భారత స్వతంత్ర సమరంలో మహాత్ముడి శకం మరువలేనిది. స్వేచ్ఛా పోరాటంలో భాగంగా బాపూ దేశమంతా తిరిగారు. ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రదేశం.. చారిత్రక సంపదగా నిలిచిపోయింది. ఆయన విడిది చేసిన ప్రతి ఆశ్రమం పర్యాటక కేంద్రమే! జాతిపిత జయంతి సందర్భంగా ఆ మహనీయుడి జీవితంతో ముడిపడిన ప్రదేశాలను తలుచుకుంటే చాలు మనసు ఉప్పొంగుతుంది. గాంధీతాత జీవిత విశేషాలను మీ పిల్లలకు చెప్పాలనుకుంటున్నారా!! అయితే బాపూజీ సత్యశోధనలో భాగమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. వీలు చూసుకొని ఆయన నడిచిన బాటలో విహరించేద్దాం.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీ తీరంలో ఉంటుంది సత్యాగ్రహ ఆశ్రమం. దీన్నే సబర్మతి ఆశ్రమం, హరిజన ఆశ్రమం అంటారు. 1917లో తన భార్య కస్తూర్బాతో కలిసి 36 ఎకరాల సువిశాల ఆశ్రమంలో అడుగుపెట్టారు గాంధీ. ఆశ్రమానికి ఒకవైపు జైలు.. మరోవైపు కొంతదూరంలో శ్మశానం ఉండేవట. ‘ఒక సత్యాగ్రాహికి అవసరమయ్యే రెండు గమ్యాలు ఇక్కడికి దగ్గరగా ఉన్నాయి’ అనేవారట బాపూ.

ఆశ్రమంలో వ్యవసాయం, పశుపోషణతో పాటు పాఠశాల కూడా నిర్వహించారు. 1930.. దండి ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా ‘భారతదేశానికి స్వరాజ్యం సిద్ధించే వరకు నేను సబర్మతి ఆశ్రమంలో అడుగుపెట్టను’ అని ప్రతిజ్ఞ చేశారు మహాత్మా గాంధీ. అన్నట్టుగానే మళ్లీ ఆశ్రమంలో అడుగుపెట్టలేదు. స్వతంత్రం సాధించిన తర్వాత కూడా ఇక్కడికి రాలేకపోయారు. బాపూ జ్ఞాపకాలను పదిలం చేస్తూ సబర్మతి ఆశ్రమానికి 1963లో కొత్త రూపునిచ్చారు. ఇప్పుడీ ప్రశాంత వనంలో అడుగడుగునా జాతిపిత అడుగుజాడలు కనిపిస్తాయి.
సబర్మతి ఆశ్రమం వీడిన బాపూ స్వరాజ్య సాధన మహాయజ్ఞం కొనసాగించడానికి ఒక ‘కర్మ భూమి’ కావాలనుకున్నారు. అదే సమయంలో మహారాష్ట్రకు చెందిన వ్యాపారవేత్త జమునాలాల్ బజాజ్ ఆహ్వానం మేరకు వార్థాకు వెళ్లారు. ఒకరోజు వార్థా శివారులోని సేగావ్కు వాహ్యాళికి వచ్చిన గాంధీ.. ఓ జామచెట్టు కింద కాసేపు కూర్చున్నారట. అక్కడే ఆశ్రమం నిర్మించాలని భావించారు జమునాలాల్.

మొదట అందమైన కుటీరం ఒకటి నిర్మించారు. అదే ఆది నివాస్. 1936 జూన్ 16న ఆది నివాస్‌లో అడుగుపెట్టారు బాపూ. కొన్నాళ్లు అందులోనే ఉన్నారు. తర్వాత బాపూ కుటీలోకి మారారు. ఒక్క కుటీరంతో మొదలైన ఆశ్రమంలో తర్వాతి కాలంలో బా కుటీ, పర్చురే కుటీ, కిషోర్ నివాస్, మహదేవ్ కుటీ, సచివాలయం ఇలా ఎన్నో వెలిశాయి. సేగావ్ పేరు కాస్తా సేవాగ్రామ్గా స్థిరపడింది.
రైతుల సమస్యపై పోరాడేందుకు 1917లో బిహార్‌లోని చంపారన్ ప్రాంతానికి వెళ్లారు మహాత్మాగాంధీ. చుట్టుపక్కల పల్లెలన్నీ కాలినడకన తిరిగారు. రైతులందరితో మాట్లాడారు. శిస్తుల పేరిట అన్న
దాతల ఉసురు పోసుకుంటున్న ఆంగ్లేయులను నిలదీశారు. గాంధీ మహాత్ముడు జరిపిన తొలి రాజకీయ పోరాటమది. ఈ ఘట్టం భారత స్వతంత్ర చరిత్రలో చంపారన్ సత్యాగ్రహంగా నిలిచిపోయింది. రైతుల పక్షాన నిలిచిన గాంధీని ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోవాల్సిందిగా హుకుం జారీ చేశారు బ్రిటిష్ అధికారులు.

‘చంపారన్ నా ఇల్లు. నేను ఇక్కడే ఉంటాను’ అని తేల్చిచెప్పారు బాపూ. అన్న మాట ప్రకారం.. అక్కడే కొన్నాళ్లున్నారు. బెతియా గ్రామంలోని హజారీమాల్ ధర్మశాల వేదికగా ఉద్యమం కొనసాగించారు. తర్వాత భీతిహర్వాలో ఆశ్రమం ఏర్పాటు చేశారు. దీనిని కస్తూర్బా ఆశ్రమంగా పిలుస్తారు. ఇక్కడి గాంధీ సంగ్రహాలయంలో చంపారన్ పోరాట స్ఫూర్తి దర్శనమిస్తుంది. ఇక్కడికి సమీపంలోని వాల్మీకి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం చిన్నా పెద్దలను అలరిస్తుంది.