ లేఖలో వివరించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి ఆ యువతి, ఆమె భర్తతోపాటు మరో ఇద్దరు స్నేహితులు కారణమని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.