Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద బలమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. సినిమా గురించి ప్రేక్షకుల అభిప్రాయాలు ‘చాలా బాగుంది’ నుంచి ‘యావరేజ్’ వరకు భిన్నంగా ఉన్నప్పటికీ, రామ్ చరణ్ స్టార్డమ్తో పాటు పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తోంది. అయితే తెలంగాణలో టికెట్ ధరల పెంపు ప్రభావం కొంత మేర కనిపిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని కొన్ని థియేటర్లలో టికెట్ ధరలు రూ.400 దాటడంతో అభిమానుల్లో కొందరు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదని టాక్.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ‘పెద్ది’ హిందీ మార్కెట్లో మాత్రం అనుకున్న స్థాయిలో ప్రారంభ వేగం అందుకోలేకపోయింది. చిత్రబృందం ప్రమోషన్ల విషయంలో ఎలాంటి రాజీ పడలేదు. భోపాల్లో భారీ ఈవెంట్ నిర్వహించడంతో పాటు ముంబై, ఢిల్లీల్లో మీడియా సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. అయితే ‘పుష్ప 2’, ‘కేజీఎఫ్ 2’ వంటి చిత్రాల తరహాలో తొలి రోజు నుంచే హిందీ ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలిరాలేదు. దీనికి ప్రధాన కారణంగా సినిమా జానర్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ‘పెద్ది’ ఒక స్పోర్ట్స్ డ్రామా. ఇది ఏ ఫ్రాంచైజీకి సీక్వెల్ కాదు. అలాగే ‘కేజీఎఫ్’ తరహా భారీ ఎలివేషన్లు, ‘కాంతారా’ తరహా భక్తి, సంస్కృతి నేపథ్యం కూడా ఇందులో లేవు. ఓ నిజాయితీ గల క్రీడాకారుడి జీవిత పోరాటాన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కిన కథ కావడంతో, హిందీ ప్రేక్షకులు ముందుగా టాక్ కోసం వేచి చూసినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఇప్పుడు క్రమంగా ఉత్తరాది ప్రేక్షకులు థియేటర్ల వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ప్రస్తుతం హిందీ వెర్షన్ రూ.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ వారంలో విడుదలైన ఇతర హిందీ చిత్రాల ప్రదర్శన కూడా ‘పెద్ది’కి కొంతవరకు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుణ్ ధావన్ నటించిన చిత్రం ఆశించిన స్థాయిలో స్పందన పొందకపోవడం, బాబీ డియోల్ నటించిన మరో సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం వల్ల ‘పెద్ది’కి అదనపు స్క్రీన్లు, ప్రేక్షకుల దృష్టి లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇది భారీ రికార్డులు సృష్టించే స్థాయిలో కాకపోయినా, థియేటర్లలో డీసెంట్ ఆక్యుపెన్సీ కొనసాగడం చిత్రబృందానికి కొంత ఊరటనిస్తోంది.