AP News : మాజీ ముఖ్యమంత్రి జగన్ నిజంగానే ఒక బొద్దింక లాంటి వారని, అందుకే 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ‘హిట్’ తో గట్టిగా కొట్టి తరిమేశారని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే కనీస అర్హత కూడా జగన్‌కు లేదని ఆయన మండిపడ్డారు. గురువారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ మాట్లాడుతూ.. మెగా డీఎస్సీపై జగన్ చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.
తీవ్ర అక్రమాలకు పాల్పడిన జగన్ ఇవాళ నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని శ్రీకాంత్ అన్నారు. అమరావతి నిర్మాణం కోసం 2014 నుంచి కన్న కలలను నాశనం చేయడానికే జగన్ విషప్రచారం చేస్తున్నారని, ఆయన ఇప్పుడు రోడ్లపైకి వస్తే ప్రజలు కొట్టేలా ఉన్నారని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, రికార్డు సమయంలో పూర్తి చేసిన మెగా డీఎస్సీపై జగన్ రెడ్డి చేస్తున్న నిరాధార ఆరోపణలు 16 వేల నిరుద్యోగ కుటుంబాల ఉసురు పోసుకోవడమేనని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తంచేశారు.
పన్నెండేళ్లుగా డీఎస్సీ కోసం ఎదురుచూసి, రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించిన పేద, బడుగు బలహీన వర్గాల పిల్లలపై జగన్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. గొడ్డలి పార్టీ నేతల తప్పుడు ఆరోపణల వల్ల డీఎస్సీ అభ్యర్థులు మానసిక క్షోభకు గురవుతున్నారని, వారి ఉసురు జగన్‌కు తగలకుండా పోదని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఆధారాలతో సహా వివరణ ఇస్తున్నా, జగన్ అవే అబద్ధాలను పదేపదే ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.
నాడు ఉద్యోగాలు రాక 4,100 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని, ఆ పాపం జగన్‌దేనని శ్రీకాంత్ అన్నారు. ‘నాడు-నేడు’ పేరుతో విద్యాశాఖలో భారీగా దోచుకున్నారని విమర్శించారు. జీఓ 117 తెచ్చి 12 లక్షల మంది పేద పిల్లలను బడులకు దూరం చేశారని మండిపడ్డారు. కల్తీ మద్యంతో రూ.3,500 కోట్లు దోచుకుని 30 వేల మంది మహిళల మాంగల్యాలు తెంచిన జగన్.. ఇప్పుడు నీతులు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని విమర్శించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం తల్లిని, చెల్లిని వాడుకుని కన్నీళ్లతో ఇంటి నుంచి, పార్టీ నుంచి తరిమేసిన చరిత్ర జగన్‌దని శ్రీకాంత్ అన్నారు.
అబద్ధాల పునాదులపై పుట్టిన వైసీపీ, శివకుమార్ నుంచి పార్టీని లాక్కొని ఆయనకే వెన్నుపోటు పొడిచిందని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కేవలం 148 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ 240 దొంగ కేసులు వేసినా.. వాటన్నింటినీ అధిగమించి నియామకాలు పూర్తి చేశామన్నారు.