పట్నా: బీహార్‌లో మహిళలు, బాలికలపై లైంగిక వేధింపుల ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్న వేళ రాష్ట్ర డీజీపీ వినయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణకు ఇంకా కొన్ని నెలల సమయం ఉండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఆయన అభ్యర్థనను వెంటనే ఆమోదించింది. అనంతరం ఆయనను రాష్ట్ర తదుపరి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వినయ్ కుమార్ డిసెంబర్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
అయితే అనారోగ్య కారణాలతో ఈ నెల ప్రారంభంలో సెలవులో వెళ్లిన ఆయన సెప్టెంబర్ 25న వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేశారు. ప్రభుత్వం వెంటనే అమలు చేసింది. చికిత్స తర్వాత ఆయన కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. వినయ్ కుమార్ సెలవులో వెళ్లిన తర్వాత 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రీతా వర్మ తాత్కాలిక డీజీపీగా బాధ్యతలు చేపట్టారు.