Mumbai : ముంబైలో దారుణం జరిగింది. ఒక ఇండియన్ నేవీ అధికారి, అతడి కుటుంబం శనివారం అనుమానాస్పద స్థితిలో మరణించింది. మృతుల్లో దంపతులతోపాటు వారి ఇద్దరు పసి పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటన ఆగష్టు 15, శనివారం రాత్రి ముంబై, కొలాబాలోని, నేవీ నగర్లో జరిగింది. ఇండియన్ నేవీ సిబ్బంది ఉండే రెసిడెన్షియల్ ఏరియాలోని తమ ఫ్లాట్‌లో ఈ కుటుంబం మరణించింది. ఈ ఘటనపై కఫ్ పరేడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ నేవీలో ఒక వ్యక్తి సెయిలర్‌గా పని చేస్తున్నాడు.
అతడు తన కుటుంబంతో కలిసి నేవీ నగర్లో ఉన్న రెసిడెన్షియనల్ ఇండ్లలో నివాసం ఉంటున్నాడు. శనివారం అతడికి, కుటుంబ సభ్యులకు పలువురు కాల్స్ చేసినా స్పందించలేదు. దీంతో వారి ఇంటికి వెళ్లి స్థానికులు పరిశీలించగా ఇంట్లోని నలుగురు మరణించి ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలానికి వెళ్లేసరికి నేవీ సెయిలర్ ఉరి వేసుకుని మరణించి ఉన్నాడు. అతడి భార్య, ఇద్దరు పిల్లలు కూడా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు పిల్లల్లో ఒకరు రెండు నెలల వయసున్న చిన్నారికాగా.. ఇంకొకరికి మూడేళ్లు. మృతుడి భార్య , ఇద్దరు పిల్లలు మాత్రం విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు తెలుస్తోంది. ముగ్గురికి విషం ఇచ్చి, ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా అనే సందేహాలున్నాయి.
ఘటనా స్థలం నుంచి నలుగురి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. హత్యా, ఆత్మహత్యా.. రెండింట్లో ఏది అనే కోణంలో కూడా విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదికతోపాటు విచారణ అనంతరమే వారి మరణానికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు అన్నారు. మరోవైపు ఇండియన్ నేవీ అధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనలో బాధిత కుటుంబాలకు తగిన సాయం అందిస్తామని నేవీ తెలిపింది.