హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త హెల్త్ పాలసీని ప్రవేశపెట్టనున్నట్టు చెప్తున్న ప్రభుత్వం.. జర్నలిస్టుల హెల్త్ పాలసీని మాత్రం మరిచింది. ఉద్యోగుల హెల్త్ పాలసీపై గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా ఉద్యోగులు, ప్రభుత్వం చెరిసగం కాంట్రిబ్యూట్ చేస్తూ హెల్త్స్కీమ్ను అమలుచేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా ఎక్కడా జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ గురించి ప్రస్తావించకపోవడం పాత్రికేయులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది.జర్నలిస్టులకు ఆరోగ్య స్కీమ్‌ను అమలుచేస్తామని కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. తాజాగా ఉద్యోగుల హెల్త్ పాలసీని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సర్కార్..అందులో జర్నలిస్టుల అంశాన్ని ప్రస్తావించలేదు. దీంతో హెల్త్పాలసీలో జర్నలిస్టులకు కూడా స్థానం కల్పించాలని జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి.
గతంలో మాదిరిగానే ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు కూడా ఉచిత హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఉద్యోగుల కొత్త హెల్త్ స్కీమ్‌ను ఆహ్వానిస్తున్నామని, అయితే, జర్నలిస్టులకు కూడా ఉచితంగా హెల్త్ స్కీమ్‌ను అమలుచేయాలని కోరారు.