బెంగళూరు, ఫిబ్రవరి 12: ఐటీ దిగ్గజం విప్రో..ఉద్యోగులకు శుభవార్తను అందించింది. మార్చి 1 నుంచి సిబ్బంది వేతన పెంపు అమల్లోకి రానున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ నెలలో వాయిదా పడిన వేతన పెంపు మళ్లీ ఆరు నెలల తర్వాత అమల్లోకి రానున్నాయి. ఎంతమేర పెంచుతున్నది మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు అంతర్గతంగా ఈ-మెయిల్ ద్వారా సమాచారాన్ని చేరవేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపార రంగం అనిశ్చిత పరిస్థితుల్లో ఉండటం, టారిఫ్ వార్, రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఈ సారి వేతన పెంపు లేనట్టేనని గతంలోనే దేశీయ ఐటీ సేవల సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో ఐటీ దిగ్గజాలు టీసీఎస్, కాగ్నిజెంట్‌లు తమ వేతన పెంపును వాయిదా వేశాయి. టీసీఎస్ ఏకంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌కు వాయిదా వేయగా, కాగ్నిజెంట్ ఆగస్టు నుంచి నవంబర్‌కు వాయిదా వేసింది.