కారేపల్లి, జూన్ 11 : ఎల్నినో ప్రభావం నేపథ్యంలో అధిక నీరు అవసరం ఉన్న వరి, మిరప వంటి పంటలకు బదులుగా నూనె గింజలు, పప్పుధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ రైతులకు సూచించారు. గురువారం సింగరేణి మండల పరిధిలోని పలు విత్తనాల దుకాణాలను ఏడీఏ తనిఖీ చేశారు. అనంతరం సీతారాంపురం, అప్పాయిగూడెం గ్రామాల్లో రైతులతో సమావేశమై వ్యవసాయ సూచనలు చేశారు. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే విత్తనాలు విత్తుకోవాలని, లైసెన్స్ పొందిన విత్తన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతూ ఎవరైనా అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే దిశగా యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, డీఏపీకి ప్రత్యామ్నాయంగా నానో డీఏపీ వినియోగించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భట్టు అశోక్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) బి.నరేశ్, ఎస్కే.మున్నీ పాల్గొన్నారు.