ప్రయోగశాలలో తయారైన వజ్రం నిజమైనదేనా? దానిని ఎలా గుర్తించగలం?
ప్రయోగశాలలో తయారైన వజ్రం.. నిజమైన వజ్రమేనా? దానిని ఎలా గుర్తించగలం? వాటి ధర ఎలా నిర్ణయిస్తారు? కొనుగోలు చేశాక తిరిగి అమ్ముకోవచ్చా? సంస్థలు ప్రకటించే ఎక్స్ఛేంజ్ హామీలకు ఎంతవరకు విలువ ఉంది? అన్నింటికన్నా ముఖ్యంగా వీటిని పెట్టుబడిగా చూడవచ్చా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఈ వెలుగుల విలువెంత!
ఒకప్పుడు వజ్రం కొనాలంటే భారీగా ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇక సామాన్యులకైతే అది కలే. దాని మెరుపు, దృఢత్వం, తరతరాలకు అందించే ఆస్తి అనే అభిప్రాయం వజ్రాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. కానీ, ఇప్పుడు వజ్రాల మార్కెట్లో కొత్త మార్పు కనిపిస్తున్నది. భూమి పొరల్లో ఏర్పడే సహజమైన వజ్రాలకు ప్రత్యామ్నాయంగా ప్రయోగశాలల్లో తయారవుతున్న ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ (Lab-Grown Diamonds) అడుగడుగునా అందుబాటులోకి వచ్చాయి. ధర తక్కువగా ఉండటం, సహజమైన వజ్రాలతో సమానమైన లక్షణాలు ఉండటం వీటికి ఆదరణ పెరగడానికి కారణాలు. మధ్యతరగతి వారికి తక్కువ ధరలో వజ్రాలు కొనుగోలు చేసే అవకాశం లభిస్తున్నది.
కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు! ప్రయోగశాలలో తయారైన వజ్రం నిజమైన వజ్రమేనా? దానిని ఎలా గుర్తించగలం? వాటి ధర ఎలా నిర్ణయిస్తారు? కొనుగోలు చేశాక తిరిగి అమ్ముకోవచ్చా? సంస్థలు ప్రకటించే ఎక్ఛ్సేంజ్ హామీలకు ఎంతవరకు విలువ ఉంది? అన్నింటికన్నా ముఖ్యంగా వీటిని పెట్టుబడిగా చూడవచ్చా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రపంచాన్ని కొంచెం లోతుగా సానబట్టాల్సిందే!
సాధారణంగా వజ్రాలు భూమి లోపల అత్యంత అధిక ఉష్ణోగ్రతలు, పీడనం ఉన్న పరిస్థితుల్లో కోట్ల సంవత్సరాల కాలంలో ఏర్పడతాయి. భూమి లోపలి కార్బన్ అణువులు ప్రత్యేకమైన స్ఫటిక నిర్మాణంలో అమరడం వల్ల ఇవి తయారవుతాయి. ఇదే ప్రక్రియను ప్రయోగశాలల్లో అనుకరిస్తూ వజ్రాలు తయారు చేస్తున్నారు. వీటినే ల్యాబ్ గ్రోన్ లేదా సింథటిక్ డైమండ్స్ అంటారు. అలాగని వజ్రంలా కనిపించే ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఓ గాజు ముక్క కాదు. సాధారణ నగల్లో ఉపయోగించే క్యూబిక్ జిర్కోనియా (Cubic Zirconia), మొయిసానైట్ (Moissanite) వంటి రాళ్లతో సమానమూ కాదు. సహజ వజ్రం, ల్యాబ్ గ్రోన్ వజ్రం రెండిటిలోనూ కార్బన్ అణువులే ఉంటాయి. వాటి స్ఫటిక నిర్మాణం కూడా ఒకటే. అవి ఏర్పడిన విధానంలో, ప్రదేశంలో, కాలంలోనే తేడా ఉంటుంది.

Natural Vs Lab Grown Diamon
ఇలా తయారవుతాయి
ప్రధానంగా రెండు పద్ధతుల ద్వారా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారవుతాయి.
HPHT High Pressure High Temperature
ఇది భూమి లోపల వజ్రాలు ఏర్పడే పరిస్థితులకు దగ్గరగా ఉంటుంది. దీనికోసం…
– కార్బన్ మూల పదార్థాన్ని ఒక చిన్న వజ్రపు సీడ్‌తో కలిపి ప్రత్యేక పరికరంలో ఉంచుతారు.
