న్యూఢిల్లీ: గగనతలంలో తనపై పైలట్ దాడి చేసిన తర్వాత, తనలో మిగిలివున్న కొద్దిపాటి శక్తినంతా కూడదీసుకుని విమానాన్ని కాపాడానని, ఇతరులను ఎట్టిపరిస్థితుల్లోనూ చనిపోనివ్వకూడదని గట్టిగా నిశ్చయించుకున్నానని ఫ్లైదుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అన్నారు. ప్రస్తుతం యూఏఈలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న పైలట్‌తో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు.
తాను కష్టాల్లో ఉన్నప్పుడల్లా హనుమాన్ చాలీసాను పఠిస్తానని మచ్చర్ మోదీతో చెప్పారు. ‘నాపై దాడి జరిగిన సమయంలో విమానం వేగంగా కిందికి పడిపోతున్నదని నేను గ్రహించాను.. నాకు ఎన్నో గాయాలు అయ్యాయి. కానీ ఎలాగైనా లేచి కార్యాచరణలోకి దిగాలని నా మనసుకు చెప్పుకున్నాను. ఆ సమయంలో కాక్‌పిట్ తలుపు తెరిచేందుకు చాలా అవస్థ పడుతూ వెళ్లాను. మిగతా వ్యక్తుల సాయం కూడా అంతే ముఖ్యం’ అని పైలట్ ప్రధానితో అన్నారు.
పైలట్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, స్థిత ప్రజ్ఞతను ప్రశంసించిన ప్రధానమంత్రి.. పైలట్ మచ్చర్ తీసుకున్న నిర్ణయం ఎంతోమంది ప్రాణాలను కాపాడిందని కొనియాడారు. ఈ ఘటన తర్వాత భారతీయులు ఇతరుల ప్రాణాలను తీసేవారు కాదని, ఇతరులను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టేవారని దేశం గర్వంగా చెప్పుకోగలదని’ ప్రధాని మోదీ పైలట్‌తో అన్నారు.
భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దాడిచేసి, విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించిన ఫ్లైదుబాయ్ ఒమన్ కో పైలట్.. గతంలో సోషల్ మీడియాలో యూదులను చంపడం గురించి ప్రస్తావించాడని, అతను ఉగ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్లు కనిపిస్తున్నదని ఇజ్రాయెల్ అధికారులు తెలిపారు. కో పైలట్ విమానాన్ని కూల్చివేయాలని భావించాడా లేదా ఈ ఘటనకు ఉగ్రవాదం లేదా ఇరాన్‌తో ఏమైనా సంబంధం ఉండా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నది. దాడి చేసిన వ్యక్తి తనను చంపేయాలని ఎమిరాటీ సిబ్బందిని కోరాడని ఇజ్రాయెల్ అధికారి ఒకరు ‘టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్’కు వెల్లడించారు.
ఇజ్రాయెల్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమాన కో పైలట్‌కు ఇరాన్‌తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ దాడిలో ఇరాన్ పాత్ర ఉన్నట్లు తేలితే టెహ్రాన్‌పై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు.