దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన వేమువాడ రాజన్న ఆలయం నిర్మాణంలో అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. హడావుడి ప్రణాళికలు.. ముందుచూపు లేని పనులతో ఆలయ ప్రాశ్యస్థ్యం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యాదాద్రికి దీటుగా తీర్చిదిద్దుతామని, వెయ్యేళ్ల పాటు చరిత్రలోనిలిచిపోయేలా నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు సిమెంట్-కాంక్రీట్‌తో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సిమెంట్ పనులపై అనేక సందేహాలు వ్యక్తమవుతుండగా.. ‘వెయ్యేళ్లు ఉండగలవా?’ అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా మరోలోపం బయట పడినట్టు తెలిసింది. పక్కా ప్రణాళికలు, డిజైన్లు లేకుండా చేపట్టిన నిర్మాణాల వల్ల.. స్వామివారి గర్భాలయ గోపురం బయటకు రెండు అడుగులు మాత్రమే కనిపిస్తున్నదని ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తున్నది. దీన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా గర్భాలయం ఎత్తుతోపాటు విస్తరించడానికి కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందుకోసం ఈనెల 12న శృంగేరి పీఠాధిపతిని కలిసేందుకు బృందం వెళ్తున్నట్టు తెలియడం చర్చనీయాంశమైంది. వీటన్నింటినీ నిశితంగా పరిశీలిస్తే.. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని తెలుస్తుండగా.. ఆలయ నిర్మాణ తీరు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నది.
కరీంనగర్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని యాదాద్రికి దీటుగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2024 నవంబర్ 20న రాజన్న ఆలయ అభివృద్ధికి శిలాఫలకం వేశారు. మాటలు కోటలు దాటాయి కానీ, క్షేత్రస్థాయిలో చూస్తే.. యాదాద్రికి ఒక్క అంశంలోనూ పోలిక లేకుండా ఆలయం నిర్మాణం అవుతున్నది. నిజానికి యాదగిరిగుట్టపై అడుగుపెట్టింది మొదలు స్వామివారిని దర్శించుకునేవరకు అణువణువూ ఆధ్యాత్మికతను నింపుతుంది.
కొండపైనున్న సప్తగోపురాలు స్వర్గలోక వైకుంఠాన్ని చూసినా ఆనందం కలుగుతుంది. ఆలయ గోపురాలు, మాడవీధులు, ప్రాకారాలు, గర్భగుడి, ధ్వజస్తంభం, శివాలయం, క్యూలైన్లు, ప్రసాదం వంటశాల, పుష్కరిణి, యాగశాల.. ఇలా దేనిని చూసినా అడుగడుగునా ధార్మికత ఉట్టిపడుతుంది. యాదగిరి నరసింహుడి సన్నిధిని ఎక్కడా రాజీపడకుండా.. ఎలాంటి తొందర లేకుండా కావాల్సినంత సమయం తీసుకుని దీక్షగా తీర్చిదిద్దారు. ఆగమశాస్త్ర నియమాలను అనుసరించి అన్ని నాణ్యతాప్రమాణాలను పాటిస్తూ.. అత్యంత పకడ్బందీగా నిర్మించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యం త ప్రతిష్టాత్మకంగా తీసుకొని, తానే స్వయంగా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాకతీయ, చోళ, చాళుక్య, పల్లవ.. ఇలా ఎన్నో అద్భుత నిర్మాణ శైలులను వినియోగించారు. ఒక్క మహారాజగోపురానికే 13వేల టన్నుల రాయిని వాడారు. వందకువంద శాతం శిలలనే ఉపయోగించి దేవాలయాన్ని తీర్చిదిద్దడం యాదాద్రిలోనే సాధ్యమైంది. ఆలయ ప్రాంగణమంతా దేవతామూర్తుల విగ్రహాలతో నిండేవిధంగా రూపకల్పన చేసి, కృష్ణశిలలను అద్భుత కళాఖండాలుగా మలిచిన తీరు అబ్బుర పరుస్తుంది. నల్లరాతిశిలల నుంచి జీవం పోసుకున్న అద్భుత కళాఖండాలు, ఆధ్యాత్మికతను పంచేలా ఒకదాన్ని మించినట్టు మరో కళాఖండం.. ఒక్కోశిల్పం.. ఒక్కో అద్భుతం.. యాదాద్రి ఆలయ వైభవాన్ని రెట్టింపు చేస్తున్నది.
