హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ దాదాపు ఖరారైనట్టే కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాట పడుతుండగా, తాజాగా తనను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కూడా ఢిల్లీ వెళ్లారు. గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న గడ్డం ప్రసాద్‌కుమార్ శుక్రవారం మధ్యాహ్నం నేరుగా రాహుల్‌గాంధీని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ తాను తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన విషయాన్ని రాహుల్‌గాంధీకి వివరించారు. గతంలో, 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తాను మంత్రిగా పనిచేశానని, విశేష అనుభవం ఉన్నదని, అందువల్ల తనకు మంత్రి పదవి ఇస్తే ప్రజలకు, ప్రభుత్వానికి సేవలందిస్తానని ఆయన రాహుల్‌గాంధీకి చెప్పినట్టు తెలిసింది.
రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన దళిత వర్గాల నుంచి వచ్చిన తనకు స్పీకర్ పదవి ఇచ్చారని, అయితే, మంత్రిగా ప్రజలకు సేవలందించాలన్నదే తన కోరిక అని, పార్టీ ఆదేశిస్తే మంత్రిగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టు తెలిసింది. ఏ శాఖ ఇచ్చినా పర్వాలేదని చెప్పినట్టు సమాచారం. రాబోయే రెండేండ్లు పార్టీకి అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో తనలాంటివారి అనుభవాన్ని పార్టీ, ప్రభుత్వం ఉపయోగించుకోవాలని, తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. రాష్ట్ర మంత్రివర్గం మొత్తం శుక్రవారం పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో ఉన్న సమయంలో స్పీకర్ ఢిల్లీ పర్యటన పార్టీలో చర్చనీయాంశమైంది. గత కొన్ని రోజులుగా స్పీకర్‌కు మంత్రి పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో మంత్రి పదవి కోసం ఆయన ఢిల్లీ వెళ్లడం, రాహుల్‌గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. గడ్డం ప్రసాద్‌కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో రాహుల్‌గాంధీ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.
రామ్మోహన్‌రెడ్డి కూడా ప్రయత్నం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా తన వంతు ప్రయత్నాలు చేసుకొంటున్నారు. తాజాగా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కూడా మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు. పలువురు పార్టీ సీనియర్లతో భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌తోపాటు పార్టీ అగ్రనేతలను కోరినట్టు తెలుస్తున్నది.
భట్టి ప్రయత్నాలు
మరోవైపు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పదవీ గండం ఉన్నదని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యాంలో ఆయన తన పదవిని యధాతథంగా కాపాడుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించి స్పీకర్ స్థానంలో కూర్చోబెడుతారనే చర్చ నడుస్తున్నది. అయితే, స్పీకర్ స్థానంపై భట్టి విక్రమార్క ఆసక్తిగా లేరని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రయత్నాలను ముమ్మరం చేసుకొంటున్నారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ర్టానికి రాజ్యసభ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడి నుంచి శనివారం ఢిల్లీకి వెళ్తారని చెప్తున్నారు. ఢిల్లీలో ఆయన పార్టీ పెద్దలను కలిసి తన మంత్రి పదవికి ఢోకాలేకుండా చూడాలని కోరుతారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.