నందికొండ, ఆగస్టు 10: తెల్లవారుజామున సూర్యకిరణాలు కృష్ణమ్మను తాకకముందే… నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేదమంత్రాలు మార్మోగాయి. వరుణుడి కరుణ తెలంగాణపై ప్రసరించాలని కోరుతూ రుత్వికులు చేసిన మంత్రోచ్ఛారణతో కృష్ణాతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.నాగార్జునసాగర్ తీరంలోని విజయ్విహారోలో సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణాగోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు నిండాలని, రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరియాలని సంకల్పిస్తూ 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు.
భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఉదయం నుంచే యాగ క్రతువుల్లో పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్వేద పారాయణంతో యాగ క్రతువు ప్రారంభమైంది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలకు చెందిన మంత్రాలను వేదపండితులు పారాయణం చేశారు. ప్రధాన యాగ క్రతువుల కోసం 32 మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆసీనులు కాగా, మిగిలిన రుత్వికులు నిరంతర వేదపారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం అగ్ని ప్రతిష్ఠాపన నిర్వహించారు. హోమకుండాల్లో పవిత్ర అగ్నిని ప్రజ్వలింపజేసి, వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి… మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు… వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది.
పూర్ణకుంభంతో సీఎంకు ఘన స్వాగతం
వరుణి యాగంలో పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులకు యాదగిరి గుట్ట లక్ష్మీ నరిసింహస్వామి దేవస్థానం, జిల్లా యంత్రాంగం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.20 నిమిషాల వరకు వరుణ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు పాల్గొని పూర్ణాహుతితో వరుణ యాగాన్ని ముగించారు. అంతకు మందు హిల్‌కాలనీ బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి కుందూరి జానారెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్చంద్ర పవార్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
యాగంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ప్రభుత్వ విప్‌లు బీర్ల ఐలయ్య, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, శాసన మండలి సభ్యులు శంకర్‌నాయక్, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాలదారు కేశవరావు, సుదర్శన్‌రెడ్డి, దేవాదాయ కమిషనర్ హనుమంతురావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రమ్కరుణ్డ్డ్రి, ఎమ్మెల్యేలు కుందూరు జయవీర్‌రెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, బాలూనాయక్, కార్పొరేషన్, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురవాలని సంకల్పం
రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా, సమానంగా వర్షాలు కురవాలని రుత్వికులు ప్రార్థిస్తున్నారు. కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవాలని, తద్వారా రెండు మహానదులకు నిరంతర ప్రవాహాలు వచ్చి తెలంగాణ జలాశయాలు నిండాలని సంకల్పించారు.చెరువులు కళకళలాడాలని… భూగర్భ జలాలు పెరగాలని…సాగులో ఉన్న పంటలకు నీటి కొరత రాకూడదని…రైతాంగం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. ప్రస్తుత వర్షాకాలంలో వర్షపాతం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేకపోవడం, రానున్న రోజుల్లో వర్షాల తీరుపై నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక ప్రార్థనకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఒకవైపు ఇంజినీర్లు జలాశయాల్లో నీటి నిల్వలు, నదుల్లో ప్రవాహాలు, సాగునీటి అవసరాలను నిరంతరం పరిశీలిస్తుంటే… మరోవైపు ఆ జలాలన్నింటికీ మూలమైన ఆకాశం వైపు విజయపురి నుంచి వేదమంత్రాలతో ప్రార్థనలు కొసాగుతున్నాయి.