రెజ్లింగ్ పోటీల్లో భారత కుస్తీ వీరుడు సుజీత్ కల్కల్ అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో ఒలింపిక్ చాంపియన్ సహా దిగ్గజ రెజ్లర్లను చిత్తు చేస్తూ వచ్చిన 23 ఏండ్ల సుజీత్ తుదిపోరులో ఓటమి అంచుల నుంచి కోలుకుని స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. తుదిపోరులో 10-9తో తజకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌మజీద్ కుదీవ్ను ఓడించాడు. ప్రత్యర్థి ఆరంభంలో ఆర్మ్ లాక్ వ్యూహంతో విరుచుకుపడటంతో సుజీత్ ఓ దశలో 2-9తో పరాజయం అంచుల్లో నిలిచాడు.
అయినా ఏమాత్రం ధైర్యం సడలని భారత రెజ్లర్ తన అద్భుత వేగం, సాంకేతిక నైపుణ్యంతో అనూహ్యంగా పుంజుకున్నాడు. వరుసగా 8 పాయింట్లు సాధించి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రత్యర్థి వెనుక భాగానికి వెళ్లి టేక్ డౌన్ మూవ్‌లతో పాయింట్ల వ్యత్యాసాన్ని తగ్గించుకుంటూ వచ్చాడు. పోటీ ముగియడానికి మరో 20 సెకన్లు మాత్రమే ఉందనగా నిర్ణాయక టేక్‌డౌన్‌తో 10-9 ఆధిక్యంలోకి వెళ్లి, ఆ ఒక్క పాయింట్ ఆధిక్యాన్ని కాపాడుకుని పసిడిని సొంతం చేసుకున్నాడు. ఫైనల్ చేరే క్రమంలోనూ సుజీత్ అద్భుత విజయాలు సాధించాడు.
సెమీఫైనల్లో జపాన్ ఒలింపిక్ చాంపియన్ కోటారో కియోకాకు షాకిచ్చాడు. తొలి పీరియడ్‌లో 0-2తో వెనుకబడ్డా, రెండో దశలో పుంజుకుని మ్యాచ్‌ను 3-3తో ముగించాడు. ఎక్కువ పాయింట్ల దాడి ఆధారంగా సుజీత్ విజేతగా నిలిచాడు. అంతకుముందు క్వార్టర్స్‌లో ఇరాన్ రెజ్లర్ అబ్బాస్ ఇబ్రహీంజాదేకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 10-0తో టెక్నికల్ సుపీరియారిటీ విధానంలో చిత్తు చేశాడు. కాగా, మహిళల 50 కేజీ కేటగిరీ కాంస్య పతక పోరులో దీపాన్షి ఓడిపోగా.. 76 కేజీల విభాగంలో ప్రియా మాలిక్, 125 కేజీ విభాగంలో రజత్ రాహుల్ పతక పోటీలకంటే ముందే నిష్క్రమించారు.
గత ఆసియా గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్‌లో బజ్రంగ్ పునియాకు నేరుగా ఎంట్రీ ఇవ్వడంతో సుజీత్‌కు అవకాశం దక్కలేదు. ఆ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేసినా ఉపశమనం లభించలేదు. అయితే ఈసారి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. గత 12 నెలల్లో అండర్-23 ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, జాగ్రెబ్ ఓపెన్, తిరానా టైటిళ్లను గెలుచుకున్న సుజీత్ ఇప్పుడు ఆసియాడ్ స్వర్ణం కూడా నెగ్గి 2028 ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో భారత పతక ఆశాకిరణంగా నిలిచాడు.