న్యూఢిల్లీ, అక్టోబర్ 2: దేశ రాజధాని న్యూఢిల్లీ శుక్రవారం ఆందోళనలతో అట్టుడుకగా, నిరసనలతో ముంబై సహా దేశంలోని ప్రధాన నగరాలు దద్దరిలాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్), ఇతర ఎన్నికల ప్రక్రియల్లో అక్రమాలకు పాల్పడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు, పౌర సమాజ ప్రతినిధులు కదం తొక్కడంతో ఢిల్లీలోని జంతర్ మంతర్, ఇతర నగరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో జరిగిన ఆందోళనలో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్యూఐ, వామపక్ష మద్దతు గల ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ తదితర విద్యార్థి, యువజన సంఘాలు పెద్దయెత్తున పాల్గొన్నాయి.
దీంతో రాజధానిలో 1100 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ముంబైలో జరిగిన ఆందోళన కూడా తీవ్ర నిర్బంధాల మధ్య సాగింది. అలాగే జమ్ము కశ్మీర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో, జైపూర్‌లో ఆప్ ఆధ్వర్యంలో, పాట్నా, లక్నో తదితర నగరాల్లో విపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఢిల్లీలో ఆందోళనను అడ్డుకోవడానికి ప్రభుత్వం న్యూఢిల్లీ అంతటా ఆంక్షలు విధించింది. 11 మెట్రో స్టేషన్లను మూసివేశారు. అయినా నిరసనకారులు లెక్కచేయకుండా బారికేడ్లను చీల్చుకుంటూ వచ్చి నిరసనలో పాల్గొనడంతో వందలాది మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు.
కాంగ్రెస్ యూత్ గ్రూప్ ఎన్ఎస్యూఐ, ఇతర అనుబంధ సంస్థల కార్యకర్తలు పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుని ఆందోళనా స్థలికి చేరుకోవడానికి ప్రయత్నించారు. ఆందోళనకారులను నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకుంటూ వెళ్లి పోలీస్ వ్యాన్లు, బస్లలోకి విసిరేశారు. అలాగే ఆందోళనలో పాల్గొన్న మహిళల పట్ల మగ పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. కొద్ది సంఖ్యలో మాత్రమే మహిళా పోలీసులు కన్పించారు. ‘మోదీ భయపడినప్పుడల్లా పోలీసులు ముందుకొస్తారు, మోదీ జ్ఞానేశ్ ఓట్ల దొంగలు’ అంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. కేంద్ర బలగాలు, ఇతర పారామిలిటరీ దళాలు సహా 4 వేల మంది పోలీసులను ఢిల్లీ వ్యాపంగా మోహరించారు. ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్, సంజీవ్ ఝాలను జంతర్ మంతర్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనా స్థలికి రావడానికి ప్రయత్నించిన వందలాది మందిని వివిధ ప్రదేశాల్లో అరెస్ట్ చేశారు. అలా అరస్టైన వారిలో ఢిల్లీ మాజీ సీఎం అతిశీ, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఉన్నారు.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిశీ, ఆప్ నేతలు సౌరభ్ భరద్వాజ్ సంజీవ్ ఝా, అనురాగ్ దండా, సంజయ్ సింగ్‌లతో పాటు ఏఐఎస్ఏ, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐలకు చెందిన వందలాది మంది వామపక్ష నేతలు, కార్యకర్తలు, ప్రజలను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎంఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, బృందా కారత్, ఎస్ఎఫ్ఐ జాతీయ నేతలు ఎం సజీ, సృజన్ భట్టాచార్య, అయిషో ఘోష్, ఎస్ శిల్ప, డీవైఎఫ్ఐ నేతలు హిమఘ్నరాజ్ భట్టాచార్య, ఏఏ రహీమ్, సంజీవ్ కుమార్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విపక్షాల ఆందోళనను పురస్కరించుకుని ఎన్సీఆర్ పరిధిలోని 11 మెట్రో స్టేషన్లను మూసి వేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ను బంద్ చేశారు. డ్రోన్లతో గట్గి నిఘాను ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ నిలిచిపోవడంతో గూగుల్ పే, ఫోన్ పే లాంటి సేవలు, ఉబర్ ఓలా, జొమాటో వంటి సేవలు నిలిచిపోయాయి.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై బెంగాల్ మాజీ సీఎం మమత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల హక్కులు అదృశ్యమవుతున్నాయని ఆరోపించారు. సీఈసీని తాను వానిష్ కుమార్ (హరించే/అదృశ్యం చేసే కుమార్)గా పిలుస్తానని అన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న ఓటర్ల హక్కులను హరించేలా ఆయన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ ముంబై శివాజీపార్క్‌లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో వేలాది మంది నిరసనకారులు పోటెత్తారు. పోలీసులు ఆంక్షలు విధించినా, పలు చోట్ల బారికేడ్లను ఏర్పాటు చేసినా వేలాది మంది నిరసన స్థలికి చేరుకున్నారు. త్రివర్ణ పతాకాలు, ప్లకార్డులు చేతబట్టిన ఆందోళనకారులు జ్ఞానేశ్.. ప్రజాస్వామ్యంపై నీకు నమ్మకం లేదా?, జ్ఞానేశ్ వెంటనే పదవి నుంచి తప్పుకో, జ్ఞానేశ్ బ్రో..
రిజైన్ చేయి, నమ్మకద్రోహి జ్ఞానూ వెళ్లిపో అంటూ నినాదాలు చేశారు. బాలీవుడ్ నటులు నసీరుద్దీన్ షా, షబనా ఆజ్మీ, గాయకుడు విశాల్ డడ్లానీ, మహాత్మాగాంధీ మనవడు తుషార్ గాంధీ తదితరులు హాజరై సీజేపీ ఆందోళనకు మద్దతు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎంతో అసమర్ధంగా ఉందని, అందుకే తాము నీట్ ఉద్యమం జరిగిన రెండు నెలల లోపే మరో ఉద్యమం చేపట్టాల్సి వచ్చిందని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అన్నారు.
గాంధీ జయంతి రోజున ఆందోళన చేస్తున్న వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలువురు విపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. ‘ఈ రోజు గాంధీ జయంతి.. ఆందోళన చేసిన వారి పట్ల పోలీసుల తీరు సిగ్గుచేటు. వారిని అమానుషంగా లాగిపడేసి బస్సుల్లో కుదేశారు. గాడ్సే భావాలున్న వారు మాత్రమే ఇలా చేస్తారు’ అని ఆర్జేడీ నేత మనోజ్ ఝా పేర్కొన్నారు. ‘గాంధీని గాడ్సే హత్యచేశాడు. గాడ్సే భావజాలం ఉన్న వ్యక్తులు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. వారు ఓటు చోరీ ద్వారా నేడు ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు’ అని మార్క్సిస్ట్ నేత బృందా కారత్ విమర్శించారు.