జీవితం అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పూల పాన్పైతే, మరికొందరికి ముళ్ల దారి. చిన్నప్పుడే అనాథగా మారిన ఆమెను మేనమామలు పెద్దచేసి పెళ్లి చేశారు. కట్టుకున్నవాడు రాచిరంపాన పెట్టాడు. మరోవైపు క్యాన్సర్ కాటేసింది. క్యాన్సర్‌ను జయించి, తన పిల్లల భవిత కోసం పట్నం బాటపట్టిందామె. క్యాబ్ డ్రైవర్‌గా అవతారమెత్తింది. పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టింది. జీవితంలో ప్రతి మలుపులో ఓటమి ఎదురైనా.. తల్లిగా మాత్రం గెలవాలని ధైర్యంగా ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కుంభ నందినిని ‘జిందగీ’ పలకరించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
చిన్నప్పటి నుంచీ కష్టాలతో సావాసం చేయడం అలవాటైంది. మేము నలుగురం అక్కా చెల్లెళ్లం. నాన్న తాగుబోతు. అమ్మను ఎప్పుడూ కొడుతుండేవాడు. బ్రెయిన్ క్యాన్సర్‌తో అమ్మ కన్నుమూసింది. నాన్న మమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మా మేనమామలే మమ్మల్ని చేరదీశారు. బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన నేను విజయవాడలోని సర్కార్ దావఖానలో పనికి చేరాను. ఆ ప్రాంతానికి చెందిన అబ్బాయితోనే 2012లో నాకు పెళ్లి చేశారు. మాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ప్రారంభంలో నన్ను ప్రేమగా చూసుకున్నా.. తరువాత మా మధ్య గొడవలు మొదలయ్యాయి. నన్ను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. ఆ దెబ్బలు భరించలేక చనిపోదామన్న ఆలోచనలూ వచ్చేవి. కానీ, నాలాగా నా పిల్లలు అనాథలు కావొద్దని, 2017లో అతని నుంచి వేరుపడ్డాను.
మా మధ్య గొడవలు జరుగుతున్న సందర్భంలోనే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రెండో దశలో ఉండటంతో చికిత్స కోసం ఉద్యోగం వదిలేసి ఇంటిదగ్గరే ఉండిపోయా. సర్జరీ, చికిత్సలకు కలిపి రూ.5 లక్షల వరకు ఖర్చయింది. పిల్లల పేరు మీద వేసిన డిపాజిట్, కొంత బంగారం అమ్మి చికిత్స తీసుకున్నా. ఇంటి దగ్గరే ఉండాల్సి రావడం వల్ల.. మరో మూడు లక్షల వరకు అప్పయింది. చుట్టుపక్కల పిల్లలను వారి తల్లిదండ్రులు బండి మీద బడికి తీసుకెళ్లేవారు. అది చూసి నా పిల్లలు కూడా నన్ను బండి మీద స్కూల్‌కు తీసుకెళ్లమని అడిగేవారు. అప్పటికి నాకు బండి నడపడం రాదు. కానీ, పిల్లల కోసం బైక్‌తోపాటు కారు నడపడం కూడా నేర్చుకున్నా.
ఆరోగ్యం కాస్త కుదుటపడగానే తిరిగి ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. కానీ, విజయవాడలో ఉద్యోగం దొరక్కపోవడంతో.. పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ బాటపట్టాను. ఓ ప్రైవేట్ దావఖానలో నర్సుగా చేరాను. కుటుంబ పోషణతో పాటు అప్పులు తీర్చేందుకు ఆ జీతం సరిపోయేది కాదు. హాస్పిటల్లో పనిచేస్తూనే.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ర్యాపిడో నడిపేదాన్ని. ఒకరోజు హాస్పిటల్లో ఉన్నపుడు ఫిట్స్ రావడంతో అక్కడివారు భయపడి ఇక పనిలోకి రావద్దని చెప్పారు. డ్యూటీ చేయకుంటే నా పిల్లలు రోడ్డున పడతారని బతిమాలినా వినలేదు. ఆ ఉద్యోగం అలా పోయింది.

