Gorilla’s Reaction : సాధారణంగా మనుషుల మధ్య గొడవలు, అలకలు, ఆ తర్వాత పశ్చాత్తాపం సర్వసాధారణం. జంతువుల్లో కూడా ఇలాంటి ఫీలింగ్సే ఉంటాయని నిరూపిస్తున్న ఓ గొరిల్లా (Gorilla) వీడియో ఇప్పుడు సోషల్ మీడియా (Social Media) ను షేక్ చేస్తున్నది. తన భాగస్వామి (ఆడ గొరిల్లా) తో గొడవపడిన తర్వాత ఓ మగ గొరిల్లా అచ్చం మనిషిలాగే దీర్ఘాలోచనలో మునిగిపోయిన దృశ్యం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఇది చూస్తుంటే అచ్చం మా ఇంట్లో సీన్‌లాగే ఉందంటూ వేలాది మంది యూజర్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో ఉన్న గొరిల్లా పేరు కియోమాసా (Gorilla). జపాన్‌లోని నాగోయాలో ఉన్న హిగాషియామా జూ అండ్ బొటానికల్ గార్డెన్లో ఇది నివసిస్తోంది. దీని వయసు 13 సంవత్సరాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘షబానీ’ అనే సిల్వర్‌బ్యాక్ గొరిల్లా కొడుకే ఈ కియోమాసా. ఇటీవల తన జోడితో చిన్నపాటి వాగ్వాదం జరిగిన తర్వాత కియోమాసా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఈ పోజు ఇచ్చింది. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో కియోమాసా కుడిచేతిని శరీరానికి అడ్డంగా ఉంచుకుని, ఎడమ చేతిని నోటిపై పెట్టుకుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు కనిపించింది.
ఈ వీడియో ‘ఎక్స్ (ట్విట్టర్)’ లో పోస్ట్ అయిన కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో జోకులు, కామెంట్లతో హోరెత్తించారు. ‘మా ఆవిడతో గొడవపడిన తర్వాత నేను కూడా అచ్చం ఇలాగే కూర్చుంటా’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ నాతో వాదనలో ఓడిపోయి మరో గదికి వెళ్లిన మా ఆయన ముఖ కవళికలు అచ్చం ఇలాగే ఉంటాయి. ఇది ప్రపంచంలో అందరు భర్తల పరిస్థితి’ అని మరో మహిళా యూజర్ రాసుకొచ్చారు. ‘ఈ గొరిల్లా దానికంటే ఎక్కువ ఫీలింగ్స్‌తో ఉంది. దీని ఆలోచనలు చూస్తుంటే మనిషిలాగే అనిపిస్తోంది’ అంటూ మరికొందరు కామెంట్ చేశారు.
Famous gorilla Kiyomasa falls into deep contemplation after spat with mate — caught on camera in Japanese zoo pic.twitter.com/uZhzYhs5Am
— RT (@RT_com) June 9, 2026
మొత్తానికి ఈ గొరిల్లా హావభావాలు మాత్రం మనుషులకు బాగా కనెక్ట్ అయ్యాయి. గొడవ తర్వాత.. జరిగిన గొడవ గురించి పదేపదే గుర్తుచేసుకుని బాధపడే సందర్భాన్ని ఈ గొరిల్లా ఫోజు గుర్తుచేస్తోందని నెటిజన్లు అంటున్నారు. దాంతో ఈ వారంలో ఇంటర్నెట్లో అత్యంత ‘రిలేటబుల్’ వైరల్ స్టార్‌గా కియోమాసా నిలిచింది.