హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుటిల రాజకీయం చేస్తున్నదని కార్మికులు మండిపడుతున్నారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ (థామస్‌రెడ్డి)కు వస్తున్న ఆదరణను ఓర్వలేక ఎప్పట్నుంచో ఉన్న ‘ధనస్సు బాణం’ గుర్తును అన్యాయంగా లాక్కొని, టీడబ్ల్యూయూ (అశ్వత్థామరెడ్డి)కి కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
దొంగలంతా ఏకమై మరోసారి ఆర్టీసీ కార్మికులను, సంస్థను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజల్లో, సబ్బండ వర్గాల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు ఆర్టీసీ ఎన్నికల్లోనూ గుర్తుల రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం ప్రతి కార్మికుడూ సిద్ధంగా ఉండాలని, అవకాశవాద రాజకీయాలు చేస్తున్నవారికి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిస్తున్నారు.
అంతా పథకం ప్రకారమే..
‘బాణం’ గుర్తును అశ్వత్థామరెడ్డి వర్గానికి కేటాయించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుస్తుగానే ప్రణాళికలు రచించినట్టు తెలుస్తున్నది. థామస్‌రెడ్డి వర్గం హైకోర్టుకు వెళ్లి ‘బాణం’ గుర్తును సంపాదించుకోవడంతో అశ్వత్థామరెడ్డి వర్గంలో కలవరం మొదలైంది. ఆయన అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడంతో రాజకీయం గుర్తులవైపు మళ్లింది. ఈ క్రమంలో సాక్షాత్తు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఐఎన్టీయూసీని పక్కనపెట్టి అశ్వత్థామరెడ్డికి సపోర్ట్ చేయాలని కోరుతూ ఇటీవల లేఖ విడుదల చేశారు. అదే రోజు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌ను నియమించడం, ఆ మరుసటి రోజే గుర్తులు కేటాయించడం చకచకా జరిగిపోయాయి. అన్ని యూనియన్లకు వాటి పాత గుర్తులను కేటాయించినప్పటికీ టీఎంయూకు ‘బాణం’ గుర్తును తొలగించి అన్యాయంగా అశ్వత్థామరెడ్డికి కేటాయించేలా చక్రం తిప్పారని కార్మికులు చెప్తున్నారు.
కాంగ్రెస్ కుట్రలకు బలికావొద్దు..
ఈ తరహా రాజకీయాలు చేయడం తగదని ఎంప్లాయీస్ యూనియన్, ఎన్ఎంయూ, టీఎంయూ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. కాంగ్రెస్ కుట్రలకు కార్మికులు బలికావొద్దని, ఆర్టీసీ విలీన ప్రక్రియను తాకట్టు పెట్టిన ‘ఇంటి దొంగ’ను గుర్తింపు సంఘం ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పేర్కొంటున్నారు. ఆర్టీసీ కార్మిక సమస్యల పరిషారం కోసం జేఏసీతో కలిసి నడిచిన తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ)ను కాపాడుకోవాలని, నిజాయితీపరుడైన థామస్‌రెడ్డికి అండగా నిలువాలని కోరుతున్నారు.
మా గుర్తు ఇవ్వకపోతే ఆత్మహత్యే..
న్యాయస్థానం ఆదేశాలను లేబర్ జాయింట్ కమిషనర్ పాటించలేదని, హైకోర్టు నుంచి తాము సంపూర్ణమైన ఆర్డర్ తీసుకొచ్చినప్పటికీ ‘బాణం’ గుర్తును అధర్మంగా, అన్యాయంగా టీడబ్ల్యూయూ (అశ్వత్థామరెడ్డి)కి కేటాయించారని టీఎంయూ అధ్యక్షుడు థామస్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల ప్రయోజనాలతోపాటు తన యూనియన్ కోసం ప్రాణత్యాగానికి సైతం సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ‘బాణం’ గుర్తును తిరిగి టీఎంయూకి ఇవ్వకపోతే లేబర్ ఆఫీసులోనే ఆత్మాహుతి చేసుకుంటానని, తన చావుకు జాయింట్ కమిషనర్, అశ్వత్థామరెడ్డి, కాంగ్రెస్ నాయకులే బాధ్యులవుతారని హెచ్చరించారు.