– అధిక పీడనం, ఉష్ణోగ్రతలతో నియంత్రిత వాతావరణాన్ని సృష్టిస్తారు.
– కార్బన్ అణువులు సీడ్‌పై స్ఫటిక రూపంలో పెరుగుతాయి.
– కొంతకాలానికి వజ్రపు స్ఫటికం ఏర్పడుతుంది.
CVD Chemical Vapor Deposition
ఈ విధానంలో కార్బన్ వాయువు నుంచి కార్బన్ అణువులు వజ్రపు సీడ్‌పై పొరలుగా పేరుకుపోయి స్ఫటికాన్ని ఏర్పరుస్తాయి. దీనికోసం…
– ప్రత్యేక వాక్యూమ్ చాంబర్లో వజ్రపు సీడ్‌ను ఉంచుతారు.
– కార్బన్ కలిగిన వాయువులతో నియంత్రిత వాతావరణాన్ని సృష్టిస్తారు.
– వాయువులోని కార్బన్ అణువులు విడిపోయి సీడ్‌పై పేరుకుపోతాయి.
– క్రమంగా వజ్రపు స్ఫటికం పెరుగుతుంది.
ఎలా గుర్తించగలం
ల్యాబ్ గ్రోన్, సహజమైన వజ్రం… చూడటానికి రెండూ ఒకేలా మెరుస్తాయి. సాధారణ కంటితో చూసి ఏది సహజ వజ్రమో, ఏది ప్రయోగశాలలో తయారైందో చెప్పడం సాధ్యం కాదు. ఎందుకంటే వాటి రసాయన నిర్మాణం, మెరుపు, దృఢత్వాలలో ఎలాంటి తేడా అనిపించదు. ల్యాబ్ గ్రోన్ డైమండ్ తక్కువ ధరలో లభిస్తున్నదని దాని నాణ్యత కూడా తక్కువ అని భావించకూడదు. అదే సమయంలో రెండూ నిజమైన వజ్రాలే కాబట్టి వాటి మార్కెట్ విలువ కూడా ఒకేలా ఉంటుందని అనుకోకూడదు. ఇక్కడే ఓ చిక్కు ఉంది. కొన్నిసార్లు ల్యాబ్ గ్రోన్ వజ్రాలను సహజ వజ్రాలుగా చూపించే అవకాశం ఉంది. అందుకే వాటిని గుర్తుపట్టే మార్గాలు తెలుసుకోవాలి.
లేజర్ ఇన్స్క్రిప్షన్: కొన్ని ల్యాబ్ గ్రోన్ వజ్రాల అంచులపై (Girdle) లేజర్‌తో ‘Laboratory Grown’ అనో సంబంధిత రిపోర్టు నంబరో చెక్కుతారు. మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తేనే ఇవి కనిపిస్తాయి.
జెమాలజీ పరీక్ష: వజ్రం లోపలి నిర్మాణం, అందులోని సూక్ష్మమైన లోపాలు (Inclusions), రంగు, కాంతికి స్పందించే విధానం వంటి లక్షణాలను నిపుణులు పరిశీలిస్తారు.
స్పెక్ట్రోస్కోపీ పరీక్షలు: యూవీ ఫ్లోరెసెన్స్, ఫొటో ల్యూమెనెసెన్స్, ఇఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీ లాంటి పరీక్షలతో వజ్రం సహజంగా ఏర్పడిందా, ప్రయోగశాలలో తయారైందా అనేది నిర్ధారిస్తారు.
సర్టిఫికేషన్: ప్రతి వజ్రంతో పాటు ఓ సర్టిఫికేషన్ వస్తుంది. కొనుగోలు సమయంలో వజ్రం గురించి జెమాలజీ సంస్థ ఇచ్చే ఆ రిపోర్టు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో వజ్రం ల్యాబొరేటరీ- గ్రోన్ అని స్పష్టంగా పేర్కొనాలి.
