‘ఇందులో నా పాత్ర పేరు మిత్ర. తను సరదాగా ఉండే మధ్యతరగతి అమ్మాయి. బాగా మాట్లాడుతుంది. అనుకున్నది చేసేస్తుంది. కొత్తగా ఆలోచిస్తుంది. జాబ్ కోసం చెన్నై వస్తుంది. ఇందులో ‘చెప్తా చెప్తా..’ అనేది నా ఊతపదం. సినిమా పూర్తయ్యేలోపు ఈ మాట చాలాసార్లు వింటారు. దర్శకుడు అశ్విన్ నా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని మానస వారణాసి పేర్కొన్నది.
సంతోష్ శోభన్‌కు జోడీగా ఆమె నటించిన రొమాంటిక్ లవ్‌స్టోరీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో మాసన వారణాసి విలేకరులతో ముచ్చటించారు. ‘ఆడిషన్ కోసం ఈ టీమ్‌ని కలిశాక, మూవీ మేకింగ్ పట్ల వీరెంత ప్యాషన్‌తో ఉన్నారో తెలిసింది. ఇది రొటీన్ ప్రేమకథ కాదు. మిత్ర, శివల ప్రపంచాలు వేరు. వారి లక్ష్యాలు వేరు. వేరే వేరే ప్రాంతాల నుంచి చెన్నై వస్తారు. అసలు ఇలాంటి జంట కలవడమే అరుదైన విషయం. సంతోష్ మంచి కోస్టార్. సినిమా పట్ల తనకు చాలా ప్యాషన్ ఉంది. తను పట్టుదలగా నటిస్తుంటే పక్కన వాళ్లకు కూడా ఎనర్జీ వస్తుంది. ఇందులో నేను బాగా చేశానంటే కారణం ఓ విధంగా సంతోష్ శోభనే’ అని తెలిపింది.