హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): విద్యార్థుల ప్రాణాలతో సర్కార్ చెలగాటమాడుతున్నది. కమీషన్లకు కక్కుర్తిపడి ఇష్ట మొచ్చినట్టు టెండర్లను కట్టబెట్టిందని ఇప్పటికే విమర్శలున్నాయి. తాజాగా కిరాణా టెండర్లను దక్కించుకున్న గుత్తేదారు సంస్థ ఇష్టారీతిన గోడౌన్లను ఏర్పాటు చేస్తున్నది. గురుకులాలకు సరఫరాచేసే కిరాణా సామాను నిల్వ చేసేందుకు అపరిశుభ్రమైన, పాడుపడిన భవనాలను ఎంపిక చేస్తున్నది. ఆయా గోడౌన్లను చూసి గురుకుల సిబ్బంది నివ్వెరపోతున్నారు. తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉన్నది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలు విజయ డెయిరీ ద్వారా సరఫరా అవుతున్నాయి. అవి పోగా వంట తయారీకి ఫుడ్ ప్రొవిజన్‌కు సంబంధించిన కిరాణా సామగ్రి కొనుగోలు టెండర్లను 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్రీకృత విధానంలోనే గుత్తేదారును ఎంపిక చేసింది. ఫుడ్ ప్రొవిజన్లోని 93 వస్తువుల సప్లయ్ టెండర్‌ను నేకాఫ్ (నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ రిటైలింగ్ కో ఆపరేటివ్ లిమిటెడ్)కు అప్పగించింది.
ఆ సంస్థనే రాష్ట్రంలోని ప్రతి గురుకులానికీ, సంక్షేమ హాస్టల్‌కూ, స్కూళ్లకు సంబంధించి కిరాణా సామాన్లను నేరుగా సరఫరా చేయాల్సి ఉంటుంది. అందుకోసం ప్రస్తుతం ఆ సంస్థ జిల్లాకో గోడౌన్‌ను ఏర్పాటు చేస్తున్నది. కిరాణా సామగ్రిని అక్కడ నిల్వ చేసి, అక్కడి నుంచి ఆ జిల్లా పరిధిలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు నిర్దేశిత ఇండెంట్ ప్రకారం సరఫరా చేయనున్నది. అంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం సదరు గుత్తేదారు ఏర్పాటు చేస్తున్న గోడౌన్ల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉన్నది.
పాడుబడిన భవనాలు, రేకుల షెడ్లను నిల్వకోసం ఎంపిక చేసింది. ఆయా గోడౌన్లలో సరుకుల నిల్వకు కావాల్సిన ఎలాంటి వసతులు లేవని ఉపాధ్యాయవర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ గోడౌన్లలో నిల్వ చేస్తే సరుకులు త్వరితంగా పాడయ్యే అవకాశమున్నదని, పాడైన వాటిని వినియోగిస్తే విద్యార్థులకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. తక్షణం ఎంపిక చేసిన అన్నీ గోడౌన్లలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పక్కా, ఆధునిక వసతులు కలిగిన భవనాల్లో నిల్వ చేసేలా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇండెంట్ సమర్పించి నెల దాటినా గురుకులాలకు కిరాణా సామగ్రిని సరఫరా చేయలేదు. ఫుడ్ ప్రొవిజన్ సరుకులకు సెప్టెంబర్ నుంచే సరఫరా చేయాల్సి ఉన్నది. ఆగస్టు 25వ తేదీనే అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సరుకుల ఇండెంట్‌ను యూడబ్ల్యూహెచ్ఎంస్ పోర్టల్‌లో అప్లోడ్ చేశాయి. సెప్టెంబర్ నుంచి గుత్తేదారు నుంచే సరుకులను తీసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్లు, సంబంధిత ప్రభుత్వ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
అయితే అప్పటికే నెలాఖరు కావడంతో తక్కువ సమయంలో సరఫరా చేయలేమని గుత్తేదారు సంస్థ వెల్లడించింది. అక్టోబర్ నుంచి సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. అక్టోబర్ వచ్చినా ఇప్పటికీ సరుకులను గుత్తేదారు సంస్థ సప్లయ్ చేయలేదు. విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. ఇకనైనా సర్కార్ స్పందించి విద్యార్థుల భోజనానికి అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.