రెండు సార్వభౌమ దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే అందులోని అంశాలపై ఇరు పక్షాలకూ సంపూర్ణమైన అవగాహన ఉన్నట్టు భావిస్తాం. అంతా పారదర్శకంగా ఉంటుందని ఆశిస్తాం. అమెరికాతో భారత్ కుదుర్చుకున్నట్టు చెప్తున్న వాణిజ్య ఒప్పందం విషయంలో మాత్రం ఇలాంటివేవీ కనిపించడం లేదు. బర్రెలను నీళ్లలోకి తోలి కొమ్ములపై బేరాలు సాగించినట్టు ఏయే అంశాలపై ఎవరెవరు, ఏమేం అంగీకరించారనేది ఇప్పటికీ స్పష్టత రావడం లేదు. పాకిస్థాన్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ఉదంతం ఇంకా మనం మరచిపోలేదు. అదే తరహాలో ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి కూడా ట్రంప్ లేదా అధ్యక్ష భవనం నుంచి ప్రకటనలు వెలువడుతుంటే భారత్ నేతలు ఆ ప్రకటనలపై స్పందించడం మాత్రమే కనిపిస్తున్నది. ఆ స్పందనలు కూడా ఏదో దాస్తున్నట్టుగా, తప్పు చేయలేదని సమర్థించుకుంటున్నట్టుగా ఉంటున్నాయి. ఈ లోగా చమురు అంశంపై విదేశాంగ, వాణిజ్య మంత్రుల మధ్య పొరపొచ్చాలు బయటపడ్డాయి. అసలు ఏమి జరుగుతున్నదో మంత్రులకైనా తెలుసా అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఒప్పందం కుదిరినట్టుగా వెలువడిన ఉమ్మడి ప్రకటనలో లేని అంశాలతో మొన్న సోమవారం వైట్ హౌస్ ఒక ఫ్యాక్ట్ షీట్ విడుదల చేసింది. అందులో ముఖ్యంగా పప్పు ధాన్యాల ప్రస్తావన ఉండటం ప్రకంపనలు సృష్టించింది. డిస్టిలరీలకు అవసరమయ్యే ధాన్యాలు, ఎర్రజొన్నలు, డ్రైఫ్రూట్స్, తాజా పండ్లు, పండ్ల రసాలు, సోయాబీన్ నూనె, వైన్, ఇతర మద్యాలు మొదలైనవి వాటితోపాటే ఉన్నాయి. ఈ అమెరికా ఉత్పత్తులను భారత్ ఎలాంటి సుంకాలు వేయకుండా కొంటుందని ఫ్యాక్ట్‌షీట్‌లో వెల్లడించారు. దీనిపై భారత్‌లో గగ్గోలు బయలుదేరడంతో మరుసటి రోజు వైట్‌హౌస్ విడుదల చేసిన ఫ్యాక్ట షీట్లో కేవలం పప్పుధాన్యాల ప్రస్తావన తొలగించడం గమనార్హం.
ఓవైపు అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు ద్వారాలు తెరుస్తూనే, భారత్ రైతుల ప్రయోజనాలు కాపాడుతామని అనడం ఏమిటో? నిజానికి అమెరికా సుంకాలు సుమారు 2.5 శాతం నుంచి 25కు, ఆపై రష్యా చమురు కొంటున్నందుకు అదనంగా 25 శాతం పరిహార సుంకం, మొత్తం 50 శాతానికి పెరిగాయి. ఇప్పుడు టారిఫ్ 18 శాతానికి తగ్గించినట్టు ట్రంప్ చెప్తున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే టారిఫ్ భారీగా పెంచేసి, తీవ్ర ఉత్కంఠ తర్వాత తగ్గించినట్టు చూపుతున్నారు. కానీ నిజానికి అమెరికా టారిఫ్ 2.5 నుంచి 18 శాతానికి పెరిగినట్టు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇదేదో ఘనవిజయం అయినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు విజయోత్సవాలు జరుపుకుంటుండటం వింతల్లోకెల్లా వింత.
పైగా రష్యా నుంచి చమురు కొనడం ఆపుతామని, వెనెజువెలా నుంచి కొంటామని భారత్ ఒప్పుకుంటేనే పరిహార సుంకం పోతుంది అనే సంగతి గుర్తుంచుకోవాలి. అందుకు భారత్ ఒప్పుకున్నదా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. మరోవైపు బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఉత్పత్తుల్లో కొంత పరిమాణంపై జీరో సుంకం వేస్తామని అమెరికా ప్రకటించడం భారత వాణిజ్య వర్గాలను నిరాశకు గురిచేసింది. ఇలాంటి డైలీ సీరియల్ తరహా షాక్‌ల వల్ల ప్రభుత్వం అమెరికాతో రాజీ పడిందన్న భావన వ్యక్తమవుతున్నది. ఒప్పందం అంశాల్లో దాగుడుమూతల తరహాలో ఆవిష్కృతమవుతున్న మార్పులు, చేర్పులు దేశ ప్రజలను, ముఖ్యంగా రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అందువల్ల మరింత కాలహరణం చేయకుండా ఒప్పందంలోని అన్ని అంశాలనూ కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ముందుంచడం శ్రేయస్కరం.