హైదరాబాద్ : మక్తల్ మున్సిపల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప మృతిపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి స్పందించారు. మహదేవప్ప మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు నేను ఎప్పుడు ఫోన్ చేయలేదన్నారు. కావాలంటే తన కాల్‌డేటాను చెక్ చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. కాగా, పోలింగ్‌కు కొద్ది గంటల ముందే అనూహ్యంగా బీజేపీ వార్డు అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప(45) బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.
మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. ‘ప్రచారం నుంచి తప్పుకో.. లేకపోతే నీ అంతుచూస్తా’మని మంత్రి వాకిటి శ్రీహరి బెదిరించడం వల్లే మహదేవప్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ నాయకులు కూ డా ప్రచారం నుంచి తప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. తాను గెలిచినా బతకనివ్వరని చెప్పిన కొన్ని గంటల్లోనే ఇలా జరిగిందంటూ మృతుడి భార్య సత్యమ్మ చెబుతూ కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే.