హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు అంతు లేకుండాపోతున్నది. పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకూ అగ్రవర్ణాల కామవాంఛలకు బలవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట.. ప్రతిరోజూ ఓ దళిత, గిరిజన బిడ్డ చెరచబడుతున్నదనడానికి.. తాజాగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ విడుదల చేసిన నివేదికలే సాక్ష్యం. 2023 నుంచి.. 2026 జూలై వరకు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను కమిషన్ విడుదల చేసింది.
ఆ నివేదికల ఆధారంగా తెలంగాణలో దారుణమైన కుల వివక్ష, భయంకరమైన భౌతిక దాడులు ఎలా పెరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ లెకల ప్రకారమే 2023 నుంచి 2026 వరకు రాష్ట్రవ్యాప్తంగా 9,102 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో 213 హత్య కేసులు కాగా, 1,305 మంది బాలికలు, మహిళలపై లైంగికదాడులు జరిగాయి. సరైన ఆధారాలు సేకరించడంలో పోలీసుశాఖ నిర్లక్ష్యం, అట్రాసిటీ కేసుల ఫాలోఅప్‌లో ప్రభుత్వ అజమాయిషీ లోపించడంతో మూడేండ్లలో కేవలం 32 మందికే శిక్షలు పడ్డాయి. ఈ కాలానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్.. భూమి, అట్రాసిటీ, సర్వీస్ తదితర అంశాలకు సంబంధించిన 5,867 ఫిర్యాదులు స్వీకరించి.. వాటి పరిష్కారానికి తక్షణ చర్య తీసుకున్నది.
తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా ఎస్సీ సామాజిక వర్గంపైనే అత్యధికంగా దాడులు జరుగుతున్నాయి. గత మూడేండ్లలో ఎస్సీలే దాదాపు 159 మంది హత్యకు గురయ్యారు. రాష్ట్రంలో గడిచిన మూడేండ్లలో సగటున వారానికొక దళిత బిడ్డ హత్యకు గురయ్యాడు. గత మూడేండ్ల నుంచి ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఓ దళిత ఆడబిడ్డ అత్యాచారానికి గురవుతున్నట్టు నివేదికలు చెప్తున్నాయి. 2023 నుంచి గత జూలై వరకూ 54 మంది ఎస్టీలు హత్యకు గురికాగా.. 314 మంది గిరిజన బిడ్డలు లైంగికదాడికి గురయ్యారు.
క్షేత్రస్థాయిలో పరిస్థతి ఇంత దారుణంగా ఉంటే.. శిక్షలు పడేలా ఆధారాలు సేకరించడంలో, సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయడంలో పోలీసులు తీవ్రంగా విఫలమయ్యారనే వాదనలు దళిత సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. గడిచిన మూడేండ్లలో 32 మందికి మాత్రమే శిక్షలు పడ్డాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ తన నివేదికలో పేర్కొనడం తీవ్ర చర్చకు దారితీసింది. నిత్యం దళిత జపం చేస్తున్న ముఖ్యమంత్రికి పరిస్థితిని అంచనా వేయడంలో, దళితబిడ్డలపై జరుగుతున్న ఆకృత్యాలను నిరోధించడంలో సమయం సరిపోవడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లు దాటుతున్నా.. కుల వివక్ష, అసమానతలు రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయని ఎస్సీ ఎస్టీ కమిషన్ అభిప్రాయపడింది. నేటికీ దేవాలయాల్లోకి ప్రవేశాలు నిరాకరిస్తున్నారని, వినాయక ఉత్సవాల్లో వివక్ష పాటిస్తున్నారని, కులాంతర వివాహాలు చేసుకుంటున్న యువతీ, యువకులను నిర్భయంగా హత్యలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేసింది. ఆఖరికి కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఆర్థిక సహాయం అందించడంలోనూ, వారికి ఉద్యోగావకాశాలు కల్పించడంలోనూ నిర్లక్ష్యం కొనసాగుతున్నదని పేర్కన్నది.
మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలులో నిర్లక్ష్యం, వివక్ష కొనసాగుతున్నదని చెప్పింది. లైంగికదాడులకు గురవుతున్న బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసు, రెవెన్యూ శాఖలు చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని, పోలీసులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని కమిషన్ తేల్చింది. చివరికి బాధితులకు నష్టపరిహారం యుద్ధ ప్రాతిపదికన అందించాల్సిన విషయంలోనూ ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగ ఫలాలు పూర్తిస్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు అందడం లేదని తన నివేదిక లో పేర్కొన్నది. భూమిలేని ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ చేయకపోగా వివిధ ప్రాజెక్టుల ని ర్మాణాలకు ఎస్సీ, ఎస్టీల భూములను బలవంతంగా సేకరిస్తూ.. వారి భూముల్లో కూలీలుగా మారుస్తున్నారని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం కొనసాగుతున్నదని పేర్కొన్నది.
ఎస్సీ, ఎస్టీలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే లాకప్ హింసలకు గురిచేసిన ఘటనలు తెలంగాణలో కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం అమలు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ అమలు, భూమి సమస్యలు, విద్య, వైద్యం ఉపాధి కల్పన తదితర అంశాలపై రాష్ట్రస్థాయి శాఖలతో సమీక్షించామని, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమీక్షించి బాధితులకు అండగా నిలిచామని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చెప్పారు. తమ కార్యాలయంలో విచారణలు జరిపి అనేకమందికి బాధితులకు న్యాయం చేశామని వివరించారు. పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన షాద్‌నగర్ దళిత మహిళ సునీతకు అండగా నిలిచి, పోలీసులను సస్పెండ్ చేయించామని పేర్కొన్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో గిరిజనుల భూముల విషయంలో గిరిజన మహిళలపై పోలీసులు చేసిన దాడిపై స్పందించామని చెప్పారు. నల్లగొండ జిల్లాలో పోలీసు కస్టడీలో మరణించిన కర్ల రాజేశ్ కుటుంబానికి అండగా నిలిచామని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో దళిత యువకుడిపై దాడి చేసిన పోలీసులపై కేసులు పెట్టించామని తెలిపారు. అశ్వారావుపేటలో దళిత ఎస్సై శ్రీరాముల విషయంలో కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా చెంచు ఈశ్వరమ్మ, కుమ్రం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసి మహిళ, అదిలాబాద్ జిల్లా గుడి హత్నూర దళితులకు అండగా ఉన్నామని తెలిపారు. కులాంతర వివాహాలు చేసుకొని హత్యలకు గురైన కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ భరోసా ఇచ్చిందన్నారు.