తిరువనంతపురం: వన్డే ప్రపంచకప్ సన్నాహకాలను భారత్ ఘనంగా ఆరంభించింది. సొంతగడ్డపై వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్న భారత్.. ఆదివారం తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి వన్డేలో ప్రత్యర్థిపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచేసింది. ‘ఛేదనలో మొనగాడు’ విరాట్ కోహ్లీ (88 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్స్‌లతో 139 నాటౌట్) కెరీర్లో 86వ (మూడు ఫార్మాట్లలో కలిపి) సెంచరీతో చెలరేగిన వేళ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (108 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 110) సారథిగా రెండో శతకాన్ని బాదడంతో విండీస్ నిర్దేశించిన 296 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 41.4 ఓవర్లలోనే రెండు వికెట్లే కోల్పోయి ఛేదించింది. మొదట కరీబియన్ జట్టుకు జస్టిన్ గ్రీవ్స్ (108 బంతుల్లో 12 ఫోర్లతో 101) సెంచరీ చేయగా జాన్ క్యాంప్‌బెల్ (62), అమిర్ జాంగూ (53 నాటౌట్) రాణించడంతో 295/7 స్కోరు చేయగల్గింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (4/40)కు నాలుగు వికెట్లు దక్కాయి. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈనెల 30న గువాహతి వేదికగా రెండో వన్డే జరుగుతుంది.

Kohli
తాజా, మాజీ కెప్టెన్ల జోరు
భారత టాపార్డర్ జూలు విదిల్చడంతో విండీస్ లక్ష్యం ఏమాత్రమూ సరిపోలేదు. తన మాజీ సారథులు రోహిత్ శర్మ (32), కోహ్లీతో కలిసి ప్రస్తుత కెప్టెన్ గిల్ రెచ్చిపోయాడు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించినా క్రీజులో కుదురుకున్నాక రోహిత్, గిల్ జోడీ జోరందుకోవడంతో ఆతిథ్య జట్టుకు శుభారంభమే దక్కింది. ఫోర్డె, అల్జారీ జోసెఫ్ ఓవర్లో డీప్ వికెట్ మీదుగా రోహిత్ కొట్టిన సిక్సర్లు ప్రేక్షకులను అలరించాయి. గిల్ సైతం బౌండరీలతో విరుచుకుపడగా పది ఓవర్లలో భారత్ వికెట్లేమీ నష్టపోకుండా 70 రన్స్ చేసింది. అయితే జోసెఫ్ 12వ ఓవర్లో బంతిని డీప్ స్కేర్ లెగ్‌లో ఆడబోయిన హిట్‌మ్యాన్.. ఆండ్రూ చేతికి చిక్కడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
అప్పటికే 40ల్లోకి వచ్చిన గిల్.. ఆ తర్వాత కోహ్లీ అండతో మరింతర రెచ్చిపోయాడు. ఛేజ్ ఓవర్లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఇద్దరూ క్రీజులో సెట్ అయ్యాక విండీస్ బౌలర్లు, ఫీల్డర్లు వారి విన్యాసాలను దగ్గర్నుంచి చూడటం తప్ప వికెట్లు తీయాలన్న ఆలోచనే మరిచిపోయారా? అన్నట్టు వారి ఆట సాగింది. జోసెఫ్ బౌలింగ్‌లో కీపర్ తలమీదుగా సిక్స్‌తో పరుగుల వేట మొదలెట్టిన విరాట్.. 44 పరుగుల వద్ద ఉండగా అతడి బౌలింగ్‌లోనే సిక్స్‌తో అర్ధ శతకాన్ని పూర్తిచేశాడు. ఆ తర్వాత జోసెఫ్ విసిరిన 29వ ఓవర్లో రెండు బౌండరీలు బాదడంతో వన్డేల్లో ‘రన్ మిషీన్’ 15వేల పరుగుల మార్కును అందుకున్నాడు.
