కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 17 : కాంగ్రెస్ సర్కారుపై కరీంనగర్ పాడి రైతులు భగ్గుమన్నారు. డెయిరీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ ఆగ్రహించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కరీంనగర్‌కు తరలివచ్చారు. పదివేల మందికిపైగా పాడి రైతులు పద్మనగర్‌లోని కరీంనగర్ డెయిరీ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. దారి పొడవునా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటకుపైగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, అనంతరం ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. అనంతరం డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వం కరీంనగర్ డెయిరీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరిట డెయిరీ ఆస్తులు, భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. అందులో భాగంగానే 19 ఎకరాల పైచిలుకు భూములను భూభారతి రికార్డుల్లో ఫెడరేషన్ పేర మార్చారని ధ్వజమెత్తారు. డెయిరీ భూములను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు పాలు, దేవాలయాలకు నెయ్యి సరఫరా విషయంలోను ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. డెయిరీని దెబ్బకొట్టేందుకు ఇతర రాష్ర్టాల నుంచి కొనుగోలు చేసి విక్రయిస్తుందన్నారు.

పాడి రైతుల పురోగతే లక్ష్యంగా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తున్న కరీంనగర్ డెయిరీని హస్తగతం చేసుకునేందుకు కుట్రలు చేయడం సముచితమేనా..? అని ప్రశ్నించారు. లక్ష పాడిరైతుల కుటుంబాల సమష్టి కృషితో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే, ప్రభుత్వం డెయిరీ ఆస్తులను లాక్కునేందుకు ప్రయత్నించడం హేయనీయమన్నారు. కరీంనగర్ డెయిరీ భూములను తిరిగి రికార్డుల్లో నమోదు చేయాలని, లేకుంటే పాడి రైతులంతా డెయిరీలోకి తమ పశువులను తెచ్చి, వంటావార్పు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.