నాకు వంటలు చేయడమంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే కష్టకాలంలో నా కుటుంబానికి తోడుగా నిలిచింది. ప్రైవేట్ హాస్టళ్లలో ఉండే అమ్మాయిలు ర్యాపిడో బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణంలో వాళ్లతో మాట్లాడేదాన్ని. ఆ మాటల్లో హాస్టల్లో ఫుడ్ గురించి చెప్పేవాళ్లు. రుచీపచీ లేని తిండి తింటున్నామని బాధపడేవాళ్లు. ఒకట్రెండుసార్లు వాళ్లకు నేను చేసిన పచ్చళ్లు తీసుకెళ్లి ఇచ్చాను. ‘అక్కా బాగుంది.. మా కోసమైనా ఈ బిజినెస్ చేయ్’ అని అడిగారు. అప్పటికే ఉద్యోగం మానేసిన నాకు ర్యాపిడో నడపడం వల్ల నడుం నొప్పి సమస్య తలెత్తింది. ఇంట్లో ఉంటూనే చేయొచ్చు కదా అని గతేడాది ‘శ్రీభువనేశ్వరి హోమ్‌ఫుడ్స్’ పేరుతో పచ్చళ్ల వ్యాపారం మొదలుపెట్టాను. నాన్‌వెజ్, వెజ్ పచ్చళ్లు, స్వీట్లు తయారు చేసేదాన్ని. డోర్ డెలివరీలు చేస్తూ, ఆదివారాల్లో స్టాళ్లు నిర్వహించేదాన్ని.
రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి అనుకునేంతలోనే.. మళ్లీ అనారోగ్యం బారినపడ్డాను. ఎక్కువ సమయం పొయ్యి దగ్గర ఉండటం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి తీవ్రంగా ఇబ్బంది పడ్డాను. అప్పటికే క్యాన్సర్ కూడా వచ్చి పోవడంతో వైద్యుల సూచన మేరకు పచ్చళ్ల వ్యాపారం బాగా తగ్గించాను. మరో ఉపాధి వెతుక్కునే క్రమంలో ఉబర్ క్యాబ్ నడపాలని నిర్ణయించుకున్నా. కారు అద్దెకు తీసుకొని రెండు నెలలు నడిపాను. గిరాకీ లేకున్నా.. కిరాయి చెల్లించాల్సిందే కదా! అద్దె కారు కష్టాలు వద్దనుకొని నేనే సెకండ్ హ్యాండ్లో కారు కొనుక్కోవాలనుకున్నా. బ్యాంకులో సంప్రదిస్తే.. నాకు లోన్ రాదని చెప్పారు. హైదరాబాద్ స్థానికులు ఎవరైనా ష్యూరిటీ ఇస్తే లోన్ ఇస్తామని అన్నారు. ష్యూరిటీ కోసం ఓ వంద మందిని అడిగుంటాను. ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. చివరకు ఉబర్‌లో పరిచయమైన ఓ అన్న నా పరిస్థితి అర్థం చేసుకొని నాపై నమ్మకంతో సంతకం పెట్టి కారు ఇప్పించారు. ప్రస్తుతం నెలనెలా ఈఎంఐ కడుతూ, ఉబర్ ప్రయాణాన్ని సాగిస్తున్నా.
నేను ఉదయం ఆరు గంటలకు వెళ్లి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఇంటికొస్తా. పిల్లలకు క్యారేజి ఇచ్చి మధ్యాహ్నం వెళ్లి రాత్రి పదకొండు గంటలకు తిరిగొస్తా. మా చిన్నమ్మ పిల్లలిద్దరూ (తమ్ముడు, చెల్లె) ఇక్కడే డిగ్రీ చదువుకుంటూ నా పిల్లలకు తోడుగా నాతోపాటే ఉంటున్నారు. వాళ్లే నాకు సపోర్టు. హైదరాబాద్ పేరు తప్ప ఇంకేమీ తెలియని నేను ఈరోజు స్వశక్తితో నిలబడతున్నానంటే కారణం ఇక్కడి ప్రజలే. నా ముగ్గురు పిల్లలను గొప్పగా చదివిస్తూ, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలనేది నా కోరిక. జీవితంలో అన్ని దశల్లోనూ ఓడిపోయాను. తల్లిగా మాత్రం గెలవాలనుకుంటున్నా. అందుకోసం ఎన్ని కష్టాలైనా భరిస్తా. నా పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతానన్న నమ్మకం నాకుంది.