టోక్యో : దక్షిణ జపాన్‌లోని ప్రధాన ద్వీపమైన క్యుషులో మంగళవారం మధ్యాహ్నం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ‘ఎన్‌హెచ్‌కే’ అందించిన సమాచారం ప్రకారం కషీమా టౌన్‌లోని దెబ్బతిన్న అయోన్ షాపింగ్ మాల్లో పలువురు చిక్కుకుపోయినట్లు అనుమానిస్తున్నారు. ఈ మాల్లో భారీ పేలుడు సంభవించిందని, దీనివల్ల కొందరు ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
భూకంపం ధాటికి సుమారు 50 మందికిపైగా జనం గాయపడి, దవాఖానలలో చికిత్స పొందుతున్నారని సమాచారం. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు అగ్ని ప్రమాదాలు సంభవించాయని, రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని, పలుచోట్ల ఇండ్లు కూలిపోయాయని అధికారులు తెలిపారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, కాసేపటి తర్వాత అటువంటి ముప్పు తప్పిపోయిందని సంబంధిత అధికారులు ప్రకటించారు. ప్రపంచంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే దేశాలలో జపాన్ ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా సుమారు 1,500కు పైగా ప్రకంపనలు నమోదవుతుంటాయి.