– లబ్ధిదారులకు పిండి మిల్లుల పంపిణీ
రుద్రంపూర్, అక్టోబర్ 03 : కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో మహిళలకు శిక్షణ కార్యక్రమం, పిండి మిల్లుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. కేవీకేలో జరిగిన ఈ కార్యక్రమానికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సిరివరపు లలితాకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు సంప్రదాయ పనులతో పాటు ఆదాయాన్ని పెంచే స్వయం ఉపాధి, ఆదాయ వనరుల కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. కేవీకే అందిస్తున్న సాంకేతిక సేవలు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. మహిళలకు అవసరమైన నైపుణ్యాలను అందించడంతో పాటు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.
కేవీకే భద్రాద్రి కొత్తగూడెం సీనియర్ సైంటిస్ట్, హెడ్ డాక్టర్ టి. భరత్ మాట్లాడుతూ… మహిళలకు అందుబాటులో ఉన్న వివిధ స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. టైలరింగ్, వర్మీ కంపోస్టు తయారీ, చిరుధాన్యాల ప్రాసెసింగ్, పుట్టగొడుగుల పెంపకం, కోళ్ల పెంపకం తదితర వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల ద్వారా మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో 3 ఇన్క్లైన్ సర్పంచ్ ప్రవల్లికతో పాటు సుమారు 60 మంది మహిళా రైతులు పాల్గొన్నారు. అనంతరం గుండాల మండలం, పోతిరెడ్డిగూడెం గ్రామాలకు చెందిన ఎంపికైన మహిళా లబ్ధిదారులకు పిండి మిల్లులను పంపిణీ చేశారు. ఈ పరికరాలను స్వయం ఉపాధి కార్యకలాపాలకు వినియోగించుకుని ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు.