హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిననాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని విలువైన భూములను చెరబడుతున్నది. గతంలో మౌలనా అబుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలోని 50 ఎకరాలు అమ్మేందుకు విఫలయత్నం చేసింది. మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షావలీ గ్రామంలో సర్వే నంబర్ 29లోని 1.04 రూ. 100 కోట్ల విలువైన ఎకరాల భూమిని లీజు ముసుగులో ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టే కుతంత్రానికి దిగింది. ఇప్పుడు సర్కార్ పెద్దల కన్ను వక్ఫ్ భూములపై పడింది. రాయదుర్గంలోని నాలెడ్జ్సెంటర్లో జామియా నిజామియాకు చెందిన 83/1 సర్వే నంబర్లోని సుమారు 2500 కోట్ల విలువైన 10 ఎకరాలను వేలం పేరిట కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసింది. రేవంత్ సర్కారు భూపందేరంపై మైనారిటీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
అధికారపీఠం కోసం అడ్డగోలు హామీలు గుప్పించిన హస్తం పార్టీ ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నది. రాష్ట్ర రాజధాని చుట్టుపక్కల అత్యంత విలువైన భూములను అమ్మకానికి పెడుతున్నది. ఏడాదిన్నర క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎక రాలను కబళించేందుకు తెగించింది. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పోరాటం..కోర్టు మొట్టికాయలు వేయడంతో వెనక్కితగ్గింది. కోకాపేటలోని భూములను వేలం వేసి మాయం చేసింది. ఇక ఇప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ముస్లిం మైనారిటీలకు చెందిన మసీదులు, వక్ఫ్ స్థలాలు, ఉర్దూ యూనివర్సిటీ, ఉర్దూ అకాడమీకి చెందిన భూములను అమ్మకానికి పెట్టింది. తాజాగా శేరిలింగంపల్లి మండలంలోని రాయదుర్గం పన్మక్త నాలెడ్జ్ సిటీ సెంటర్ పరిధి 83/1 సర్వే నంబర్లోని 5. 25 ఎకరాలు, అదే సర్వేనంబర్‌లో 5.38 ఎకరాలను టీజీఐఐసీ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 1న నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో ఎకరానికి రూ. 237 కోట్ల చొప్పున మొత్తంగా సుమారు రూ. 2500 కోట్లకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధంచేసింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని కామారెడ్డి మైనారిటీ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ ఊదరగొట్టింది. వక్ఫ్ భూములను కాపాడుతామని, ముస్లింలకు చెందిన స్థలాల్లో షాదీఖానలు, రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మిస్తామని వరాల వర్షం కురిపించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ముస్లింలకు చెందిన అత్యంత విలువైన స్థలాలను కబళించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు రహస్యంగా ఉత్తర్వులిస్తూ విక్రయించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది. మొదట ఉర్దూ యూనివర్సిటీ భూములు, ఆ తర్వాత ఉర్దూ అకాడమీ స్థలం, తాజాగా వక్ఫ్ భూములకు ఎసరుపెట్టేందుకు సిద్ధమైంది. బ్యాంకుల తనఖాలో ఉన్నాయని బూచిగా చూపుతూ సర్కార్ పెద్దలు, వారి అనుయాయులకు అప్పనంగా అప్పగించేందుకు యత్నిస్తున్నది.
జామియా నిజామియా, ఉర్దూ అకాడమీ భూముల అమ్మకంపై ముస్లిం మైనారిటీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఆదాయం పేరిట గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల అత్యంత ఖరీదైన భూములను వేలం వేయాలని నిర్ణయించడంపై రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వ చారిత్రక సంపదను ధ్వం సం చేస్తున్నదని మండిపడుతున్నారు. వెంటనే వేలాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మసీదులు, ఉర్దూ యూనివర్సిటీ, వక్ఫ్ భూములను వేలం వేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. త్వరలోనే భూముల పరిరక్షణ కోసం కార్యాచరణ ప్రకటిస్తామని తేల్చిచెబుతున్నారు.
తెలంగాణ ఉర్దూ అకాడమీ భూమి లీజ్‌పై సర్కార్ దొంగాట మొదలుపెట్టింది. లీజుపై ముందుకెళ్లబోమంటూనే జీవో 20ను రద్దుచేయకుండా పెండింగ్‌లో పెట్టింది. అయితే ‘లీజు ముసుగు-100 కోట్లకు ఎసరు..’ పేరిట గత జూలై 28న ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన సంచలన కథనం..మైనారిటీ సంఘాల బాధ్యుల ఒత్తిడికి తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గాహుస్సేన్ షావలీ గ్రామంలోని సర్వే నంబర్ 29లోని 1.04 ఎకరాల భూమిని 30 ఏండ్లకు ఎన్ఎన్ ఇఫ్రా కంపెనీకి లీజ్‌కు ఇచ్చేందుకు మంజూరు చేసిన అనుమతులను నిలిపివేసింది.
ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ 22ను జారీ చేసింది. అయితే ఉత్తర్వుల జారీలోనూ సర్కార్ అనుమానాస్పదంగా వ్యవహరించింది. గత జూలై 27న వేలాన్ని నిలిపివేస్తున్నట్టు పాత తేదీతో జీవో జారీ చేసిందని మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ముందుకెళ్లరాదని అధికారులకు నిర్దేశించింది. అయితే సర్కార్ తీరును మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్షాషా తప్పుబట్టారు. వెంటనే లీజు ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ భూములకు రక్షణ లేకుండా పోయింది. రాయదుర్గం పన్మక్త నాలెడ్జ్ సిటీ సెంటర్లోని జామియా నిజామియాకు చెందిన 10 ఎకరాలను వేలం వేయాలని నిర్ణయించడం దుర్మార్గం. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్, టెమ్రిస్ సొసైటీ చైర్మన్ ఫహీం ఖురేషీ మైనారిటీ భూములను కాపాడడంలో ఘోరంగా విఫలమయ్యారు. వెంటనే నిజామియా భూముల వేలాన్ని రద్దు చేయాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే ఢిల్లీలో విద్యార్థులు, యువత తరహా పోరాటానికి సిద్ధమవుతాం.
-ఇంతియాజ్ ఇసాక్, మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్