ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా జాబితా విడుదలైంది. అయితే సర్ ప్రక్రియకు ముందు ఓటర్ల జాబితాల్లో ఉన్న తప్పులే తాజా జాబితాలోనూ కనిపిస్తున్నాయి. ఓటర్ల పేర్లు, తల్లిదండ్రుల పేర్లలో ఉన్న తప్పిదాలను సవరించి ఇస్తారని ఆశిస్తే.. నిరాశే మిగిలిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, అభ్యంతరాల స్వీకరణకు వచ్చే నెల 16 వరకు గడువు ఇచ్చారు. కాగా, ముసాయిదా జాబితాలో తమ ఓట్లు ఉన్నాయో.. లేదో పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కరీంనగర్ కార్పొరేషన్, ఆగస్టు 17: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పక్రియకు ముందు అధికారులు ఇచ్చిన ఓటరు జాబితాలో అనేక తప్పుల తడకలు ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. కాగా, పూర్తిస్థాయిలో ఫారాల పంపిణీ, స్వీకరణ, ఆన్లైన్ పక్రియ ఈ నెల 10తో ముగిసిన విషయం విధితమే కాగా, బీఎల్వోలు ఫారాలు అందించే విషయంలో అడ్రస్ సరిగా లేకపోవడంతో పంపిణీ చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క ప్రాంతంలోని ఓటరు పేరును ఇతర ప్రాంతాల్లోని పోలింగ్ బూతుల్లో పొందుపర్చడంతో ఎస్ఐఆర్ పక్రియ సందర్భంగా ఓటర్లు పత్రాలను తీసుకోవడానికి అవస్థలు పడ్డారు.
ఇలాంటి తప్పిదాలన్నింటినీ సర్ పక్రియ అనంతరం సరిచేసి ముసాయిదా విడుదల అవుతుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. ఆ మేరకు ఓటరు పత్రాల్లో తప్పిదాలను సరిచేసుకుంటూ నింపి ఓటర్లు బీఎల్వోలకు అందించారు. వాటి ప్రకారం ఓటరు నమోదు అవుతుందని అధికారులు చెప్పారు. కానీ, ముసాయిదాలో మాత్రం మళ్లీ అవే తప్పులు కనిపించాయి. తండ్రి పేర్లు, ఇంటి నంబర్లు, పోలింగ్ బూత్‌లకు సంబంధించిన పొరపాట్లు అలాగే ఉన్నాయి. గతంలోని తప్పులను అలాగే కొనసాగించినప్పుడు పత్రాల స్వీకరణ సమయంలో ఓటర్ల అన్ని తిప్పలు ఎందుకు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి.
సెప్టెంబర్ 16వరకు అభ్యంతరాల స్వీకరణ
ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాలో తమ ఓట్లు వచ్చాయో లేదో ఓటర్లు చూసుకోవాలి. ఏవైనా అభ్యంతరాలుంటే.. వచ్చే నెల 16 వరకు అధికారులు స్వీకరించనున్నారు. అభ్యంతరాలు ఉంటే 6, 7, 8 ఫారాలతో డిక్లరేషన్ ఫారాలను సంబంధిత తహసీల్ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఎస్ఐఆర్ పక్రియలో భాగంగా ఓటర్లకు ఏమైనా నోటీసులు వస్తే 12రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒక పత్రంతో అక్టోబర్ 15లోగా సంబంధిత బీఎల్వో అధికారికి అందించాల్సి ఉంటుంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు తొలగిపోవడంతోపాటు పోలింగ్ బూత్‌ల క్రమబద్ధీకరణ చేయడంతో పలు నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్‌ల సంఖ్య తగ్గింది. కరీంనగర్ నియోజకవర్గంలో గతంలో 390 పోలింగ్ బూత్‌లు ఉండగా.. ఇప్పుడు 386కు సరి చేశారు.
ఓటును ఇలా వెతకండి
ఓటర్లు తమ ఓటును పరిశీలించుకోవాలంటే ఆయా ప్రాంతానికి చెందిన పోలింగ్ బూత్‌లోని ఓటరు జాబితాను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం వాటిల్లో ఓటర్ల పేర్లను పరిశీలించుకొవాలి. అందుకోసం ముందుకు ఎన్నికల సంఘానికి చెందిన వెబ్సైట్ (htttp://www.eci.gov.in)ను ఎంట్రీ చేయాలి. సైట్ ఓపెన్ అయిన తర్వాత పైన ఉన్న sir-2026 download electroal roll పై క్లిక్ చేయాలి. అనంతరం వచ్చే వెబ్సైట్లో జిల్లా, నియోజకవర్గం సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వరుసలో వచ్చే పోలింగ్ కేంద్రాన్ని ఎంచుకున్న అనంతరం క్యాప్చాకోడ్‌ను ఎంటీ చేసి డౌన్లోడ్పై క్లిక్ చేయాలి. అనంతరం ఓటరు జాబితా పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దీనిలో పేరు, ఇంటి నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.