BRS Leader Nagaraju : తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరు తీవ్రంగా ఖండించదగినదని బీఆర్ఎస్ దక్షిణాఫ్రికా ఎన్ఆర్ఐ ప్రెసిడెంట్ నాగరాజు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించిన తీరును ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలు నుంచి పోలింగ్ వరకు ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ బహిరంగంగా ఉల్లంఘిస్తూ ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెదిరించడం, భౌతిక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న హీన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనై చట్టాన్ని సైతం పక్కన పెట్టి వ్యవహరించిన కొందరు పోలీసు అధికారుల తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు, డబ్బు సంచులు, బెదిరింపులు ఉపయోగించడం ప్రజల తీర్పును ప్రభావితం చేయలేవని, తెలంగాణ ప్రజలు ఎప్పటిలాగే న్యాయం, అభివృద్ధి, సంక్షేమం వైపు నిలబడతారని తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని అభిప్రాయపడ్డారు.
అధికార పార్టీ ఆకృత్యాలకు అదరకుండా, బెదరకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇన్చార్జ్లు, ప్రతి బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడికి దక్షిణాఫ్రికా బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీపై విశ్వాసం కలిగి ఉండటంతోపాటు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించిన ప్రతి ఓటరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి మేము ఎప్పటికీ నిలబడతామని నాగరాజు స్పష్టం చేశారు.