ఈ విషయంలో Solitaire Gemological Laboratories (SGL), Gem Testing Laboratory (GTL), International Gemological Institute (IGI) లాంటి సంస్థల రిపోర్టులు ఉపయోగపడతాయి. రిపోర్టులోని నంబర్‌ను సంబంధిత సంస్థ వెబ్సైట్లో పరిశీలించి, అది అదే వజ్రానికి సంబంధించినదో లేదో నిర్ధారించుకోవాలి.

Diamond Formation Earth To
విలువ ఇలా నిర్ణయిస్తారు
సహజ వజ్రాల లాగానే ల్యాబ్ గ్రోన్ వజ్రాల నాణ్యతను కూడా 4Cs ఆధారంగా అంచనా వేస్తారు.
Cut (కట్): వజ్రాన్ని ఏ విధంగా కోసి, పాలిష్ చేశారనే అంశం. దీని వల్ల కాంతి రిఫ్లెక్షన్, మెరుపు ప్రభావితమవుతాయి.
Color (రంగు): వజ్రంలో రంగు ఎంత తక్కువగా ఉందన్నదాని మీద గ్రేడ్ ఆధారపడి ఉంటుంది. సాధారణంగా D నుంచి Z వరకు రంగు గ్రేడింగ్ విధానం ఉపయోగిస్తారు.
Clarity (స్వచ్ఛత): వజ్రం లోపల లేదా ఉపరితలంపై ఉండే సూక్ష్మమైన మచ్చలు, లోపాల ఆధారంగా స్వచ్ఛతను అంచనా వేస్తారు.
Carat (క్యారెట్): వజ్రం బరువును సూచిస్తుంది. ఒక క్యారెట్ అంటే 200 మిల్లీ గ్రాములు. అయితే ఈ నాలుగు అంశాలతోనే మార్కెట్ ధర నిర్ణయించరు. వజ్రం ఏ పద్ధతిలో తయారైంది, దానికి చేసిన అదనపు మార్పులు, తయారీ సంస్థ, డిమాండ్-సరఫరా, బ్రాండ్ ఆభరణం తయారీ ఖర్చు లాంటి అంశాలూ ప్రభావం చూపుతాయి.
ఎక్కడైనా మార్చుకోవచ్చా?
ల్యాబ్ గ్రోన్ డైమండ్ నగలను విక్రయించే సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. వాటిలో ముఖ్యమైనది ఎక్స్ఛేంజ్ లేదా బైబ్యాక్ సౌకర్యం. కొన్ని సంస్థలు తమ దగ్గర కొనుగోలు చేసిన ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను భవిష్యత్తులో తిరిగి ఇచ్చి మరో నగను తీసుకోవచ్చని చెబుతున్నాయి. మరికొన్ని సంస్థలు పాత నగను ఇచ్చి కొత్త నగ కొనుగోలు చేయవచ్చని ప్రకటిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక సంస్థ ఇచ్చే ఎక్స్ఛేంజ్ హామీ అన్ని నగల దుకాణాలకూ వర్తించే నియమం కాదు. ఉదాహరణకు…
– ఒక సంస్థ, తన దగ్గర కొనుగోలు చేసిన వజ్రాలనే తిరిగి తీసుకోవచ్చు.
– మరొక సంస్థ తమ బ్రాండ్‌కు చెందిన నగలను మాత్రమే ఎక్స్ఛేంజ్ చేయవచ్చు.
– ఇంకొన్ని సంస్థలు నిర్దిష్ట కాలవ్యవధిలో మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించవచ్చు.
– కొన్ని సంస్థలు వజ్రం విలువను కాకుండా, కొత్త నగ కొనుగోలుపై కొంత క్రెడిట్ లేదా తగ్గింపును మాత్రమే అందించవచ్చు.
– మరికొన్ని సంస్థలు వజ్రాన్ని తిరిగి తీసుకున్నా, నగలోని బంగారం విలువను విడిగా లెక్కించవచ్చు.
అందువల్ల ఎక్స్ఛేంజ్ అనే పదాన్ని చూసి పూర్తి మొత్తాన్ని తిరిగి పొందవచ్చని భావించకూడదు. వాటి కొనుగోలు సమయంలో నిర్మొహమాటంగా కొన్ని ప్రశ్నలకు జవాబు తెలుసుకోవాలి…
ఎక్స్ఛేంజ్ ఎప్పుడైనా చేసుకోవచ్చా? లేక గడువు ఉందా?
