India : సుదూర ప్రాంతాలకు ఇండియా నుంచి విమానాలు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్ నుంచి వెళ్తాయి. అంటే, పాక్ గగన తలాన్ని వాడుకుంటూ కొన్ని గమ్యాలకు ఇండియన్ విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే, ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో పాకిస్తాన్ తరచూ తమ ఎయిర్‌స్పేస్‌ను మూసేస్తోంది. దీంతో భారత్‌కు తరచూ ఇబ్బంది ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా.. ప్రత్యామ్నాయ విమానయాన మార్గాలను (ఎయిర్‌స్పేస్) అన్వేషిస్తోంది.
దీనిలో భాగంగా చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌స్పేస్ మార్గాన్ని ఇండియా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను ఇండియా అధ్యయనం చేస్తోంది. ఈ అంశంపై చైనాతో ఇండియా కొంతకాలంగా చర్చలు జరుపుతోంది. కేంద్ర విమానయాన శాఖ సూచన మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ చైనాతో ఏడాదికాలంగా సంప్రదింపులు జరుపుతోంది.
ఇండియా-పాక్ మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో ఇండియన్ విమానాలకు పాక్ ఎప్పుడో ఎయిర్‌స్పేస్ మూసేసింది. దీంతో భారత్ నుంచి వెళ్లే లేదా ఇండియా వచ్చే విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రావాల్సి వస్తోంది. దీనివల్ల మరింత దూరం పెరుగుతోంది. విమానయాన సంస్థలకు కూడా ఖర్చు ఎక్కువే. అందుకే ప్రత్యామ్నాయ ఎయిర్‌స్పేస్ రూట్ల కోసం ఇండియా ప్రయత్నాలు చేస్తోంది.
రష్యా విమానానికి ఎయిర్‌స్పేస్ ఇవ్వని పాక్
మరోవైపు పాకిస్తాన్ ఎయిర్‌స్పేస్‌కు సంబంధించి తాజాగా కీలక పరిణామం తలెత్తింది. రష్యాకు చెందిన అణు ఇంధనంతో కూడిన విమానం బంగ్లాదేశ్ వెళ్లేందుకు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్‌ను వాడుకోవాలి అనుకుంది. అయితే, ఇందుకు పాకిస్తాన్ నిరాకరించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లో ఉన్న రూపూర్ అణు విద్యుత్ కేంద్రానికి అవసరమైన అణు ఇంధనం, సాంకేతిక సహకారం అందించేందుకు రష్యా విమానం వెళ్లాల్సి ఉంది.
రష్యాకు చెందిన ఈ కార్గో విమానంలో యురేనియం ఉంది. ఈ విమానం తమ గగన తలం నుంచి వెళ్లేందుకు పాక్ నిరాకరించింది. అయితే, కొన్ని సాంకేతిక, అనుమతి, నిర్వహణ పరమైన కారణాల వల్ల రష్యా విమానానికి అనుమతి నిరాకరించాల్సి వచ్చిందని ఆ తర్వాత పాక్ ప్రకటించింది.