నల్లగొండ రూరల్, అక్టోబర్ 03 : వర్షాభావ పరిస్థితులు, తగ్గుతున్న భూగర్భ జలాలను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యత ఆధారంగా పంటలను ఎంపిక చేసుకోవాలని నల్లగొండ మండల వ్యవసాయ అధికారి సుంకోజు శ్రీనివాస్ సూచించారు. శనివారం అప్పాజీపేట గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. వరికి ప్రత్యామ్నాయంగా తక్కువ నీటితో సాగు చేయగల మినుములు, అలసందలు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, కూరగాయలు వంటి ఆరుతడి పంటలను నేల స్వభావం, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాలని తెలిపారు.