Mohan Bhagwat : అభివృద్ధి ఫలాలు సమాజంలోని అట్టడుగున ఉన్న వారికి కూడా అందాలని, వారి ముఖంలో చిరునవ్వు కనిపించినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. మహారాష్ట్ర (Maharastra) లోని యవత్మాల్లో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భగవత్ ప్రసంగించారు.
అభివృద్ధి అంటే అందరినీ ఒకే స్థాయికి తీసుకురావడం కాదని, సమాజంలోని హెచ్చుతగ్గులను, వివిధ వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని వీలైనంతగా తగ్గించడమేనని మోహన్ భగవత్ స్పష్టంచేశారు. ‘కొంతమందికే గరిష్ఠ ప్రయోజనం’ చేకూరాలన్న వాదనను తాను వ్యతిరేకిస్తున్నానని, దీనదయాళ్ ఉపాధ్యాయ ఆశించినట్లుగా అందరికీ మేలు జరగాలని భగవత్ ఆకాంక్షించారు. ఏ నిర్ణయం తీసుకున్నా సమాజంలోని అత్యంత నిరుపేద వ్యక్తి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్న మహాత్మా గాంధీ సూత్రాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, నీడ వంటి ప్రాథమిక అవసరాలతోపాటు నాణ్యమైన విద్య, వైద్యం అందించి, వారు గౌరవప్రదంగా జీవించేలా చూడటమే నిజమైన అభివృద్ధి అని మోహన్ భగవత్ వివరించారు. రైతులు రుణాల ఊబిలో కూరుకుపోకుండా సేంద్రియ, మిశ్రమ వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని.. విత్తనాలు, ఎరువుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. ప్రగతి పేరిట ప్రకృతిని విధ్వంసం చేయకూడదని హితవుపలికారు. అభివృద్ధి బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, సమాజం కూడా తన వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.