కొనుగోలు చేసిన సంస్థలోనే మార్చుకోవాలా?
ఇతర బ్రాండ్ల ల్యాబ్ గ్రోన్ వజ్రాలను కూడా తీసుకుంటారా?
వజ్రం కొనుగోలు ధరను పరిగణనలోకి తీసుకుంటారా? లేక అప్పటి మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకుంటారా?
ఎక్స్ఛేంజ్ సమయంలో ఎంత శాతం విలువ తగ్గిస్తారు?
నగను మార్చుకోవడానికి అదనంగా మేకింగ్ చార్జీలు, పన్నులు చెల్లించాలా?
సర్టిఫికెట్, ఒరిజినల్ బిల్లు తప్పనిసరా?
మంచి పెట్టుబడేనా!
వజ్రం అంటేనే విలువైన ఆస్తి, తరతరాలకు అందించే సంపద అనే భావన సమాజంలో ఉంది. అందుకే చాలామంది వాటిని కొనుగోలు చేసేటప్పుడు భవిష్యత్తు విలువను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ విషయంలో ఈ ఆలోచనను కొంత మార్చుకోవాలి. వీటిని ఆభరణాలుగా, అలంకరణ వస్తువులుగా చూడాలే కానీ, పెట్టుబడి సాధనంగా చూడటం ప్రమాదకరం. అందుకు కారణాలు స్పష్టం…
ఉత్పత్తి పెరిగే కొద్దీ ధర తగ్గే అవకాశం: సహజ వజ్రాలు పరిమితంగా లభిస్తాయి. కానీ ల్యాబ్ గ్రోన్ వజ్రాలను సాంకేతికత ఆధారంగా పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయవచ్చు. కొత్త తయారీదారులు మార్కెట్లోకి వస్తున్న కొద్దీ పోటీ పెరుగుతుంది. ఫలితంగా ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
సాంకేతిక అభివృద్ధి: ఈరోజు ఒక వజ్రాన్ని తయారుచేయడానికి అయ్యే ఖర్చు, భవిష్యత్తులో అదే పరిమాణం, నాణ్యత కలిగిన వజ్రాన్ని తయారుచేయడానికి అయ్యే ఖర్చుతో సమానంగా ఉండకపోవచ్చు. ఉత్పత్తి సులభతరం కావడం వల్ల పాత వజ్రాల రీసేల్ ధరలపై ప్రభావం పడవచ్చు.
మార్కెట్ పరిమితం: సహజ వజ్రాలకు ఉన్న మార్కెట్ వ్యవస్థ, కొనుగోలుదారుల నెట్వర్క్, ఔట్ లెట్స్… ల్యాబ్ గ్రోన్ వజ్రాలకు లేవు. దాంతో కొనుగోలు చేసిన నగను తిరిగి విక్రయించాలనుకున్నప్పుడు ఆశించిన ధర లభించకపోవచ్చు.
కొనే ధర.. అమ్మే వెల: ఒక నగను కొనుగోలు చేసేటప్పుడు వజ్రం ధరతో పాటు బంగారం, డిజైన్, మేకింగ్ చార్జీలు, బ్రాండ్ మార్జిన్, పన్నులు కలుస్తాయి. కానీ, తిరిగి విక్రయించే సమయంలో వీటన్నిటికీ మీరు చెల్లించిన మొత్తం తిరిగి రావడం సాధ్యం కాదు.
అందుకే ఆభరణంగా కొనాలనుకుంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ మంచి ప్రత్యామ్నాయం కావచ్చు. కానీ, డబ్బును పెంచుకోవాలనే ఉద్దేశంతో కొనుగోలు చేయాలనుకుంటే దాని రీసేల్ విలువ, ధరల చరిత్రను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

Check The Diamond
కొనేటప్పుడు జాగ్రత్తలు..
ల్యాబ్ గ్రోన్ వజ్రాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.
ల్యాబ్ గ్రోన్ అని స్పష్టంగా ఉందో లేదో చూడాలి: సహజ వజ్రం, ప్రయోగశాలలో తయారైన వజ్రం రెండిటి మధ్య ధరల్లో గణనీయమైన వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి బిల్లు, సర్టిఫికెట్లో వజ్రం ఏ రకానికి చెందిందో స్పష్టంగా ఉండాలి.
సర్టిఫికెట్ తప్పనిసరి: వజ్రం క్యారెట్, కలర్, క్లారిటీ, కట్ వంటి వివరాలతో పాటు అది HPHT పద్ధతిలో తయారైందా, CVD పద్ధతిలో తయారైందా అనే వివరాలు కూడా తెలుసుకోవాలి.
విలువలను విడిగా తెలుసుకోవాలి: నగలో ఎంత బంగారం ఉంది? దాని స్వచ్ఛత ఎంత? వజ్రం ధర ఎంత? మేకింగ్ చార్జీలు ఎంత? పన్నులు ఎంత? అనే వివరాలు బిల్లులో
విడివిడిగా ఉండాలి.
నిబంధనలు చదవాలి: ప్రకటనల్లో చెప్పే హామీలను నమ్మకుండా వాటికి సంబంధించిన పూర్తి నిబంధనలను చదవాలి. తిరిగి విక్రయించే సమయంలో ఎంత మొత్తం లభిస్తుందో అర్థం చేసుకోవాలి.
ఆన్లైన్ ధరలతో పోల్చాలి: ఒకే క్యారెట్, ఒకే కట్, ఒకే కలర్, ఒకే క్లారిటీ ఉన్న వజ్రాలను వివిధ సంస్థల్లో పోల్చాలి.
రిటర్న్ పాలసీ: కొనుగోలు చేసిన తర్వాత వజ్రంలో లోపం కనిపిస్తే లేదా సర్టిఫికెట్లో పేర్కొన్న వివరాలకు సరిపోకపోతే ఏం చేయాలన్నది ముందే తెలుసుకోవాలి.
బంగారానికి BIS హాల్‌మార్క్: వజ్రం ల్యాబ్ గ్రోన్ అయినంత మాత్రాన దానికి అమర్చిన బంగారం నాణ్యతలో రాజీ పడాల్సిన అవసరం లేదు. నగలో వాడిన బంగారం స్వచ్ఛతనూ పరిశీలించాలి.
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మనకు ఒక కొత్త ఆలోచనను పరిచయం చేస్తున్నాయి. విలువైన వస్తువు కావాలంటే అది ప్రకృతిలోనే ఏర్పడాలా? సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వస్తువుకు విలువ ఉండదా? అనే ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి.
ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా వజ్రమే. దాని మెరుపు, కాఠిన్యం, భౌతిక లక్షణాలు సహజ వజ్రాలకు సమానంగా ఉంటాయి. కానీ, దాని అరుదైన లక్షణం, మార్కెట్ విలువ, రీసేల్ వాల్యూ మాత్రం వేరుగా ఉంటాయి. తక్కువ ధరలో అందమైన నగలు కావాలనుకునేవారికి ఇవి ఒక మంచి ఎంపిక కావచ్చు. అయితే భవిష్యత్తులో ధర పెరుగుతుందనే ఆశతో కొనుగోలు చేయడం మాత్రం సరైన నిర్ణయం కాకపోవచ్చు. చివరగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే.. వజ్రం కొనేటప్పుడు దాని మెరుపును మాత్రమే కాదు, దాని మూలాన్ని, నాణ్యతను, ధరను, భవిష్యత్తు విలువను కూడా పరిశీలించాలి.
మన దేశంలో ప్రమాణాలు
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మార్కెట్ విస్తరిస్తుండటంతో వినియోగదారులకు స్పష్టత ఉండేలా భారతీయ ప్రమాణాల సంస్థ (BIS) IS 19469:2025 Jewellery: Consumer Confidence in the Diamond Industry అనే ప్రమాణాన్ని రూపొందించింది. దీని ముఖ్య ఉద్దేశం సహజ వజ్రాలు, ల్యాబ్‌గ్రోన్ వజ్రాలు, మార్పు చేసిన వజ్రాలు, నకిలీ వజ్రాలు, ఇతర ప్రత్యామ్నాయ రాళ్ల మధ్య స్పష్టమైన తేడాలను తెలియజేయడం. ఈ ప్రమాణంలో ముఖ్యంగా ప్రస్తావించిన అంశాలు…
– ప్రయోగశాలలో తయారైన వజ్రాలను ‘Laboratory-Grown Diamond’ లేదా ‘Laboratory-Created Diamond’ అని స్పష్టంగా పేర్కొనాలి.