సిమెంట్, కాంక్రీట్‌తో రాజన్న ఆలయ పనులు
రాజన్న ఆలయాన్ని యాదాద్రికి దీటుగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ సర్కారు, ఆచరణకు వచ్చే సరికి తీవ్ర నిరాశ పరుస్తున్నది. నిర్మాణ పనులు సిమెంట్-కాంక్రీట్‌తోనే జరుగుతున్నాయి. అంతేకాదు, ఆది నుంచి అడుగడుగునా లోపాలే కనిపిస్తున్నాయి. ప్రణాళిక లేకుండా చేయడం షరా మాములే అయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్క మాటలోచెప్పాలంటే.. రాజన్న ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదన్న అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన రాజన్న ఆలయాన్ని అత్యంత వైభవంగా వెయ్యిళ్లపాటు చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతున్న ఆ పార్టీ పాలకులు, అధికారులు.. నిజంగా ఇప్పుడు చేసే సిమెంట్ నిర్మాణాలు వెయ్యేళ్లు ఉంటాయా..? అనే భక్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు. వీటిని కప్పి పుచ్చుకోవడానికి స్వామివారి ఆలయం చెరువు కట్టపై ఉండగా రాతి కట్టడాలు చేయరాదంటూ చెబుతున్న ప్రభుత్వ పెద్దల తీరు సిమెంట్ కట్టడాలు ఏ మేరకు నిలుస్తాయన్న దానికి మత్రం సమాధానం దాటవేస్తున్నారు.
గర్భాలయ విస్తరణ.. తెరపైకి కొత్త ప్రతిపాదన?
నవ నాట సిద్ధులు స్థాపించిన రాజన్న ఆలయ విస్తరణలో అధికారులు స్పష్టమైన ప్లానింగ్, డిజైన్లు లేకుండా పనులు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. సుమారు రూ.692 కోట్లతో ఆలయ విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, ముందుగా స్వామివారి గర్భాలయంతోపాటు ప్రధాన ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టులు నిర్వహించి పనులు ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆలయంలో ముందుగా చేపట్టబోయే పనులను సాక్షాత్తూ దేవాదాయ శాఖ అధికారులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి వివరించారు.
కేవలం స్వామివారి ప్రధానాలయం విస్తరణలో భాగంగా కోటిలింగాలను మాత్రమే తొలగించి పునర్నిర్మాణం చేస్తామన్నారు. ఇప్పుడు సిమెంట్ నిర్మాణాలతో చేపట్టిన పనులు నడుస్తుండగా.. స్వామి వారి గర్భాలయ గోపురం కేవలం రెండు అడుగులే బయటకు కనిపిస్తున్నట్టుగా గుర్తించారని తెలుస్తున్నది. ఈ తప్పును కప్పిపుచ్చుకునేందుకు గర్భాలయం, గోపురం చిన్నదిగా ఉందని పేర్కొంటూ.. వాటిని విస్తరించేందుకు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తెచ్చినట్టుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే ఎంతో చారిత్రాత్మక విశిష్టత కలిగిన నాగిరెడ్డి మండపంలో కొలువైన సోమేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, బాలత్రిపుర సుందరీ దేవి ఆలయాలను కూడా విస్తరణలో భాగంగా తొలగించాల్సి వస్తుందని ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది.
ఇంకో అడుగు ముందుకు వేసి రాజగోపురాన్ని కూడా తొలగించేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్టు సమాచారం. అయితే ఆలయ నిర్మాణంలో భాగంగా ముందుగా తయారు చేసిన ప్రతిపాదనల్లో.. స్వామివారి గర్భాలయ గోపురం చిన్నదిగా ఉందని గుర్తించకపోవడం, ఇప్పుడు దానిని ఎత్తు పెంచాలని నిర్ణయించడం వెనుక దేవాదాయశాఖ నిర్లక్ష్యం వెలుగు చూస్తున్నది. అదే సమయంలో నిర్మాణాల ప్లాన్లు, డిజన్లలో లోపాలు ఉన్న విషయం స్పష్టంగా మరోసారి బయటపడిందన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆలయంలో జరుగుతున్న పనులతోపాటు ప్రధాన ఆలయాలను విస్తరించేందుకు, అలాగే ఆ పరిధిలో తొలగింపు కార్యక్రమాలను చేపట్టేందుకు సంబంధించిన వివరాలపై చర్చించేందుకు అధికారుల బృందం ఈనెల 12న (బుధవారం) శృంగేరి పీఠాధిపతిని కలిసేందుకు వెళ్తున్నట్టు తెలిసింది.
అందులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, వీటీడీఏ వైస్ చైర్మన్, కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఈవో రమాదేవి, స్థానాచార్యులు ఉమేశ్ శర్మ, అర్చకులు చంద్రగిరి శరత్, ఆర్కిటెక్చర్లు సత్యనారాయణమూర్తి, గోవింద ఉన్నారు. వీరు బుధవారం ఉదయం 10 గంటలకు శృంగేరి పీఠాధిపతిని కలిసి వివరిస్తారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు రాజన్న ఆలయ అభివృద్ధి ఆగమ శాస్ర్తానికి పూర్తి విరుద్ధంగా కొనసాగుతుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వామివారి గర్భాలయాన్ని తాకరాదన్న నిబంధన ఉన్నా.. ఇప్పుడు గర్భాలయ విస్తరణ, దాని ఎత్తును పెంచేందుకు కొత్త ప్రతిపాదనలను తెరపైకి తేవడంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ముందుగా చెప్పిన విధంగా కాకుండా ఆలయంలో ఇష్టానుసారంగా, ఆగమ శాస్ర్తానికి విరుద్ధంగా పనులు నడుస్తున్నాయని ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు విమర్శిస్తున్నారు.