Health Tips For Old Age Persons | వయసు పైబడే కొద్దీ ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన తరువాత భావోద్వేగంగా చాలా మంది నిరాశకు గురవుతూ ఉంటారు. బాధ్యతలను నెమ్మదిగా పిల్లలకు అప్పగిస్తారు. దినచర్య కఠినంగా మారుతుంది. వైద్యులు, కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలను పాటించరు. వయసుపైబడే కొద్దీ విశ్రాంతి తీసుకోవడం సహజం. కానీ ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, కదలకుండా కూర్చోవడం వల్ల శక్తి నిల్వలు హరిస్తాయి. శరీరం అనారోగ్య సమస్యలను ఆహ్వానిస్తుంది. శరీరంలో బలహీనత పెరుగుతుంది. పనుల కోసం ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. 50 ఏళ్లు దాటిన తరువాత శరీరం అంతర్గత మార్పులకు లోనవుతుంది. ఎముకల సాంద్రత, కండర ద్రవ్యరాశి తగ్గుతుంది. నిద్ర నాణ్యత తగ్గుతుంది. అయితే వృద్దాప్యం అనేది ఎవరికైనా అనివార్యం అని చెప్పవచ్చు. కానీ 50 ఏళ్లు దాటిన తరువాత కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. ఫిట్ గా ఉండడంతో పాటు మన పనులను మనమే చేసుకోగలుగుతాం. 50 ఏళ్లు దాటిన తరువాత ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
వయసు పైబడిన తరువాత చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ, కాఫీలను బిస్కెట్లతో కలిపి తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల అలసట పెరుగుతుంది. ప్రేగు కదలికలు నెమ్మదిస్తాయి. తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కనుక ఇలా చేయడానికి బదులుగా గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది. ఉదయం పూట గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేగు కదలికలు సరిగ్గా ఉంటాయి. శరీరం పోషకాలను ఎక్కువగా గ్రహిస్తుంది. చాలా మంది ఉదయం పూట చేసే ఈ ఒక్క పని శరీర శక్తి స్థాయిల్లో మెరుగైన మార్పును తీసుకువస్తుంది. అలాగే ఉదయం పూట రాత్రంతా నానబెట్టిన మెంతి గింజల నీటిని తీసుకోవాలి. అలాగే మెంతులను నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. వయసు పైబడిన వారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక 50 ఏళ్లు దాటిన వారు ఇలా మెంతి గింజలను తీసుకోవడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
అలాగే వయసు పైబడిన వారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా తయారవ్వడం, అలసట, కండరాల నొప్పులు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక రోజూ ఉదయం పూట 15 నుండి 20 నిమిషాల పాటు శరీరానికి సూర్యరశ్మి తగిలేలా నడవాలి. దీని వల్ల ఎముకలు బలంగా తయారవ్వుతాయి. అలసట తగ్గుతుంది. నిద్రనాణ్యత పెరుగుతుంది. ఇక వయసు పైబడిన వారు ఎక్కువగా చేసే తప్పుల్లో ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం కూడా ఒకటి. ఇలా చేయడం వల్ల కండరాలు బలహీనంగా తయారవుతాయి. కీళ్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. కనుక రోజూ ఉదయం ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పెరుగు, పనీర్, మూంగ్ దాల్ వంటి వాటిని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ అల్పహారాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలగడంతోపాటు వయసు పైబడడం వల్ల వచ్చే శరీర క్షీణత తగ్గుతుంది.
అలాగే రోజూ 45 నిమిషాల పాటు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె బలంగా తయారవుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. సాధారణంగా వయసు పైబడిన తరువాత చాలా మందిలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తి ఇతరుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కనుక వయసు పైబడిన తరువాత కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు వయసుపైబడినప్పటికీ ఉత్సాహంగా, ఫిట్ గా జీవించవచ్చని వైద్యులు చెబుతున్నారు.