జరిగిన కథ
ఈసాణుడు సౌగంధికను వెతికి పట్టుకొని రమ్మని మనుషులను పంపుతాడు. తన తండ్రిని చిలుకవాడకు తరలించారని తెలుసుకొని వామదేవుణ్ని అక్కడికి వెళ్లమంటాడు జయసేనుడు. తాను కర్తవ్య నిర్వహణకై వెళ్తానని చంద్రహత్థితో చెబుతాడు పోటిసుడు. సౌగంధిక కోసం సవరసత్తి పంపిన మనుషులు తిరిగి వస్తారు. ఆ తర్వాత..
“అమ్మా! మేం వెళ్లేటప్పటికే మంత్రిగారి మనుషులు ఆ ఇంటిని పసిగట్టి అక్కడికి చేరుకున్నారమ్మా!”.. తమ నిస్సహాయతను ప్రకటిస్తూ తలవంచుకున్నది సవరసత్తి దాసి. ఒక్కక్షణం భయపడ్డది సవరసత్తి. అంతలోనే ఏదో ధైర్యం ఆమె మనసును సమాధాన పరిచింది. “మంచివాళ్లను దుర్మార్గులు తేలికగా వంచిస్తుండవచ్చు గాక! కానీ వాళ్లకు అంత సులభంగా ఏ పనులూ జరగవు. సౌగంధిక బేల కావచ్చు కానీ అబలకాదు! అది అంత తేలికగా లొంగే రకం కాదు. లేకుంటే రెండేళ్లుగా ఆ పిల్ల కన్నెరికం కాపాడుకుంటూ వచ్చేదేనా??? మీరు మాత్రం ఏమరుపాటుగా ఉండకండి. ప్రతిక్షణం ఆ ఇంటిని కనిపెట్టుకొని ఉండి, నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి!” అన్నది. “చిత్తం తల్లీ!” అంటూ దాసీలు సెలవు తీసుకున్నారు. అప్పుడు సవరసత్తి ఇట్లా అనుకున్నది.. ‘పాముకు పాలు పోస్తే అది మనల్నే కాటేస్తుంది అనేది నాకు ఆలస్యంగా తెలిసి వచ్చింది. ఆశ్రయమిచ్చి పోషించిన మహారాజునే వంచిస్తున్న ఈ దుర్మార్గునితో చేతులు కలిపి, వీడు చెప్పినట్లుగా ఆడుతున్నందు వల్ల నాకు తగిన శాస్తి జరిగింది. దెబ్బ నా చెంప మీద కాదు, గుండెల్లో తగిలింది. ఆ మంట ఆ ఈసాణుడిని కాటికి పంపే దాకా ఉపశమించదు!’.. ఆమె హృదయంలోని జ్వాల లావాలా కన్నీరై పొంగింది. సవరసత్తి దాసీలు సౌగంధిక ఇల్లు చేరడానికి ముందు ఒక సంఘటన జరిగింది.. “అమ్మా! ఆ దుర్మార్గులు నిన్ను విడిచేటట్లు లేరు. నీవు ఎక్కడికైనా పారిపో!” జరుగుతున్న పరిణామాలు గమనించి, ఆందోళనగా సౌగంధికతో అన్నది తల్లి విలాస.
