KYC Troubles | బీజేపీకి చెందిన నాగాలాండ్ పర్యాటక, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. కేవైసీ కష్టాలపై కామెడీగా తీసిన ఒక వీడియోను మంత్రి ‘కష్టాలు నిజం (Struggle is Real )’ అనే క్యాప్షన్‌తో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో ఈశాన్య ప్రాంతంలోని ప్రజల బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇబ్బందులు, సవాళ్లను ప్రశ్నిస్తుంది. టెక్నాలజీపై చర్చకు దారితీసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన కేవైసీని పూర్తిచేసే క్రమంలో ఐరిస్ స్కాన్ చేయడానికి పదేపదే ప్రయత్నిస్తున్నారు. అయినా స్కాన్ కాకపోవడంతో అతని దోస్తులు అతడి కళ్లను పట్టుకుని తెరిచేందుకు కష్టపడుతున్నారు. ఎన్నిసార్లు చేసిన విఫలమవుతుండటంతో పక్కను ఉన్నవారు నవ్వుతున్నారు. దీన్ని కామెడీగా తీసినప్పటికీ డిజిటల్ సేవలకు సంబంధించిన కేవైసీ, బయోమెట్రిక్ ప్రామాణీకరణలపై ప్రజల్లో ఆందోళనను కలిగిస్తుంది.
శారీరక తేడాలున్న పరిస్థితి ఏంటి
జనాభాలో చాలామందికి శారీరక లక్షణాల్లో తేడాలు ఉంటాయి. వీరికి బయోమెట్రిక్ (Biometric) ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటివారు ఇబ్బుందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ ధ్రువీకరణ పద్ధతులను ఏర్పాటు చేయాలని ఈ పోస్ట్ చూసిన చాలామంది కోరుతున్నారు. ఇలాంటి సమస్యలున్నవారి కోసం చైనా, జపాన్, ఇతర ఆసియా దేశాలు ఏదైనా టెక్నాలజీని రూపొందించి ఉంటాయని, వాటిని పరిశీలించాలని సూచిస్తున్నారు. సమస్య టెక్నాలజీలో ఉంది, మనుషుల్లో కాదు అని అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారికి ఎలాంటి ఐరిస్ స్కాన్ అందుబాటులో ఉందో చెప్పు అని సరదాగా ‘చాట్‌బాట్ గ్రోక్’కు ట్యాగ్ చేస్తున్నారు.
మంత్రి చమత్కారంతో వైరల్
దేశంలోని ఈశాన్య ప్రాంత ప్రజలు ఒకేలా కనిపిస్తారనే రూమర్ ఆధారంగా కామెడీగా ఈ వీడియో రూపొందించారు. మంత్రి హాస్యాన్ని జోడించి ఈ వీడియోను పోస్ట్ చేయడంతో వైరల్ (Viral)గా మారింది. ఈ వీడియో ఏకంగా 3.5 లక్షలకు పైగా వ్యూస్, పదివేలకు పైగా లైక్‌లను సంపాదించింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ షేర్ చేస్తూ అలోంగ్ ఫుల్ జోష్‌లో ఉన్నారని చమత్కరించారు. అలాగే ఆయన గతంలో కూడా ఈశాన్య ప్రాంత కళ్లపై హాస్యాన్ని జోడించి మాట్లాడారు. చిన్న కళ్లు ఉంటే ధూళి ప్రవేశించదని, ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు నిద్రపోయినా గుర్తుపట్టరని చమత్కరించారు. ఒకసారి ఇండోర్‌కు చెందిన పోలీస్ మైఖేల్ జాన్సన్ లాగా డ్యాన్సింగ్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసే వీడియోను పోస్ట్ చేశారు. వ్యక్తులు స్వీయ వ్యక్తీకరణ, ఎదుగుదల కోసం సొంత ప్లాట్‌ఫామ్స్‌ను సృష్టించుకోవాలని అని ఆ వీడియో పోస్ట్‌లో రాశారు.
ఈ వీడియోను కామెడీగా తీసినప్పటికీ టెక్నాలజీలోని లోపాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇలా ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డామని ఎంతోమంది తమ అనుభవాలను పంచుకున్నారు.