Supreme Court : కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు లభించింది. ఈ నియామకాలు చెల్లవు అంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్ ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలివి. తమిళనాడులో గత ఏడాది సెప్టెంబర్ 27న కరూర్ పట్టణంలో తొక్కిసలాట జరిగింది. టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా జరిగిన ఈ తొక్కిసలాటలో 41 మంది మరణించారు.
పలువురు గాయపడ్డారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్.. కరూర్ బాధితులైన పలువురి కుటుంబాలకు ప్రభుత్య ఉద్యోగాలు అందజేశారు. జూలై 10న సీఎం విజయ్ నియామక పత్రాలు అందజేశారు. అయితే, ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రమాద మృతులకు ఏ ప్రాతిపదికన ప్రభుత్య ఉద్యోగం ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారి ఉద్యోగ నియామకాల్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. ప్రభుత్వ ఆదేశాలు చెల్లవని పేర్కొంది. ఈ ఉద్యోగ నియామకాల్ని రద్దు చేసింది. ఇలా చేస్తే, ఇదేతరహా విజ్ఞాపనలు ఇంకా పెరుగుతాయని పేర్కొంది. ఇలా పరిహారం కింద ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చెల్లదని, ఎందరో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని హైకోర్టు పేర్కొంది.
ఉద్యోగాలు అర్హతతో సాధించుకోవాలని సూచించింది. జస్టిస్ సీవీ కార్తికేయన్, ఆర్ శక్తివేల్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. తాము కల్పించిన ప్రభుత్వ ఉద్యోగాల్ని హైకోర్టు రద్దు చేయడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ‘‘మీరు ప్రభుత్వ పాలసీనే ప్రశ్నిస్తారా..? కుటుంబానికి ఆదాయం అందించే వ్యక్తి మరణిస్తే వారి కొడుకుకు లేదా కూతురుకు ఉపాధి కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వకూడదా’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.