– సహజ వజ్రం, ల్యాబ్ గ్రోన్ వజ్రం అనే తేడాను దాచిపెట్టే పదజాలాన్ని వాడకూడదు.
– వజ్రాలకు చేసిన అదనపు మార్పుల వివరాలు వెల్లడించాలి.
– వజ్రంలా కనిపించే ఇతర రాళ్లను నిజమైన వజ్రాలుగా ప్రచారం చేయకూడదు.
పది సూత్రాలు
ల్యాబ్ గ్రోన్ డైమండ్ విషయంలో గుర్తుంచుకు తీరాల్సిన చెక్‌లిస్ట్
1) వజ్రం నిజంగా ల్యాబ్ గ్రోన్ డైమండేనా?
2) GIA లేదా IGI వంటి స్వతంత్ర సంస్థ రిపోర్టు ఉందా?
3) HPHT లేదా CVD పద్ధతిలో తయారైందా?
4) ఏవైనా అదనపు మార్పులు చేశారా?
5) కట్, కలర్, క్లారిటీ, క్యారెట్ వివరాలు ఏమిటి?
6) వజ్రం, బంగారం ధరలు విడివిడిగా పేర్కొన్నారా?
7) బంగారానికి BIS హాల్‌మార్క్ ఉందా?
8) ఎక్ఛ్సేంజ్, బైబ్యాక్ నిబంధనలు రాతపూర్వకంగా ఉన్నాయా?
9) తిరిగి విక్రయిస్తే ఎంత విలువ రావచ్చు?
10) సర్టిఫికెట్ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయా?

Lab Grown Diamond Price Dro
ధరలు తగ్గుతున్నాయా…
2025 అక్టోబర్‌లో రాయిటర్స్ ప్రచురించిన కథనం ప్రకారం, 2018 నుంచి ఒకటి, రెండు క్యారెట్ల ల్యాబ్ గ్రోన్ వజ్రాల సగటు హోల్‌సేల్ ధరలు 96 శాతం వరకు తగ్గాయి. ఇక డి బీర్స్ గ్రూప్ 2026 జూన్ డైమండ్ రిపోర్టు ప్రకారం, 2020 నుంచి 2026 నాటికి ల్యాబ్ గ్రోన్ వజ్రాల హోల్‌సేల్ ధరలు 93 శాతం తగ్గాయి. ఈ గణాంకాలు అంతర్జాతీయ హోల్‌సేల్ మార్కెట్‌కు సంబంధించినవి కాబట్టి మన దేశంలోనూ ఇదే శాతం ధర తగ్గిందని అనుకోలేం! కానీ, ఉత్పత్తి పెరుగుదల, ధరల పోటీ, భవిష్యత్తులో సరఫరా పెరిగే అవకాశం గురించి ఇవి ఒక సూచన ఇస్తాయి.
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ భవిష్యత్తు!
వజ్రాల పరిశ్రమలో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఓ విప్లవం. ఒకప్పుడు అత్యంత ఖరీదైన ఆభరణంగా భావించిన వజ్రం ఇప్పుడు మరింత ఎక్కువమందికి అందుబాటులోకి వస్తున్నది. మరీ ముఖ్యంగా జెన్ జీ, వివాహం చేసుకునే జంటలు, తక్కువ బడ్జెట్లో ఆకర్షణీయమైన ఆభరణాలు కొనాలనుకునేవారు వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. మన దేశంలో అయితే ఈ పరిశ్రమకి ఇంకాస్త ప్రత్యేక స్థానమే ఉంది. సూరత్ లాంటి నగరాలు వజ్రాల కటింగ్, పాలిషింగ్ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు పొందాయి. సహజ వజ్రాలతో పాటు ల్యాబ్ గ్రోన్ వజ్రాల తయారీ, ప్రాసెసింగ్ రంగాల్లోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తున్నది. ICRA నివేదిక ప్రకారం, మన దేశంలో పాలిష్ చేసిన వజ్రాల ఎగుమతుల్లో ల్యాబ్ గ్రోన్ వజ్రాల వాటా 2019లో ఒక శాతం ఉండగా, 2025 నాటికి ఎనిమిది శాతానికి చేరింది.
– ఎన్. శిరీష
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