ఒక్క క్షణం ఏం చేయాలో పాలుపోలేదు సౌగంధికకు. రెండేళ్లుగా తగిన మగవాడి కోసం ఎదురు చూస్తుంటే మనసుకు నచ్చినవాడు ఈ సాయంత్రమే కంటపడ్డాడు. ‘వానితో జీవితాన్ని పండించుకోవచ్చు’ అనుకునే లోపు.. ‘నేను నీ అన్నను!’ అంటూ ఒకడు అడ్డు వచ్చినాడు. ఇద్దరూ తన రెండు కన్నుల్లా అనిపించినారు. అంతలోనే అదృశ్యమైనారు. వస్తామన్న సమయం దాటిపోయింది. ఇప్పుడు మంత్రిగారి మనుషులు వచ్చినారని అమ్మ చెబుతున్నది.. ఎవరో తలుపు బాదుతున్న శబ్దంతో ఆమె ఆలోచనలు తెగిపోయినాయి! “సౌగంధికా! తలుపు తెరువు! నేను దేవను.. వామదేవను!” ఆ గొంతు వినగానే పరుగెత్తుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది సౌగంధిక. నిజమే! అతను వామదేవుడే!! నమ్మలేనట్లు అతన్ని చూసింది. దగ్గరికి వెళ్లి చేయి పట్టుకున్నది. ఏదో బలమైన శక్తి మెరుపులా అతని శరీరం నుంచి తన ఒంటిలోకి పాకిన అనుభూతి! మొదటిసారి అతను తన కాలి ముల్లు తీసినప్పుడు కలుగని భావన ఇప్పుడు కలిగింది అంటే.. అప్పటికి అతని పట్ల ఏ భావము లేదు! ఆ తర్వాతనే ఆయన మీద ఇష్టం కలిగింది. ఇప్పుడు అది కోరికగా మారింది. ఆ కోరిక తన నరాలన్నిటా నిండి, ఉద్వేగం పెంచి, శరీరంలో ప్రకంపనలు కలిగిస్తున్నది. అంతా గమనిస్తున్న విశాల.. ఆ యువకుడిని లోపలికి రమ్మని ఆహ్వానించి, తలుపులు మూసింది. ‘ఎంతైనా నా కూతురు కులవృత్తిని కొనసాగించే నెరజాణ అవుతుంది’ అని మనసులోనే అభినందించింది. అప్పుడు ఆమె అనుభవం ఇట్లా స్పందించింది.. ‘పతినిగాంచినంత పావనాంగన లెంత పులకరింపనేమి, పలకరింప వెనుక ముందయేరు; వెలసతులకు నది అడ్డురాదు గాక యనుట నిజము!
(పుణ్య స్త్రీలకు ఎదురుచూస్తున్న తమ భర్త కనిపించగానే ఒడలు పులకరిస్తుంది. అయినా వాళ్లు అందరూ చూస్తుండగా వెళ్లి పలకరించలేక తమను తాము నిగ్రహించుకుంటారు. మా వృత్తి వాళ్లకు అటువంటి మొగమాటలు ఉండవు. నిజమే!). లేకుంటే మా సౌగంధి ఆ పిల్లవాడిని అట్లా పట్టుకోగలదా..’ అని తనలో తాను మురిసిపోతూ ఆ ఇరువురిని చూసింది విశాల. సౌగంధికా వామదేవులు ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటున్నారు. అతనికి ఏదో కొత్త లోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్నది. ఆమెకు తన కలల లోకంలోకి కోరుకున్న అందాల రాకుమారుడు ప్రవేశించినట్లు ఉన్నది. అదే అదనుగా తన మనసులోని మాటను బయటపెట్టేందుకు సిద్ధమైనాడు వామదేవుడు. సరిగ్గా అప్పుడే తలుపులు భళ్లున తెరుచుకున్నాయి. ఆనందంలో తలుపులు మూసి, గడియ పెట్టడం మరచిపోయింది విశాల. పర్యవసానంగా ఏం జరుగుతుందో గ్రహించేలోపు బాణాల్లా దూసుకొని వచ్చిన ఈసాణామాత్యుని అనుచరులు వామదేవుని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. అతను తేరుకొనే లోపుననే సౌగంధికను కూడా బంధించినారు ఆగంతకులు. అడ్డుకొనబోయిన విశాలను బలంగా తోసేయడంతో నుదురు స్తంభానికి కొట్టుకొని స్పృహ కోల్పోయింది ఆమె. “వాడు దొరికినాడు. వీడు దొరకడేమో అనుకున్నాం. ఇద్దరూ పట్టుబడ్డారు, సన్నాసులు! ఇక అమాత్యులవారు మనల్ని కానుకలతో ముంచెత్తుతారు!” అన్నాడు వాళ్లలో ఒకడు. ‘ఆ రెండవవాడు జయసేనుడు కాదు కదా!’ అనుకున్నాడు వామదేవుడు.
సంధించిన బాణంలా దూసుకొని పోతున్నది గుర్రం. దానిమీద ఉన్న రౌతు కళ్లనుంచి కన్నీళ్లు జలపాతానికి ఎదురెక్కే చేపల్లా ఎగిరెగిరి రెండు వైపులా దూకుతున్నాయి. కర్తవ్యం అతణ్ని ముందుకు పరిగెత్తిస్తున్నా.. ప్రియురాలితో అతని స్మృతులు విలోమంగా అతణ్ని వెనక్కి లాగుతున్నాయి. ఆ రౌతు పోటిసుడు; అతని ప్రేయసి చంద్రహత్థి. బయలుదేరడానికి ముందు ఒక గడియ తనతో ఏకాంతంగా గడుపుమని చివరి కోరికగా కోరింది చంద్రహత్థి. కోరికలను జయించడం బుద్ధ దేవుడు చెప్పినంత తేలిక కాదని అనుభవంలోకి వచ్చింది అతనికి. ఇద్దరూ దట్టమైన కందిచేను మధ్యలో కాతలేని దంట్లను పరుపుగా చేసుకుని పడుకున్నారు. అతని ఎదనే దిండుగా చేసుకున్న చంద్ర ఒక మాట అన్నది.. ఆకసంబంత సువిశాల మైన యట్టి నీ యురము నెదిరించగా నెవరితరము? ఒక్క నా పయోధరముకే దక్కె శక్తి నీ పయిన ప్రేమ చేతనే నిజము బావ! (బావా! ఆకాశం వంటి విశాలమైన నీ ఎదను ఎదిరించడానికి ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. కానీ, నీ మీద ఉన్న ప్రేమ కారణంగా ఒక్కరికి ఆ శక్తి దక్కింది. అదే నా ఎద)” అంటూ తనను అల్లుకొని పోయింది. హఠాత్తుగా అతని ఆలోచనలు తెగిపోయినాయి. ఎదురుగా ఏదో కలకలం.. చుట్టూ పరికించి చూసినాడు. తానప్పుడు చిలుకవాడలో ఉన్నాడు. రాజభటులు ఒక యువతిని, ఒక యువకుణ్ని బంధించి తీసుకొని వెళుతున్నారు.
“దొంగల్లా మీదపడి బంధించడం కాదురా! మీరు వీరులైతే నన్ను ఎదిరించి పోరాడి ఓడించి, తీసుకొని పోండి!” అంటూ అరుస్తున్నాడు ఆ యువకుడు. ‘ఈ కంఠస్వరం నాకు బాగా తెలిసినట్లు ఉన్నది..’ అనుకుంటుంటే గుర్తొచ్చింది పోటిసునికి.. “అవును! ఇది అచ్చం మా చిన్నరాజా వారి స్నేహితుడు వామదేవుని గొంతే! అయినా ఆ దొరవారు ఇక్కడికి ఎందుకు వస్తారు? వచ్చినా ఈ వాడలో, ఈ పరిస్థితిలో ఉండరు కదా! ముందు నేను మల్లసు పర్వతం చేరుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకొని, ఆ సమూహం పక్కనుంచి గుర్రాన్ని వేగంగా ముందుకు దౌడు తీయించినాడు పోటిసుడు.
