Sabarimala temple : కేరళ (Kerala) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయం (Sabarimala Ayyappa Temple) ఆదివారం తెరుచుకోనుంది. చింగం మాస (Chingam Month) పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తున్నామని అధికారులు చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలిపించేందుకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డ్ (TDB), కేఎస్ఆర్టీసీ (KSRTC) తగిన ఏర్పాట్లు చేస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఆలయ పూజారి కందరారు బ్రహ్మదత్తన్ సమక్షంలో ఆలయ ప్రధాన పూజారి ప్రసాద్ ఈడీ ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆలయాన్ని తెరుస్తారని టీడీబీ ఓ ప్రకటనలో తెలిపింది. మలయాళ నూతన సంవత్సర ఆరంభాన్ని పురస్కరించుకొని ఈనెల 17న ఉదయం 5 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. చింగం మాస పూజలు ముగిశాక ఆగస్టు 21న రాత్రి 10 గంటలకు ఆలయాన్ని మూసివేసి, తిరిగి ఓనం పండుగ పూజల కోసం ఈనెల 24న తెరుస్తారు.