మా అక్క క్లాస్మేట్ వేంకటేశ్వర్లు.. మా కజిన్‌కి ఒక ప్రేమలేఖ లాంటిది రాశాడు. మా కజిన్ నాకంటే పెద్ద అయినా.. స్కూల్లో నా జూనియర్. ఆ లెటర్ వచ్చిన విషయం ముందు నాతోనే చెప్పి.. మా నాన్నకు చెప్పమని నన్ను అడిగింది తను.
అయితే.. నేను సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన రెండు రోజులకే చిన్నాయన మా నాన్న దగ్గరికి వచ్చారు. చాయ్ తాగడం అయ్యాక ఆయన నాన్నను పక్కకు తీసుకెళ్లి ఏదో మాట్లాడటం కనిపించింది. పెద్దవాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడే వేలాడుతూ ఉండటం, చెవులు రిక్కించి వినడం, వాళ్ల మాటల్లో కల్పించుకుని మాట్లాడటం అనేవి.. మా రాజ్యంలో నిషేధించిన విషయాలు. కాసేపటికి చిన్నాయన వెళ్లిపోయాడు. ఆయనెందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది. ఆ తరువాత అమ్మా, నాన్న ఏదో మాట్లాడుకున్నారు. నాన్న నన్ను పిలిచాడు.
మా కజిన్‌కు వచ్చిన లెటర్ గురించి అడిగితే నాకు తెలిసిందంతా చెప్పాను. తన హైదరాబాద్ అడ్రస్ చెప్పడం గానీ, తన ఫొటో ఇవ్వడం గానీ నేనేమైనా చేసానేమోనని చిన్నాయన అనుమానమట. ఈ నిజనిర్ధారణలో మొదటి ఎంక్వయిరీ నా మీదే అయినందుకు థ్రిల్ అయ్యాను గానీ, నా ప్రమేయమేమీ లేదని చెప్పక తప్పలేదు. నేను అబద్ధం చెప్పనని మా వాళ్లకు తెలుసు.ఆ సాయంత్రమే మా నాన్నకు పట్వారీ పనిలో సహాయకుడిగా చేసే గుమాస్తా వచ్చాడు. ఆయన ఏ పనికైనా సమర్థుడు. ధోతీ, కమీజు ధరించి ఉండేవాడు. నాన్నంటే విపరీతమైన ఇష్టం, గౌరవం కూడా. ఆయనకు నాన్న చెబితే ఏ పనైనా.. ‘ఓకే.. డన్!’ అని తప్ప మరోలా అనలేడు. “అట్లనే చేద్దాం తియ్యండి ! నేను చూసుకుంట! వారినేం నారాజ్ కావొద్దని చెప్పండి” అంటుంటే. “ఏదో పొల్లగాడు, తెల్వక చేసి ఉంటడు. పెద్దగ ఏమనకండి!” అని నాన్న చెబుతుంటే.. “సరే! సరే! నాకు ఒదిలిపెట్టుండి” అంటూ వెళ్లిపోయాడు. ఇంతకూ వీళ్లేం చేయబోతున్నారనేది నా పాలిట పెద్ద సస్పెన్సు అయి కూచుంది. కొంచెం క్లూ కూడా తెలియకుండా పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నట్టు అనిపించింది.
మరో రెండ్రోజులకు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక మా ఇంటికి ఒకరొకరుగా నలుగురు పెద్ద మనుషులు వచ్చారు. కాసేపటికి మా కజిన్‌కి లవ్ లెటర్ రాసినతనితోపాటు ఇంకో ఇద్దరు అబ్బాయిలను వెంటబెట్టుకుని ఒకాయన వచ్చాడు. నేనూ, అక్కా అప్పుడు మా ఇంట్లోనే ఉన్న ఇంద్రాణి.. ఆ టైంలో చెస్ ఆడుకుంటున్నాం. మేము లోపలి గదిలోకి వెళ్లబోతుంటే.. “ఏమొద్దు! వాండ్లు లోపలికి రారు. మీరు ఇంట్ల ఆడుకోండి. అవుతలికి రాకుంటె అయిపాయె!” అని ఒక మినహాయింపు, ఒక హెచ్చరిక ఇచ్చాడు నాన్న. మనసు కోతి కదా! వద్దన్న పనే చేద్దామంటుంది. మేము వెంటనే ఆడుతున్న చెస్ ఆపేసి, వంటింటి వెనక ఉన్న ఒక చిన్న గదిలోకి పిల్లికూనల్లా పరిగెత్తాం. బయట కచ్చీరు దగ్గర నాన్నా వాళ్లు కూర్చున్నారు. మేము చూస్తున్నట్టు వాళ్లకు తెలియదు. ముగ్గురబ్బాయిలూ నిల్చున్నారు.
