– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్
చౌటుప్పల్, ఆగస్టు 14 : తెలంగాణలో ప్రజా పాలన అన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు, ఆది నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గౌరవం దక్కాలేగానీ సీమాంధ్ర పాలకులు, సీమాంధ్ర మీడియా చెప్పు చేతుల్లో కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఉండొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం చౌటుప్పలో జరిగిన సీతా రామచంద్రస్వామి ఆలయ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన రాజగోపాల్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు, రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు. తాను ఎక్కడా కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో బయటి నుండి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం పెరిగి నిజమైన కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేదే తమ బాధ అన్నారు. తెలంగాణ ఉద్యమం నడిచిందే ఆత్మగౌరవం కోసం, అట్లాంటప్పుడు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం నిలిచేలా ప్రజా పాలన ఉండాలని తెలిపారు.
ప్రభుత్వం పేదల కోసం పని చేయాలి. అంతేకానీ కాంట్రాక్టర్ల కోసం, పెట్టుబడిదారుల కోసం పని చేయకూడదన్నారు. ఇలాంటి వాటితో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలహీనపడవద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సైనికుడిగా తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ పార్టీతోటే పేదలకు న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ తోటే తెలంగాణ అభివృద్ధి అవుతుందని అదీ రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతుందన్నారు. బయట నుండి వచ్చి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు, నేతలకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్లనే అణిచివేయాలని, అగౌరవ పరచాలని, అవమానించాలని చూస్తే సహించేది లేదని రాజగోపాల్రెడ్డి హెచ్చరించారు.