* * *
“అరెరే.. వీరు కుసుమ శ్రేష్ఠుల వారి సుపుత్రులా? పేరు జయసేనుడా? పాపం ఆసనానికి ఇంత బలంగా బంధించినారు ఎందుకు?” అని అతని కట్లు విప్పుతున్నట్లు నటించినాడు ఈసాణుడు. జయసేనునికి అంతా అయోమయంగా ఉన్నది. తల దిమ్మెక్కినట్లుగా ఉన్నది. అయినా ప్రయత్నపూర్వకంగా గడిచిన రోజు సంఘటనను గుర్తు చేసుకున్నాడు. నిన్న రాత్రి సముద్రతీరంలో తాను, వామదేవుడు సముద్రపు దొంగలతో పోరాడినారు. మావురాయడు చనిపోతూ తన తండ్రిని రాజభటులు బంధించినారని తెలిపినాడు. అంతలో మరొక యువకుడు.. మా నాయనను చిలుకవాడకు తరలించినారని తెలిపినాడు. అప్పుడు ఒక రాజభటుడు అతని తలనరికి పారిపోయినాడు. వాడిని వెంబడిస్తూ పరుగెత్తిన తనమీద సైనికులు దొంగచాటుగా, మూకుమ్మడిగా దాడి చేసినారు.. ఆయుధం తీసేటంత సమయం లభించలేదు. అంతలో తల మీద ఎవరో బలంగా మోదినారు. తర్వాత ఏం జరిగిందో తెలవదు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. ఈ ప్రదేశం.. ఈసాణుడు భయపడుతున్నట్లు నటిస్తూ.. “అబ్బో! మహావీరుడు అన్నారు కదా! కట్లు విప్పితే ముందు నా మీదనే దాడి చేస్తాడేమో! ఇప్పుడంత సాహసం వద్దులే..” అంటూ ఆగిపోయినాడు. అప్పుడే అతని భటుడు ఒక ఉన్నతాసనం తెచ్చి జయసేనునికి ఎదురుగా వేసినాడు. ఈసాణుడు అందులో కూర్చొని, విలాసంగా నవ్వినాడు. జయసేనుణ్ని పరికించి చూసినాడు.
జయసేనుడు తనను కట్టేసిన ఆసనం నుంచి కదలబోయినాడు. అప్పుడు తెలిసింది శరీరం సహకరించడం లేదని. బయటా, శరీరం లోపల కూడా గాయాలైనట్లు అనిపించింది. తల కూడా ఇంకా పూర్తి సహకారం అందించడం లేదు.. ‘ఇప్పుడు శక్తికి మించిన సాహసం చేసి మరిన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కంటే సమయోచితంగా అణగిమణగి ఉండి, ఆనుపానాలు గ్రహించి మున్ముందు చేయదగిన కార్యం యోజన చేసుకోవడం మంచిది!’ అనుకొని, మరింత బలహీనంగా కనులెత్తి ఈసాణుడిని చూసినాడు. “అరే! చాలా నీరస పడిపోయినట్లు ఉన్నాడు రా! ఎంతైనా మన అతిథి కదా! పండ్ల రసం తెచ్చివ్వండి చిన్నరాజా వారికి..” అన్నాడు. అందులో వ్యంగ్యం ఉన్నా, ఇప్పుడు తన ప్రాణం నిలబెట్టే అటువంటిదేదో కావాలని ఆశగా ఎదురు చూసినాడు జయసేనుడు. అతని ఆశ నిరాశ కాలేదు. నిజంగానే ఒక భటుడు పండ్ల రసం తెచ్చి తాగించినాడు. జయసేనుడికి నీరసం కొంచెం తగ్గిన అనుభూతి కలిగింది. మెదడు మీద ఒత్తిడి కూడా క్రమంగా తగ్గసాగింది. ‘ఇతను ఎవరు? రాజు గారి బంధువా? సైన్యాధ్యక్షుడా? అమాత్యుడా? రాజ సోదరుడా? తన తండ్రిని, తననూ ఇతనే బంధించినట్లు అనిపిస్తున్నది. ఇతనెందుకు ఇవన్నీ చేస్తున్నాడు?’ ఎన్నో ప్రశ్నలు జయసేనుని మెదడును తొలిచేస్తున్నాయి.