“మీ నాయిన నిన్ను కష్టపడి చదివిస్తాంటే, చదువుకోక గీ పనులేందిర పిలగా?” అని ఒకరూ, “గిప్పటి పొరగాళ్లే గిట్ల ఉన్నరు. ఏది మంచి ఏది చెడు అనేదే తెలుస్తలేదు” అని మరొకరూ, “ఎహె! రెండు జోపుండి! వాని తిక్క కుదురుతది” అని ఇంకొకరూ అంటుండగానే.. ఎవరో “ముందుగాల ఫొటో స్టుడియో పిల్లగాణ్ని అడుగుండి. అమ్మాయి ఫొటో బయిటికి ఎందుకు ఇడిచిండో! అసలు వాణ్ని తన్నాలె!” అన్నారెవరో. ఒకాయన నేరుగా లవ్ లెటర్ రాసిన వేంకటేశ్వర్లు దగ్గరికి వెళ్లి అతని జుట్టు పిడికిలిలో పట్టుకుని తల పైకెత్తి.. “ఏం రా! నీ వయసేంది? నీ చదువేంది? ఏమిట్లకు ఏమి లేదు, నీకు లవ్వు కావాల్సి ఒచ్చిందా?” అనడిగాడు. అతను ఏమీ మాట్లాడలేదు. నాకెందుకో అతణ్ని చూసి జాలేసింది. “ఉత్తగ అడుగు గానీ జుట్టు పట్టకయ్యా! ఎవ్వరు కూడా కొట్టకుండి!” అన్నాడు నాన్న. మేము కళ్లూ, చెవులూ అప్పగించి ఉండగా సడన్‌గా “ఇక్కడేం చేస్తున్నరు?” అంటూ అమ్మ గొంతు వినిపించగానే.. మేము ‘గప్‌చుప్ సాంబారుబుడ్డి’ అయిపోయాం. అమ్మ అమ్మే! డిటెక్టివ్ కదా! “ఇక్కడ మీకేం ఆటలున్నయి? పెద్దోండ్లు మాట్లాడుకుంటుంటె ఇంటున్నరా? తప్పు గాదా!” అనేసరికి అక్కడి నుండి జారుకున్నాం.
మరికొంత సేపటికి అందరూ వెళ్లిపోయి నాన్న లోపలికి వచ్చాడు. “నానా! ఫొటో ఆయినకు ఎవరిచ్చిన్రట?” అంటూ కుతూహలం పట్టలేక అడిగాను. “ఎవరిస్తే ఏంది? అయిపోయిందేదో అయిపోయింది! మీరు ఎవ్వరితోని అనకుండి!”.. నాన్న ఏదో కాగితం తీసి టేబుల్ డెస్క్‌లో దాచాడు. “ఇంతకూ ఏమాయె?” ఈసారి అమ్మ ఆత్రుత! “ఏమైతది?.. ‘తప్పయింది, ఇంకో సారి రాయను. మళ్ల ఇట్ల గనుక చేస్తే శిక్షించండి’ అని ఉత్తరం రాసి ఇచ్చిండు”.. క్లుప్తంగా ముగించాడు నాన్న. “అయినా ఇంతమందిని పిలిచేది లేకుండే! ఏదో పిల్లగాండ్ల వేషం! తెలిసీ తెలియని తనం, మందలిచ్చి ఒదిలిపెడితే అయిపోయేది గానీ, మనోడు అట్ల కాదంటడు! నలుగురి ముందట అయితేనే వానికి భయం ఉంటది అంటడు” అన్నాడు మళ్లీ.
మా విషయంలో అలాంటిది ఎప్పుడూ జరగలేదు. మా కజిన్‌కు కూడా మళ్లీ అలాంటి పరిస్థితి రాలేదు. అమ్మకు మాత్రం మాకు బోధించడానికి ఒక అంశం దొరికింది. “చూసిన్రా! అట్లనే ఉంటది. వయసు ఒస్తున్న కొద్దీ మొగపిల్లలతోటి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగ ఉండాలె. కవ్విస్తరు, పొగుడుతరు, రెచ్చగొడుతరు. మన సోయిల మనం ఉండాలె!..” అలా సాగిపోతూనే ఉంది. అప్పుడే కాదు.. ఎన్నోసార్లు! అమ్మ ప్రతి అవకాశాన్నీ సందర్భోచితంగా వాడుకునేది.
“అసలు ఆ పిల్లగాడు మనను కథ ఫెయిర్ చేయమని అందుకే ఒచ్చిండేమో! దాంట్ల హీరోకు హీరోయిన్ ఒక లవ్ లెటర్ రాస్తది. ఆ లెటర్ పేజీ విడిగ ఉన్నది. మనం దాన్ని గనుక రాస్తే.. అది పట్టుకొని బ్లాక్మెయిల్ చేసేటోడేమో! అబ్బో.. ఎంత ప్లాన్!” అన్నది ఇంద్రాణి. “అవును! నాకూ అదే అనిపిస్తుంది” అన్నది అక్క. సుమారు యాభై ఏళ్ల కిందటి ఆ సంఘటనతో పోల్చి చూస్తే.. ఇప్పుడు ఫొటోల మార్ఫింగులు, ట్రోలింగులూ, ర్యాగింగులూ, ఏఐ సహాయంతో దొంగ ఫొటోలు, వీడియోలు సృష్టించి అమ్మాయిల్ని బ్లాక్ మెయిల్ చేయడాలూ, మోసగించడాలూ.. ఏం మారింది కాలం? సాంకేతికత పెరగడం తప్ప అనిపిస్తుంది.
నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి