Harish rao | మాజీ మంత్రి, బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాగజ్ మద్దూర్ గ్రామంలో దయనీయమైన దృశ్యాన్ని చూసి చలించిపోయారు. స్థానిక నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డితో కలిసి వెళ్తుండగా మార్గం మధ్యలో కరెంటు లేక ఎండిపోతున్న వరి పొలాలను చూసి పొలంలోకి వెళ్లి అక్కడున్న మహిళా రైతు నాగమణితో మాట్లాడి ఆమె కష్టాలను అడిగి తెలుసుకున్నారు.
చిట్టోళ్ల నాగమణి అనే ఆ మహిళా రైతు హరీశ్ రావు ముందు తన ఆవేదనను వెళ్లగక్కింది. బోర్లలో నీళ్లున్నా.. ప్రభుత్వ చేతకానితనం వల్ల కరెంటు రాక పంటలు కళ్లెదుటే ఎండిపోతున్నాయని వాపోయింది. సుమారు 60 వేల రూపాయల పెట్టుబడి పెట్టి 3 ఎకరాల్లో వరి నాట్లు వేస్తే.. అందులో సగం పొలం పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. పంట పొట్టకొచ్చే దశలో నీళ్లు అత్యంత అవసరమని, సరిగ్గా ఈ సమయంలోనే కరెంటు లేక రైతుల బతుకులు ఆగం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి..
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో పగటిపూట నిరంతరాయంగా కరెంటు వచ్చేదని, ఎలాంటి రంది లేకుండా పంటలు పండించుకున్నామని నాగమ్మ గుర్తుచేసుకుంది. కానీ ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నెలకొందని వాపోయింది. ఉదయం 5 గంటలకు రావాల్సిన కరెంటు 8 గంటలకు వస్తోందని, ఆ వచ్చిన కరెంటు కూడా నిలకడగా ఉండకుండా మధ్యాహ్నం మళ్లీ కోతలకు గురవుతోందని వివరించింది.
కేవలం కరెంటు కోతలే కాకుండా లో వోల్టేజ్ కారణంగా పదే పదే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయని, మోటార్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయని నాగమ్మ తెలిపింది. నెల రోజుల్లోనే మూడుసార్లు ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయిందని, రిపేర్ కోసం ఒక్కోసారి నాలుగు రోజుల పాటు కరెంటు లేక పొలాలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. కరెంటు వచ్చిపోవడం వల్ల పారిన మడే పారుతోందని, కింది మడులకు నీళ్లు అందడం లేదని తెలిపింది. నాగమ్మ ఒక్కరిదే కాదు, ఆ ప్రాంతంలోని రైతులందరి పరిస్థితి ఇలాగే కరెంటు లేక కాలిపోతోందని తెలుసుకున్న హరీశ్ రావు రైతుల పరిస్థితి చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
‘మహిళలు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి’
‘కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలి’