Whatsapp | ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లలో వాట్సాప్ ఒకటి. రెండు బిలియన్లకు పైగా వినియోగదారులు వ్యక్తిగత, వృత్తిపరమైన కమ్యూనికేషన్ కు దీనిపై ఆధారపడుతున్నారు. వాట్సాప్ ను ఉపయోగించడం కూడా చాలా సులభం. కనుక ప్రతి ఒక్కరు తమ అవసరాలకు దీనిపై ఆధారపడ్డారని చెప్పవచ్చు. అయితే మనం వాట్సాప్ ను ఉపయోగించే సమయంలో తెలిసీ తెలియక చేసే తప్పుల వల్ల మన వాట్సాప్ అకౌంట్ తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది. కనుక మనం వాట్సాప్ ను ఉపయోగించేటప్పుడు మన అకౌంట్ సురక్షితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు నిషేధానికి గురి కాకుండా చూసుకోవాలి. వాట్సాప్ ఉపయోగించేటప్పుడు మన అకౌంట్ నిషేధానికి గురి కాకుండా మనం తప్పకుండా నివారించాల్సిన నాలుగు ముఖ్యమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వినియోగదారులు GBWhatsapp లేదా WhatsApp Plus వంటి యాప్స్ ను కూడా ఉపయోగిస్తున్నారు. ఇవి వాట్సాప్ కంటే అధిక ఫీచర్లను అందిస్తాయి. అయితే ఈ యాప్స్ వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘిస్తాయి. వీటిని ఉపయోగించడం వల్ల మన అకౌంట్ తాత్కాలిక సస్పెన్షక్ కు గురవుతుంది. ఈ యాప్స్ ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన అకౌంట్ శాశ్వతంగా సస్పెషన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఈ యాప్స్ ను ఉపయోగించకపోవడమే మంచిది. అలాగే మీ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తులకు మీరు తరచుగా ప్రమోషనల్, ఆటోమేటెడ్ సందేశాలను పంపించినట్లయితే వాట్సాప్ సిస్టమ్ మీ ఖాతాను ప్లాగ్ చేయవచ్చు. స్పామింగ్ సందేశాలను గుర్తించడానికి వాట్సాప్ ప్లాట్‌ఫామ్ అధునాతన అల్గారిథమ్ లను ఉపయోగిస్తుంది. దీని వల్ల మీరు తరచూ స్పామింగ్ సందేశాలను పంపినట్లయితే వాట్సాప్ మీ ఖాతాను లాక్ చేయవచ్చు లేదా శాశ్వతంగా బ్లాక్ చేయవచ్చు.
తప్పుడు వార్తలు, చట్టవిరుద్దమైన వార్తలు, హానికరమైన కంటెంట్ ను ఫార్వర్డ్ చేయడం వంటివి అతి పెద్ద ఉల్లంఘనగా చెప్పవచ్చు. వాట్సాప్ అటువంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తుంది. మీరు కనుక ఇటువంటి కంటెంట్ ను గ్రూప్‌లలో లేదా ఇతరులకు ఫార్వర్డ్ చేస్తే మీ అకౌంట్ నేరుగా నిషేధానికి గురవుతుంది. అలాగే వాట్సాప్ వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉంటుంది. బెదిరింపులు, ద్వేషపూరిత ప్రసంగం, వేధించడం వంటి ఫిర్యాధులు మీపై వస్తే వాట్సాప్ ఇతరులను రక్షించడానికి మీ ఖాతాను వెంటనే శాశ్వతంగా నిషేధిస్తుంది. వాట్సాప్ అనేది ఒక ఉచిత, సురక్షితమైన ప్లాట్‌ఫామ్. వినియోగదారుల భద్రతను కాపాడడానికి కఠినమైన మార్గదర్శకాలను అనుసరిస్తుంది. కనుక దీనిని ఉపయోగించేటప్పుడు సురక్షితంగా, జాగ్రత్తగా ఉపయోగించడం చాలా అవసరం.