అది హజ్రత్ అబూబకర్ సిద్దిక్ (రజి) పాలనా కాలం. మదీనా నగరం కరువు కోరల్లో చిక్కుకుంది. ప్రజలంతా ఆకలితో అలమటించసాగారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో హజ్రత్ ఉస్మాన్ (రజి)కి చెందిన భారీ వర్తక బిడారు మదీనాకు చేరుకుంది. వంద ఒంటెల మీద నిండుగా ఆహార ధాన్యాలు, నూనె, పిండి లాంటి నిత్యావసర వస్తువులు ఉన్నాయి.ఈ వార్త వినగానే మదీనా వ్యాపారులందరూ ఒక్కసారిగా ఆయన దగ్గరికి పరుగులు తీశారు. కొరత ఉన్న సమయంలో సరుకును ఎక్కువ ధరకు అమ్మి లాభం పొందాలనేది వారి ఉద్దేశం.
‘ఓ ఉస్మాన్! ఈ సరుకును మాకు అమ్మేయండి. మీరు పెట్టిన పెట్టుబడి కంటే రెండు రెట్లు ఎక్కువ లాభం ఇస్తాం’ అని వ్యాపారులు బేరానికి దిగారు. దానికి హజ్రత్ ఉస్మాన్ (రజి) ప్రశాంతంగా, ‘నాకు ఇంతకంటే ఎక్కువ లాభం ఇచ్చే వారు ఉన్నారు’ అని సమాధానమిచ్చారు.
వ్యాపారులు ఆశ్చర్యపోయి, ‘సరే, ఐదు రెట్లు లాభం ఇస్తాము!’ అన్నారు. అయినా ఆయన సంతృప్తి చెందలేదు. ‘నాకు అంతకంటే ఎక్కువ లాభం దొరుకుతుంది’ అన్నారాయన.వ్యాపారులు అయోమయంలో పడ్డారు. ‘మదీనాలో ఉన్న వ్యాపారులమంతా ఇక్కడే ఉన్నాం. మాకంటే ఎక్కువ ధర ఎవరు ఇస్తారు?’ అని అడిగారు.
అప్పుడు హజ్రత్ ఉస్మాన్ (రజి) కండ్లు మెరిశాయి. ఆయన ఆకాశం వైపు చూస్తూ ఇలా అన్నారు.. ‘నా అల్లాహ్ నాకు పదింతల ప్రతిఫలాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. భూమి మీద ఉన్న ఏ వ్యాపారీ నాకు ఆ లాభాన్ని ఇవ్వలేడు. ఆయన మార్గంలో చేసే ఒక్క పుణ్యానికి పది రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తానన్నది ఆ సృష్టికర్త మాట’ అని పేర్కొన్నారు. ‘ఈ ధాన్యం, ఈ వస్తువులు ఏవీ అమ్మకానికి కాదు. ఇవన్నీ అల్లాహ్ సాక్షిగా మదీనాలో ఆకలితో ఉన్న పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నాను. నాకు ఈ లోకపు డబ్బు వద్దు, నా ప్రభువు ఇచ్చే పుణ్యం చాలు’ అన్నారు. ఆ రాత్రి హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) ఒక కల కన్నారు.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వారు అత్యంత కాంతిమంతమైన వస్ర్తాలు ధరించి, వేగంగా ఒక చోటికి వెళ్తున్నారు. అప్పుడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి) పరిగెత్తుకుంటూ వెళ్లి, ‘ఓ అల్లాహ్ ప్రవక్త! మీతో కాసేపు గడపాలని ఉంది, ఎందుకు ఇంత వేగంగా వెళ్తున్నారు?’ అని అడిగారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) చిరునవ్వుతో ‘ఉస్మాన్ చేసిన మహోన్నతమైన దానాన్ని చూసి అల్లాహ్ సంతోషించాడు. ఆయన త్యాగాన్ని అంగీకరించాడు. పరలోకంలో ఆయన కోసం సిద్ధం చేసిన గొప్ప గౌరవ మర్యాదలలో పాల్గొనడానికి, ఆయనను అభినందించడానికి నేను వెళ్తున్నాను’ అని చెప్పారు.
ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే, మనం ఇచ్చేది సంపద మాత్రమే కావచ్చు! కానీ, దాని వెనుక ఉన్న ‘నిజాయతీ’ అల్లాహ్ దృష్టిలో ఎంతో విలువైనది. మనుషుల మెప్పు కోసం కాకుండా, దైవ ప్రసన్నం కోసం త్యాగం చేసినప్పుడు.. ఆ త్యాగం చరిత్రలో నిలిచిపోవడమే కాకుండా, సాక్షాత్తూ ప్రవక్తల ప్రేమను కూడా సంపాదించి పెడుతుంది. నేడు ఏ చిన్న విపత్తు వచ్చినా.. వస్తువులను దాచిపెట్టి, ధరలు పెంచి సామాన్యుడిని దోచుకునే ‘నల్లబజారు’ శక్తులను చూస్తున్నాం. కానీ, ‘మనుషుల కష్టాన్ని చూసి లాభం వెతుక్కునేవాడు నష్టపోతాడు, మనుషుల కష్టాన్ని తీర్చి దైవంలో లాభం వెతుక్కునేవాడు ఇహపరలోకాల్లో విజయం సాధిస్తాడు’ అని హజ్రత్ ఉస్మాన్ (రజి) జీవితం మనకు నేర్పుతుంది.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076