ఆ తర్వాతి ఓవర్లోనే భారత అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ సీల్స్ ఓవర్లో బౌండరీతో వన్డేల్లో గిల్ 11వ శతకం పూర్తవడమే గాక భారత్ స్కోరూ 200 పరుగులు దాటింది. శతకం పూర్తయ్యాక గిల్ నిష్క్రమణతో 151 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ వెళ్లేసరికే 80ల్లోకి వచ్చిన విరాట్.. రుతురాజ్ (13)ను అవతలి ఎండ్‌లో ఉంచి లాంఛనాన్ని ముగించే బాధ్యతలు భుజానికెత్తుకున్నాడు. లాంగాన్‌లో చూడముచ్చటైన సిక్స్‌తో శతకానికి చేరువైన అతడు 94 రన్స్ వద్ద గుడకేశ్ బౌలింగ్‌లో ముందుకొచ్చి మరోసారి లాంగాన్లోనే సిక్స్‌తో వన్డేల్లో 55వ సెంచరీని నమోదుచేశాడు. సెంచరీ తర్వాత జోరు పెంచిన కోహ్లీ.. సిక్స్‌లు, ఫోర్లతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.

Kuldeep
గ్రీవ్స్ రాణించినా..
విండీస్ ఇన్నింగ్స్‌లో ఆటంతా ఓపెనర్లదే. సిరాజ్, బుమ్రా వంటి ఫ్రంట్‌లైన్ బౌలర్లు లేని భారత బౌలింగ్‌ను క్యాంప్‌బెల్, గ్రీవ్స్ జోడీ ఉతికారేసింది. ఇద్దరూ మొదట్నుంచే దూకుడుగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. బ్రార్, నితీశ్, ప్రసిద్ధ్.. ఏమాత్రం ప్రభావం చూపకపోయారు. రవీంద్ర జడేజా సైతం నిరాశపరిచాడు. అర్ధ శతకాల తర్వాత ఈ జోడీని 20వ ఓవర్లో ఎట్టకేలకు విడదీసిన కుల్దీప్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. క్యాంప్‌బెల్ ఔటయ్యాక విండీస్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. కార్టీ (13)ని ప్రసిద్ధ్, కెప్టెన్ షై హోప్ (12)ను కుల్దీప్ పెవిలియన్‌కు పంపారు. నిలకడగా ఆడిన గ్రీవ్స్.. జడేజా బౌలింగ్‌లో సింగిల్‌తో తన వన్డే కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. కానీ ఆ వెంటనే కుల్దీప్ బౌలింగ్‌లో వికెట్ల ముందు బలయ్యాడు. ఆఖర్లో అమిర్ మెరుపులతో పర్యాటక జట్టు మెరుగైన స్కోరు చేసింది.
కోహ్లీ @ 15 వేలు
వన్డేల్లో కోహ్లీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 57 పరుగుల వద్ద ఉండగా అతడు 15 వేల పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా ఈ ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ (18,426) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ (15,080) రికార్డులకెక్కాడు.
9 ఈ మ్యాచ్‌లో కోహ్లీ కొట్టిన సిక్స్‌లు. ఒక వన్డే మ్యాచ్‌లో ఇన్ని సిక్స్‌లు కొట్టడం అతడికి ఇదే ప్రథమం. శ్రీలం కపై 8 సిక్స్‌లు బాదాడు.
10 వెస్టిండీస్‌పై కోహ్లీ సెంచరీల సంఖ్య. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన వారిలో అతడిదే అగ్రస్థానం. గతంలో శ్రీలంకపైనా ఈ ఘనత సాధించాడు. సచిన్, రోహిత్ (ఆస్ట్రేలియాపై 9) తదుపరి స్థానాల్లో ఉన్నారు.
సంక్షిప్త స్కోర్లు
వెస్టిండీస్: 50 ఓవర్లకు 295/7 (గ్రీవ్స్ 101, క్యాంప్‌బెల్ 62, కుల్దీప్ 4/40, ప్రసిద్ధ్ 2/60); భారత్: 41.4 ఓవర్లకు 300/2 (కోహ్లీ 139*, గిల్ 110, ఛేజ్ 1/64, జోసెఫ్ 1/81)