“అహో! చిన్నరాజా వారూ! మరీ అంతగా ఆలోచించకండి! అసలే తమరి తలకు బలమైన దెబ్బ తగిలింది. ఎక్కువ ఆలోచిస్తే ఉన్న ఒక్క తల పగిలిపోతే ఏం చేస్తారు? తండ్రికి ఒక్కగానొక్క కొడుకు కదా!” .. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లు, “ఆఁ.. తమరికి ఒక్కగానొక్క భార్య, చక్కని చుక్క ఉన్నదట కదా! తెలిసిందిలే! మాకు ఇటువంటివన్నీ చాలా తొందరగా తెలుస్తుంటాయి.. ఆ చుక్కను ఒక్కసారి మా పక్కలో చూసుకోవాలని చిన్న ఆశ..” ఈసాణుడి మాట పూర్తికాలేదు.. “అరేయ్ నీచుడా!” దిక్కులు పిక్కటిల్లేటట్లు అరచినాడు జయసేనుడు. అప్పుడే అతని దవడ కండరాలు బిగుసుకున్నాయి; పిడికిళ్లు బిగుసుకున్నాయి; శరీరమంతా ఒక్కసారిగా బిగుసుకొని పొంగింది. అతణ్ని బంధించిన తాళ్లు నూలు పోగుల్లా పుటపుటమని తెగిపో సాగినాయి. అది చూసి భయంతో బిగుసుకు పోయినాడు ఈసాణుడు. సమయానికి అది గమనించిన సైనికులు జయసేనుణ్ని ఇనుప గొలుసులతో కట్టేసినారు. కాళ్లకు చేతులకు శృంఖలాలు బిగించి అతణ్ని పెద్ద ఇనుప స్తంభానికి కట్టేసినారు.
ఈసాణుడు జయసేనునికి దగ్గరగా వెళ్లి.. “అహో! మహావీరా! మా సైనికులు నీ గురించి చెబితే నమ్మలేదు. ఇప్పుడు నమ్మక తప్పని పరిస్థితి కల్పించినావు! వ్యాపారం చేసుకునే వైశ్యులు తెలివైన వాళ్లే అనుకున్నా కానీ, బలమైన వాళ్లు కూడా ఉంటారని రుజువు చేసినావు. అయినా కులంతో, వంశంతో సంక్రమించే లక్షణాల కన్నా ప్రయత్నంతో, సాధనతో, పట్టుదలతో కూడా గొప్ప లక్షణాలు సొంతం చేసుకోవచ్చునని అర్థమయింది లే!” అంటూ, ఏదో గుర్తుకొచ్చినట్లు.. “అవునూ.. నన్ను నీచుడు అన్నావు కదా! హి హి హి హి.. నిజమే నేను నీచుణ్నే! పేరు మాత్రం గొప్పది. ఈసాణుడు! అంటే పరమశివుడు! నేనెప్పుడూ శివతాండవం చేయలేదు. చేస్తే ఇక అంతే! నీలాంటి కుర్రవీరులు వందమంది అయినా నా ముందు నిలువలేరు! అయినా నీలాంటి వాళ్లతో విరోధం పెట్టుకోకుంటే బాగుండేది కానీ అంతా అయిపోయింది. మా వాళ్లు నీ అందాల అర్ధ శరీరాన్ని.. అదే నీ భార్యామణిని ఇప్పుడు తీసుకొని వస్తూనే ఉంటారు!” అన్నాడు.
మహావీరా! మా సైనికులు నీ గురించి చెబితే నమ్మలేదు. ఇప్పుడు నమ్మక తప్పని పరిస్థితి కల్పించినావు! వ్యాపారం చేసుకునే వైశ్యులు తెలివైన వాళ్లే అనుకున్నా కానీ, బలమైన వాళ్లు కూడా ఉంటారని రుజువు చేసినావు.