ఏఐ అతిగా వాడితే అథోగతే
న్యాయవిద్యలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.
- కామన్వెల్త్ న్యాయవిద్యా సదస్సులో సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): న్యాయవిద్యలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయ న్యాయవిద్యా సదస్సులో శనివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
రాత పరీక్షలకే పరిమితం కాకుండా మౌఖిక వివరణ, ఉటంకించిన తీర్పులకు సంబంధించిన ఆధారాలను సమర్థించడం, ఏఐ రూపొందించిన సమాధానాల్లోని తప్పులను గుర్తించడం లాంటి పద్ధతులను కూడా మూల్యాంకనంలో ప్రవేశపెట్టాలన్నారు. 2023 నుంచి సుప్రీంకోర్టు అమలు చేస్తున్న న్యూట్రల్ సైటేషన్ విధానం ద్వారా సంవత్సరం, న్యాయస్థానం, తీర్పు సంఖ్య, పే రా వివరాలతో తీర్పులను గుర్తించి ధ్రువీకరించవచ్చని చెప్పారు. వాణిజ్య డాటాబేస్లపై ఆధారపడకుండా అనువాద తీర్పులు, ఆధారాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఏఐపై ఆధారపడవద్దు: జస్టిస్ నరసింహ
ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల న్యాయ విద్యార్థుల్లో స్వతంత్రంగా ఆలోచించే సామర్థ్యం బలహీనపడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ హెచ్చరించారు. న్యాయవిద్య ఇప్పుడు మూడో దశ పరిణామానికి ఏఐ కారణమవుతున్నదని తెలిపారు.
మార్పురావాలి: అటార్నీ జనరల్
న్యాయవిద్యపై సాంకేతికత, ప్రపంచీకరణ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని పాఠ్యాంశాలు, బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలని భారత అటార్నీ జనరల్ డాక్టర్ ఆర్ వెంకటరమణి సూచించారు. న్యాయ కళాశాలలు కేవలం బోధనకే పరిమితం కాకుండా పరిశోధన, నూతన ఆలోచనలకు కేంద్రాలుగా ఎదగాలని, ఏఐ కేవలం మనకు సహాయకారిగా ఉండాలే తప్ప యజమానిగా మారకూడదని స్పష్టం చేశారు.
సాధనం కావాలి: ప్రొఫెసర్ రెహమాన్
న్యాయవిద్య ద్వారా విద్యార్థుల్లో సమాజం పట్ల బాధ్యత, న్యాయం పట్ల అవగాహన పెంపొందించాలని బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మిజానూర్ రెహమాన్ సూచించారు. ప్రొఫెసర్ ఎన్ఆర్ మాధవ మీనన్ పేరిట ఏర్పాటు చేసిన గ్లోబల్ లీగల్ ఎడ్యుకేషన్ అవార్డును అందుకోవడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. తొలుత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాలతో సతరించారు.
కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహ్మద్ నవాజ్, తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్ పీ సామ్ కోషి, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ శివకుమార్ వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయవిద్యా సంస్థల ఉపకులపతులు, డీన్లు, ప్రొఫెసర్లు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

